టాయ్‌లెట్ వస్తే బిస్లరీ బాటిల్లోనే.. నాటి కష్టాలపై సీనియర్ నటి!
| సీనియర్ నటి రమ్యకృష్ణ తన కెరీర్ ఆరంభంలో షూటింగ్స్ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. అప్పట్లో క్యారవాన్లు, వాష్‌రూమ్స్ ఉండేవి కావని, అంబాసిడర్ కార్లలోనే బిస్లరీ బాటిల్ సాయంతో సర్దుకోవాల్సి వచ్చేదని తెలిపారు. కచ్చం కాస్ట్యూమ్స్‌తో అవుట్‌డోర్ షూటింగ్స్‌లో ఎన్నో ఇబ్బందులు పడ్డామని గుర్తుచేసుకున్నారు. నేటి హీరోయిన్లు మెరుగైన వసతులు పొందుతున్నారని వ్యాఖ్యానించారు.
రెండేళ్ల క్రితం మలయాళ చిత్రసీమలో మహిళల పరిస్థితులపై అధ్యయనం చేసిన జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సెట్లలో కనీస వసతులు కూడా లేకుండా షూటింగులకు ఆడవారిని పిలుస్తున్నారని కమిటీ స్పష్ఠంగా పేర్కొంది. వారికి టాయ్‌లెట్లు సహా ఇతర వసతుల విషయంలో ఉన్న సమస్యలపై కూలంకుశంగా చర్చించింది. అయితే ఇటీవలి ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ చెప్పిన ఈ విషయం హేమ కమిటీ మెంబర్స్ విని ఉంటే ఏమయ్యేదో ఏమో కానీ...
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన అద్భుత నటనతో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటి రమ్యకృష్ణ.. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన కెరీర్ ఆరంభ రోజుల నాటి చేదు- తీపి జ్ఞాపకాలను షేర్ చేసారు. నేటి తరం హీరోయిన్లకు అందుబాటులో ఉన్న లగ్జరీ క్యారవాన్లు-ఆధునిక వసతులు అప్పట్లో ఏమాత్రం ఉండేవి కావని గుర్తుచేసుకున్నారు. కేవలం అంబాసిడర్ కార్లే తమకు దిక్కుగా ఉండేవని.. అవుట్‌డోర్ షూటింగ్స్‌కు వెళ్లినప్పుడు కనీస సౌకర్యాలు కూడా లేక ఎన్నో ఇబ్బందులు పడ్డామని రమ్యకృష్ణ ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
ముఖ్యంగా అప్పటి హీరోయిన్ల కాస్ట్యూమ్స్.. వాటి వల్ల ఎదురయ్యే ప్రాక్టికల్ సమస్యల గురించి రమ్యకృష్ణ ఓపెన్‌గా మాట్లాడారు. ఇప్పుడున్నట్లుగా అప్పట్లో దుస్తులు వేసుకోవడం అంత సులభంగా ఉండేది కాదని.. తామంతా కచ్చాలు వేసుకునేవాళ్లమని.. వాటికి అక్కడక్కడా స్టిచింగ్స్ ఉండేవని వివరించారు. షూటింగ్ లొకేషన్లలో కనీసం వాష్‌రూమ్స్ కూడా ఉండేవి కావని.. అలాంటి పరిస్థితుల్లో ఆ దుస్తులతో సర్దుకోవడం నటీమణులకు పెద్ద సవాలుగా మారేదని గుర్తు చేసుకున్నారు.
వాష్‌రూమ్స్ లేని సమయాల్లో తాము పడిన ఇబ్బందులను గుర్తుచేసుకుంటూ.. అంబాసిడర్ కార్లలోనే ఆ కచ్చం మధ్యలో నుంచి బిస్లరీ బాటిల్ సాయంతో సర్దుకోవాల్సి వచ్చేదని రమ్యకృష్ణ నిజాయితీగా చెప్పుకొచ్చారు. ఆ కష్టం గురించి పాడ్‌కాస్ట్‌లో ఎంత వివరణాత్మకంగా చెప్పినా అర్థం చేసుకోవడం కష్టమేనని.. ఆ ప్రక్రియ అత్యంత బాధాకరంగా ఉండేదని పేర్కొన్నారు. అప్పట్లో హీరోయిన్లు తెరపై గ్లామరస్‌గా కనిపించడం వెనుక ఇంతటి కఠినమైన శ్రమ దాగి ఉండేదని ఈ సీనియర్ నటి మాటల ద్వారా స్పష్టమైంది.
అయితే ఆ కష్టాలే తమను ఇంతటి ప్రతిభావంతులైన తారలుగా తీర్చిదిద్దాయని రమ్యకృష్ణ అభిప్రాయపడ్డారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకుని నిలబడే శక్తి ఆ రోజుల్లోనే అలవడిందని అన్నారు. ఆనాటి పరిస్థితులతో పోలిస్తే నేటి తరం నటీమణులు అత్యంత అదృష్టవంతులు అని.. అన్ని రకాల సదుపాయాల మధ్య పనిచేస్తున్నారని రమ్యకృష్ణ వ్యాఖ్యానించారు. సీనియర్ నటి తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయాలన్నిటినీ జస్టిస్ హేమ కమిటీ కూడా రివీల్ చేయడం విశేషం.
రమ్యకృష్ణ ఈ ఏడాది మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. అల్లు అర్జున్ `రాకా`లో ఒక కీలక పాత్రను పోషిస్తున్న రమ్య, డేవిడ్ రెడ్డి అనే ప్రయోగాత్మక చిత్రంలోను నటిస్తున్నారు. క్వీన్ అనే చిత్రంలో అవిభాజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారు.