40 భాషల్లో రిలీజ్‌ సరే.. ప్రమోషన్లలోనే ఎందుకింత‌ డైలమా?

దాదాపు రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం `రామాయణం` (పార్ట్1) విడుదలకు సమయం దగ్గరపడుతున్నా, చిత్రబృందం ప్రమోషన్ల విషయంలో వెనుకబడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Update: 2026-10-12 11:57 GMT

దాదాపు రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం `రామాయణం` (పార్ట్1) విడుదలకు సమయం దగ్గరపడుతున్నా, చిత్రబృందం ప్రమోషన్ల విషయంలో వెనుకబడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో నితిన్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ విదేశీ - స్వదేశీ మార్కెట్లలో ఆశించిన స్థాయిలో సౌండ్ చేయడం లేదనే చర్చ ఇప్పుడు ప్ర‌ధానంగా జరుగుతోంది. సోనీ పిక్చర్స్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థ వందల కోట్ల బడ్జెట్‌తో ప్రమోషన్లను హోరెత్తిస్తుందని అందరూ భావించినా ఆ దూకుడు ప్రాక్టిక‌ల్‌గా కనిపించడం లేదు. కనీసం గతంలో వచ్చిన కొన్ని భారీ చిత్రాలు లేదా ఇతర పౌరాణిక ప్రాజెక్ట్‌ల స్థాయిలో కూడా ప్రచారం లేకపోవడంతో.. మేకర్స్ అనుసరిస్తున్న వ్యూహంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ భారీ సినిమా ప్రచార వ్యూహంపై కొంత అస్ప‌ష్ఠత నెల‌కొంది. ఆరంభంలో అంత‌ర్జాతీయ మీడియాతో ఇంట‌ర్వ్యూలు వ‌గైరా హ‌డావుడి చేసినా కానీ ఇప్పుడు అది కూడా క‌నిపించ‌డం లేదు. కేవలం సాంప్రదాయ దేశీయ మార్కెటింగ్‌పైనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా 40 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే లక్ష్యంతో మేకర్స్ ముందుకు వెళ్తున్నా దానికి త‌గ్గ ప్ర‌చార‌ వ్యూహాలు కొర‌వ‌డ్డాయ‌ని విమ‌ర్శ‌లొస్తున్నాయి. ఆరంభంలో సినిమాకాన్ 2026 , శాన్ డియాగో కామిక్-కాన్ వంటి అంతర్జాతీయ వేదికలపై ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించారు. అంతేకాకుండా గ్లోబల్ యూట్యూబ్ సెన్సేషన్ మిస్టర్‌బీస్ట్ తో ముంబైలోని డిఎన్ఈజీ ఆఫీస్‌లో అనూహ్యమైన కొలాబరేషన్ నిర్వహించి కొద్దిమేర సౌండ్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఇప్పుడు రిలీజ్ ముంగిట స‌రైన ప్రమోష‌న్స్ చేయ‌క‌పోవ‌డంతో బ‌జ్ నీరుగారిపోయింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

గ్లోబల్ ప్రమోషనల్ అప్రోచ్‌పై దేశీయ ప్రేక్షకుల నుంచి, సినీ విశ్లేషకుల నుంచి అప్ప‌ట్లో కొంత‌మేర‌ ఆందోళనలు క‌నిపించాయి. సినిమా మార్కెటింగ్ ఎక్కువగా పశ్చిమ దేశాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంపైనే డిఎన్ఇజి దృష్టి పెట్టిందనే అభిప్రాయం బలపడింది. భారతీయులకు రామాయణంతో అత్యంత గాఢమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక అనుబంధం ఉన్నా.. ఇంటర్నేషనల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు.. IGN లాంటి వెస్ట్రన్ మీడియాతోనే ఎక్కువగా ఇంటర్వ్యూలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. అసలు సంస్కృతికి పుట్టినిల్లయిన అయోధ్య వంటి ప్రాంతాలను సెంటర్‌గా చేసుకుని ప్రమోషన్లు చేయకపోవడం.. కేవలం గ్లోబల్ రికగ్నిషన్ కోసం పాకులాడుతున్నారనే అపవాదుకు దారితీసింది.

మరోవైపు ప్రచార వ్యూహంలోని ఈ లోపాలపై సోషల్ మీడియాలో .. సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. స‌రిగ్గా రిలీజ్ ముందు ఇటీవ‌లి కాలంలో విదేశీ ప్ర‌మోష‌న్లు కూడా క‌నిపించ‌డం లేదు. అలాగే మన దేశంలోని ప్రేక్షకుల్లోకి దూసుకెళ్లే ప్ర‌చార వ్యూహాలు కూడా లేవు. క‌నీసం రిలీజ్ ముంగిట `ఆదిపురుష్` కి ఉన్న ప్ర‌మోష‌న్స్ కూడా `రామాయ‌ణ` చిత్రానికి లేవ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా ప్రచార వేగాన్ని కొంతమేర దెబ్బతీశాయనే చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా దసరా పండుగను పురస్కరించుకుని రానున్న రెండో ట్రైలర్ లాంచ్ ద్వారా ఈ డైలమాను వీడి, ప్రమోషన్లలో దూకుడుగా పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

40 భాషల్లో అంతర్జాతీయ స్థాయిలో ఒక భారతీయ ఇతిహాసాన్ని తీసుకువెళ్లాలనే నమిత్ మల్హోత్రా కల నిజంగా అభినందించదగ్గదే అయినా.. దానికి తగినట్లుగా ప్రేక్షకుల నాడిని పట్టడంలో మాత్రం ప్రచార వ్యూహం కొంతవరకు తడబడినట్లు కనిపిస్తోంది. నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ భారీ చిత్రం ఇకముందైనా తన ప్రచార జోరును పెంచి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్ర‌భావం చూపుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News