షారుక్ కొడుకు డెబ్యూ.. చిక్కుల్లో రణబీర్ కపూర్..
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ రీసెంట్ గా డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.;
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ రీసెంట్ గా డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. హీరో అవుతారని అంతా ఎక్స్పెక్ట్ చేయగా.. ఆర్యన్ దర్శకుడిగా అరంగేట్రం చేశారు. డెబ్యూగా బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ ను రూపొందించారు. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో ఆ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
బీ టౌన్ సినీ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లో జరిగే సంగతులు, హీరో కావాలనుకునే ఓ యువకుడి స్టోరీతో పాటు ఇద్దరు అగ్ర నిర్మాతల మధ్య ఇరుక్కున్న నటుడి కథే సిరీస్! అయితే ఆ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, దర్శకధీరుడు రాజమౌళి సహా పలువురు అతిథి పాత్రల్లో మెరిశారు. రణబీర్ కపూర్ క్యామియో రోల్ లో నటించారు.
అయితే ఇప్పుడు ఆయన బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ తో చిక్కుల్లో పడ్డారు. సిరీస్ లో నిషేధిత ఈ-సిగరెట్ వాడకాన్ని ప్రోత్సహించారన్న ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది. రణబీర్ తో పాటు నిర్మాతలు, నెట్ ఫ్లిక్స్ పై వెంటనే కేసు నమోదు చేయాలని ముంబై పోలీసులను ఆదేశించింది.
వెబ్ సిరీస్ లో ఒక సీన్ లో రణబీర్ కపూర్ ఎలాంటి చట్టబద్ధమైన హెచ్చరికలు లేకుండా ఈ-సిగరెట్ తాగుతూ కనిపించారు. దీంతో వినయ్ జోషి అనే వ్యక్తి ఇటీవల మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. నిషేధంలో ఉన్న ఈ-సిగరెట్ల వాడకంతో రణబీర్ చేసిన ఆ సన్నివేశం గ్లామర్ గా చూపిస్తోందని ఫిర్యాదులో ఆరోపించారు.
అది యువతను తప్పుదోవ పట్టించేలా ఉందని కూడా ఫిర్యాదులో ఆరోపించారు. ఇలాంటివి చట్టవిరుద్ధమైన చర్యలను ప్రజా ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని ఫిర్యాదుదారుడు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వెంటనే ఎన్ హెచ్ ఆర్ సీ.. రణబీర్ తో పాటు సంబంధిత అందరిపైనా కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
ఆ తర్వాత యువతపై చెడు ప్రభావం చూపే ఇలాంటి కంటెంట్ ను నిషేధించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను కోరింది. సంబంధింత కార్యదర్శికి నోటీసులు కూడా పంపింది. అయితే దేశంలో ఈ-సిగరెట్ల తయారీదారులు, దిగుమతి దారుల వివరాలపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం - 2019ను ఉల్లంఘించారని, రెండు వారాల్లోగా రిపోర్ట్ సమర్పించాలని గడువు విధించింది.