శివగామిని కొత్త అవతార్‌కి మార్చిన వర్మ...!
రామ్ గోపాల్ వర్మ నుంచి సినిమా వస్తుందంటే ఒకప్పుడు ఉన్నంత ఉత్సాహం, ఆసక్తి ఇప్పుడు లేదు అని చెప్పక తప్పదు.;
రామ్ గోపాల్ వర్మ నుంచి సినిమా వస్తుందంటే ఒకప్పుడు ఉన్నంత ఉత్సాహం, ఆసక్తి ఇప్పుడు లేదు అని చెప్పక తప్పదు. ఆయన సినిమాల మేకింగ్ పై ఆసక్తి తగ్గించడం వల్లే ప్రేక్షకులు ఆయన సినిమాల పట్ల ఆసక్తి తగ్గించారు అనేది చాలా మంది అభిప్రాయం. వర్మ శ్రద్ద పెట్టి సినిమాలు తీస్తే ఇప్పటికీ అద్భుతాలను ఆవిష్కరిస్తాడు అంటూ ఆయన అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. కానీ వర్మ ప్రతి సినిమాను సరదాగా ప్రకటిస్తున్నాడు, సీరియస్‌నెస్ లేకుండా రూపొందిస్తున్నాడు, లైట్ మోడ్ అన్నట్లుగా విడుదల చేస్తున్నాడు. దాంతో సినిమాలన్నీ కూడా ఇలా వచ్చి అలా వెళ్లి పోతున్నాయి. ఆయన మార్క్ ఎక్కడ కూడా కనిపించలేదు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేస్తున్న సినిమా ఏంటి అంటే చాలా తక్కువ మంది మాత్రమే చెప్పగలరు. చాలా మంది వర్మ మళ్లీ ఒక సినిమా తీస్తున్నాడా అన్నట్లుగానే మాట్లాడుతారు. వర్మ ఇప్పుడు పోలీస్ స్టేషన్ మే భూత్ సినిమాను రూపొందిస్తున్న విషయం తెల్సిందే.
రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా...
సాధారణంగా వర్మ ప్రతి సినిమాను కొన్ని నెలల గ్యాప్‌లోనే పూర్తి చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం పోలీస్ స్టేషన్ మే భూత్ సినిమాకు ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. మనోజ్ బాజ్‌పాయి, జెనీలియా ముఖ్య పాత్రల్లో ఈ సినిమాను వర్మ ప్రకటించిన విషయం తెల్సిందే. సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఏదో ఒక అప్‌డేట్‌ను వర్మ ఇచ్చి వార్తల్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ జనాలు మాత్రం ఈ సినిమా సైతం వర్మ నుంచి వచ్చిన గత చిత్రాల మాదిరిగానే పేలవంగా ఉంటుందని భావిస్తున్నారు. అందుకే ఈ సినిమాను పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ కొందరు మాత్రం ఈ సినిమాలో మ్యాటర్ ఉంటుంది అనే విశ్వాసంను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతుందని వర్మ స్వయంగా ప్రకటించాడు.
పోలీస్ స్టేషన్ మే భూత్ సినిమాలో...
ఒక వైపు బాహుబలి : ది ఎపిక్ థియేటర్‌లలో ఉంది, దాంతో శివగామి గురించి మరోసారి చర్చ జరుగుతోంది. వెండితెరపై శివగామిగా రమ్యకృష్ణను అలా చూస్తూ ఉంటే చూపు తిప్పలేక పోతున్నామని, రాజమతలు ఉంటే ఇలాగే ఉంటారా అన్నట్లుగా రమ్యకృష్ణ నటించిందని ఈ జనరేషన్ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ శివగామిని వెండి తెరపై చూస్తున్నారు. రాజమాతగా రమ్యకృష్ణను వెండితెరపై చూసిన వారు ఇప్పుడు వర్మ షేర్ చేసిన ఆమె పోస్టర్ చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. బి గ్రేడ్ పాత్ర అన్నట్లుగా ఆమె ఫోజ్ ఉందని, శివగామి వంటి పాత్రను వేసిన రమ్యకృష్ణకు ఇలాంటి పాత్ర చేయాల్సిన అవసరం ఏంటో అంటూ చాలా మంది విమర్శిస్తున్నారు. అయితే రమ్యకృష్ణ పాత్రల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆమె నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కావడం వల్లే ఇలాంటి పాత్రను ఎంపిక చేసుకుని ఉంటారు అనేది కొందరి మాట.
వర్మ సినిమాలో రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో...
రమ్యకృష్ణను ఈ మధ్య కాలంలో చూడని విధంగా వర్మ చూపించడంతో అంతా కూడా షాక్ అవుతున్నారు. సినిమాలో మొదట ఆమెను భూత్ గా చూపిస్తాడేమో అని అనుకున్నారు. కానీ ఆయన స్వయంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ ద్వార పోలీస్ స్టేషన్ మే భూత్ లో రమ్యకృష్ణ దెయ్యం కాదు అని క్లారిటీ ఇచ్చాడు. దాంతో ఆమె నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తూ ఉండవచ్చు అంటున్నారు. సినిమా కథ గురించి, వర్మ తీసుకున్న పాయింట్ గురించి తెలిసిన కొందరు ప్రేక్షకులు సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హిందీలో రూపొందిన ఈ సినిమాను తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. రమ్యకృష్ణ నటించడంతో తెలుగు, తమిళంలో సినిమాకు బజ్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగా సినిమా ఉంటే బాగుండు అని వర్మ అభిమానులు కోరుకుంటున్నారు. మరి అది సాధ్యమేనా అనేది చూడాలి.