రణబలి.. అసలు కథ ఇదన్నమాట
రణబలి ప్రమోషనల్ కంటెంట్ చూసినప్పటి నుంచి ఇదొక భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా అనే అంచనాలు పెరిగిపోయాయి.
రణబలి ప్రమోషనల్ కంటెంట్ చూసినప్పటి నుంచి ఇదొక భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా అనే అంచనాలు పెరిగిపోయాయి. ట్రైలర్ లో కనిపించిన గుర్రాలు, కత్తులు, ఆంగ్లేయులతో యుద్ధాలు చూసి ఇదొక యాక్షన్ ఫీస్ట్ అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ అసలు ఈ సినిమా సోల్ ఏంటన్నది లేటెస్ట్ ఈవెంట్ లో దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ పూసగుచ్చినట్లు చెప్పేశారు. కేవలం కమర్షియల్ హంగుల కోసమే ఈ కథ పుట్టలేదని, దీని వెనుక చరిత్రలో కలిసిపోయిన ఒక మహా విషాదం దాగి ఉందని ఆయన మాటలతో క్లారిటీ వచ్చేసింది.
రాయలసీమ ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన ఒక బుర్రకథ వీరుడి స్ఫూర్తితో రాహుల్ ఈ కథను మొదలుపెట్టారు. అదే సమయంలో దక్షిణ భారతదేశాన్ని వణికించిన మహా కరువు గురించి చదవడం ఆయన్ని తీవ్రంగా కలిచివేసిందట. దాదాపు నూట యాభై ఏళ్ల క్రితం కేవలం రెండేళ్ల వ్యవధిలోనే కోటి మంది ఆకలితో చనిపోయారన్న వాస్తవం ఆయనకు నిద్ర పట్టనివ్వలేదని చెప్పారు. ఇంతటి దారుణమైన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ఎందుకు దాచేశారో అన్న ఆవేదన నుంచే ఆయన ఈ కథకు ప్రాణం పోసినట్లు వివరణ ఇచ్చారు.
ఇలాంటి కథలకు భారీ సెట్లు, ఫైట్లు ఉంటే సరిపోదు. ఆకలితో అలమటించిన ఆ కుటుంబాల బాధ ప్రేక్షకుడికి బలంగా కనెక్ట్ కావాలి. ఆ పరదేశస్తుల స్వార్థం చూసి థియేటర్లో జనాలకు కోపం రావాలి. ఆ ఎమోషన్ కరెక్ట్ గా పండినప్పుడే జనాల తరఫున హీరో కత్తి పడితే వచ్చే ఎలివేషన్ వేరే లెవెల్ లో ఉంటుంది. అప్పుడు ఫైట్ సీన్ కూడా విడిగా ఇరికించిన మాస్ బ్లాక్ లా కాకుండా, కథలో భాగంగానే అనిపిస్తుంది.
ఈ బరువైన పాత్ర కోసం విజయ్ దేవరకొండను ఎంచుకోవడానికి గల కారణాన్ని కూడా దర్శకుడు బయటపెట్టాడు. చిన్నప్పుడు చందమామ పుస్తకాల కవర్ పేజీల మీద కత్తి, గుర్రం పట్టుకుని కనిపించే వీరుడి కటౌట్ విజయ్ లో కనిపించిందట. దానికి తోడు పాత్ర కోసం ఏడాది పాటు ప్రాణం పెట్టే డెడికేషన్ ఉండటంతో వేరే ఆప్షన్ వైపు చూడలేదని రాహుల్ చెప్పారు.
రణబలి టైటిల్ వెనుక కూడా ఒక బలమైన జస్టిఫికేషన్ ఉంది. కేవలం యుద్ధం నేపథ్యం మాత్రమే కాకుండా, కుమారస్వామి రూపానికి కూడా ఈ టైటిల్ కు లింక్ ఉందట. అంటే చారిత్రక కథకు ఒక స్పిరిచ్యువల్ లేయర్ ను కూడా దర్శకుడు యాడ్ చేశాడు. రెండేళ్లు కేవలం రీసెర్చ్ కోసమే కేటాయించి, మరో రెండేళ్లు నిర్మాణ పనుల కోసం కష్టపడి టీమ్ అంతా ఈ సినిమాను ఒక యజ్ఞంలా పూర్తి చేసినట్లు వివరణ ఇచ్చారు.
అక్టోబర్ 16న రణబలి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్ లో కమర్షియల్ యాంగిల్ ను హైలైట్ చేసిన దర్శకుడు, తన స్పీచ్ తో ఆ యాక్షన్ వెనుక ఉన్న ఎమోషనల్ సోల్ ను జనాల్లోకి తీసుకెళ్లాడు. చరిత్రలోని చీకటి కోణానికి, బుర్రకథలోని ఒక వీరుడి ఆవేశాన్ని జోడించి రాహుల్ రాసుకున్న ఈ పాయింట్ వినడానికి చాలా బాగుంది. తెరమీద కరెక్ట్ గా ప్రజెంట్ చేయగలిగితే మాత్రం టాలీవుడ్ కు మరో భారీ బ్లాక్ బస్టర్ దొరికినట్లే.