కృష్ణవంశీతో విడాకులు తీసుకున్నారా? రమ్యకృష్ణ స్పందన ఇదీ!
| ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీతో విడాకులు తీసుకుంటున్నారనే వార్తల్లో నిజం లేదని నటి రమ్యకృష్ణ స్పష్టం చేశారు. వేర్వేరు నగరాల్లో ఉండటానికి కెరీర్, కుమారుడి చదువు, భవిష్యత్తే కారణమని తెలిపారు. తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని, బంధం బలంగా ఉందని ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే 'అమ్మోరు' సినిమాలో అమ్మోరి పాత్రను చిత్రీకరించడం తన కెరీర్‌లోనే అత్యంత క్లిష్టమైన అనుభవమని గుర్తుచేసుకున్నారు.
టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ.. తన భర్త, ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ విడాకులు తీసుకోబోతున్నారంటూ చాలాకాలంగా పుకార్ ఉంది. ఈ సోషల్ మీడియా పుకార్లపై ఎట్టకేలకు రమ్యకృష్ణ స్పందించారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్యకృష్ణ.. తమ వైవాహిక జీవితంపై వస్తున్న వదంతులన్నింటికీ ఘాటుగా ఫుల్‌స్టాప్ పెట్టారు. తన భర్త కృష్ణవంశీతో తాను విడిపోయినట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని.. అవన్నీ కేవలం నిరాధారమైన ప్రచారాలు మాత్రమేనని స్పష్టం చేశారు. తామిద్దరం ఇప్పటికీ భార్యాభర్తలమేనని.. తమ బంధం ఎంతో బలంగా ఉందని రమ్యకృష్ణ తేల్చిచెప్పారు.
తాము వేర్వేరు నగరాల్లో ఉండటం వల్లే ఇలాంటి రూమర్లు పుట్టుకొస్తున్నాయని రమ్యకృష్ణ వివరణ ఇచ్చారు. కెరీర్ పరమైన బిజీ షెడ్యూల్స్.. ముఖ్యంగా తమ కుమారుడి భవిష్యత్తు.. చదువు నిమిత్తం తాము చెన్నై- హైదరాబాద్ నగరాల్లో వేర్వేరుగా నివసించాల్సి వస్తోందని వెల్లడించారు. తమ కుమారుడు పుట్టిన సమయంలో తాను సీరియల్స్, షూటింగ్స్‌తో బిజీగా ఉండి తరచూ చెన్నై-హైదరాబాద్ మధ్య ప్రయాణించేదాన్నని గుర్తుచేసుకున్నారు. ఆ ప్రయాణాల వల్ల బాబు అనారోగ్యానికి గురికావడంతో.. అతడి ఆరోగ్యం , చదువు దృష్ట్యా చెన్నైలోనే స్థిరంగా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని, కేవలం ఇద్దరి వృత్తిపరమైన బాధ్యతలు, కుటుంబ అవసరాలపై ఒకరికొకరం అవగాహనతోనే ఇలా వేర్వేరు నగరాల్లో ఉంటున్నామని రమ్యకృష్ణ స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండనని.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను బయటపెట్టడం తనకు అస్సలు ఇష్టం ఉండదని పేర్కొన్నారు. తాను మౌనంగా ఉండటాన్ని కొందరు అలుసుగా తీసుకుని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.
రమ్యకృష్ణ ఇచ్చిన క్లారిటీతో కృష్ణవంశీతో విడాకుల వ్యవహారంపై ఇన్నాళ్లుగా సాగుతున్న ఊహాగానాలకు పూర్తిగా తెరపడింది. ఒకవైపు వైవాహిక జీవితాన్ని సమన్వయం చేసుకుంటూనే.. మరోవైపు సినిమాల్లో వరుస అవకాశాలతో రమ్యకృష్ణ దూసుకెళ్తున్నారు. వ్యక్తిగత విషయాలపై అనవసరమైన వదంతులను నమ్మవద్దని ఈ సందర్భంగా అభిమానులకు, నెటిజన్లకు సీనియర్ నటి విజ్ఞప్తి చేశారు.
నా కెరీర్ లో అత్యంత క్లిష్టమైన పాత్ర:
అలాగే ఆ రోజుల్లో `అమ్మోరు` చిత్రంలో విలన్ ని సంహరించే అమ్మోరి పాత్రలో నటించినప్పుడు ఆ సన్నివేశాన్ని ఒరిజినల్ గా లైవ్ గా చిత్రీకరించాల్సి వచ్చిందని, ఇప్పుడు ఉన్నంతగా ఆరోజుల్లో గ్రాఫిక్స్ అందుబాటులో లేవని రమ్య కృష్ణ తెలిపారు. అప్పుడే కంప్యూటర్ గ్రాఫిక్స్ గురించి అవగాహన మొదలైంది. ఇప్పుడు అయితే ఆ పాత్రను చేయడం చాలా సులువు. సాంకేతికంగా అడ్వాన్స్ డ్ గా ఉన్నాము.
నా కెరీర్ మొత్తంలో అత్యంత సంక్లిష్ఠమైన పాత్ర అదే. నన్ను ఒక కర్రకు కట్టేసి అమ్మోరిలా చేతులు కదిల్చేలా డైరెక్షన్ ఇచ్చేవారు. అలా రోజంతా ఆ కర్రకే అతుక్కుని ఉండిపోయేదానిని. మధ్యలో టాయ్ లెట్ కి వెళ్లాలన్నా కుదరని పరిస్థితి. వాళ్లు వెళ్లమనేవారకూ ఉండాల్సి వచ్చేదని కూడా రమ్యకృష్ణ తెలిపారు.