250 కోట్ల ఖ‌రీదైన విలాసం స్టార్ కిడ్ సొంతం

ముంబైలో అత్యంత ఖ‌రీదైన క‌పూర్ సంస్థాన‌పు వార‌స‌త్వ ఆస్తి నాలుగు త‌రాల‌ను చూడ‌బోతోంది.;

Update: 2025-08-25 16:30 GMT

ముంబైలో అత్యంత ఖ‌రీదైన క‌పూర్ సంస్థాన‌పు వార‌స‌త్వ ఆస్తి నాలుగు త‌రాల‌ను చూడ‌బోతోంది. ఇప్పుడు నాలుగో త‌రంలో ర‌ణ‌బీర్ కపూర్ - ఆలియా దంప‌తుల కుమార్తె రాహా క‌పూర్ కి ఇది కానుక‌గా అందింది. దాదాపు 250 కోట్ల విలువ చేసే ఈ భ‌వంతి ఇప్పుడు ముంబై మ‌హాన‌గ‌రంలో అత్యంత విశిష్ఠ‌త క‌లిగినది. పాకిస్తానీ క‌రెన్సీలో ఈ ఇంటి విలువ దాదాపు 970కోట్ల రూపాయ‌లు.

రాజ్ కపూర్ - కృష్ణ రాజ్ కపూర్ పేరుతో ఇంత‌కుముందు ఈ ప్రాప‌ర్టీని అభిమానులు పిలుచుకునేవారు. ఆ త‌ర్వాత 1980 లలో రిషి కపూర్ - నీతు కపూర్ లకు నిలయంగా మారింది. నేడు రణబీర్ -అలియా జ‌మానాలోకి చేరుకుంది. త‌దుప‌రి ఈ ఇల్లు ర‌ణ‌బీర్ క‌పూర్ కుమార్తె రాహా క‌పూర్ పేరుతో పిలుపందుకుంటోంది. కపూర్ వంశ‌పు నాలుగు త‌రాల పేర్లు ఈ ఇంటి పేరుతో విన‌ప‌డ‌టం ఆస‌క్తిని క‌లిగించే విష‌యం. ఈ విలాసాల భ‌వంతి సౌంద‌ర్యం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. చూస్తుంటే ఇది గార్డెన్‌ల‌తో నిండిన గాజు ఇల్లులా ఎంతో శోభాయ‌మానంగా క‌నిపిస్తోంది. గాజు ప్యానెళ్లు, షాండ్లియ‌ర్లు, పైకి కింద‌కు క‌దిలే క‌ప్పుల‌తో ఇది అధునాత‌న సాంకేతిక‌త‌తో రూపొందించిన డిజైన‌ర్ హౌస్. ఈ భ‌వంతి నుంచి అంద‌మైన దృశ్యాల‌ను చూడ‌గ‌లం. ఎటు చూసినా ప‌చ్చ‌ని వృక్ష‌జాతి ఈ ఇంటి అందాన్ని ప‌దింత‌లు పెంచింది. ఈ భ‌వంతి నిర్మాణం క‌పూర్ అభిరుచికి నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది.

ఈ విలాసాల భ‌వంతి ఇప్పుడు రణబీర్ -ఆలియా జంట ఇమేజ్ ని అమాంతం పెంచుతోంది. ముంబైలో అత్యంత ప్ర‌త్యేక‌త క‌లిగిన సెల‌బ్రిటీ క‌పుల్ గా వారి పేరును చ‌రిత్ర‌కెక్కిస్తుంది. అందుకే ఈ ఇల్లు వారి వ్యక్తిగ‌త ప్ర‌యాణంలో ఎంతో ప్ర‌త్యేకంగా మారింది. బ్ర‌హ్మాస్త్ర చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఆలియా, ర‌ణ‌బీర్ ఒక‌రినొక‌రు క‌లుసుకున్నారు. ఆ త‌ర్వాత ప్రేమించుకుని పెద్ద‌ల్ని ఒప్పించి పెళ్లాడారు. ప్ర‌స్తుతం రాహా క‌పూర్ కి త‌ల్లిదండ్రులుగా మారారు. ఆ ఇద్ద‌రూ ఎవ‌రికి వారు కెరీర్ ప‌రంగా బిజీ బిజీగా ఉన్నారు. ఈ బిజీ స‌మ‌యంలోనే అత్యంత విలాస‌వంత‌మైన నిర్మాణాన్ని వారు ప‌ర్య‌వేక్షిస్తూ ఉన్నారు. ఎట్ట‌కేల‌కు భ‌వంతి స‌ర్వాంగ సుంద‌రంగా రెడీ అయ్యి, పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంచింగ్ కి సిద్ధ‌మైంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ర‌ణ‌బీర్ క‌పూర్ త‌దుప‌రి వ‌రుస‌గా భారీ చిత్రాల్లో న‌టిస్తున్నారు. నితీష్ తివారీతో రామాయ‌ణం ఫ్రాంఛైజీ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన‌ది. ఈ ఫ్రాంఛైజీలో మూడు భాగాల సినిమా కోసం 4000 కోట్లు ఖ‌ర్చు చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. ఇప్ప‌టివ‌ర‌కూ ఒక భార‌తీయ సినిమా క‌థానాయ‌కుడిపై ఇంత పెద్ద మొత్తాన్ని పెట్టుబ‌డిగా పెట్ట‌డం ఇదే మొద‌టిసారి. భ‌న్సాలీ `ల‌వ్ అండ్ వార్`లో ర‌ణ‌బీర్- ఆలియా జంట‌గా న‌టిస్తున్నారు. అలాగే య‌ష్ రాజ్ ఫిలింస్ లో ధూమ్ 4లో ర‌ణ‌బీర్ న‌టిస్తాడు.

Tags:    

Similar News