హీరో గది ముందు మద్యం బాబుల హాల్ చల్
ఈ సినిమా షూటింగ్ కోసం హీరో రామ్ రాజమండ్రిలోని ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటల్ షెరటాన్లో బస చేస్తున్నాడు.;
టాలీవుడ్ యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం ఆంధ్రా కింగ్ తాలూకా అనే క్రేజీ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేం పి. మహేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ ఓ ఫ్యాన్ బయోపిక్ తరహా పాత్రలో కనిపించనున్నాడు. సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ రాజమండ్రిలో జరుగుతోంది.
ఈ సినిమా షూటింగ్ కోసం హీరో రామ్ రాజమండ్రిలోని ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటల్ షెరటాన్లో బస చేస్తున్నాడు. అయితే, తాజాగా అదే హోటల్‌లో ఓ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి రామ్ బస చేసిన హోటల్ గదిలోకి ఇద్దరు అనుమానితులు ప్రవేశించిన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సంఘటనతో యూనిట్ సభ్యులు, హోటల్ సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే, సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి తమను హీరో టీమ్‌కి చెందిన వాళ్లమని చెబుతూ లిఫ్ట్ యాక్సెస్ ఇవ్వాలని హోటల్ సిబ్బందిని కోరారు. వీఐపీ గెస్ట్‌గా ఆరో ఫ్లోర్‌లో బస చేస్తున్న రామ్ గది వరకు లిఫ్ట్ యాక్సెస్ ఇచ్చారు. అనంతరం ఆ ఇద్దరు ఆరో ఫ్లోర్‌కు వెళ్లి అక్కడి హౌస్ కీపింగ్ సిబ్బందిని ఏదో రీత్యా అల్లరిమూలంగా మాట్లాడి మాస్టర్ కీ తీసుకుని రూమ్ లోపలికి ప్రవేశించారు.
అప్పటికే నిద్రలో ఉన్న రామ్ గది తలుపు బలంగా కొట్టడంతో, ఆయన అనుమానంతో నిద్రలేచి వెంటనే తన టీమ్‌కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న యూనిట్ సభ్యులు వెంటనే హోటల్ మేనేజ్‌మెంట్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు చేరుకుని ఆ ఇద్దరిని స్టేషన్‌కి తరలించారు. స్థానికంగా సమాచారం ప్రకారం.. ఆ ఇద్దరూ మద్యం సేవించి ఉన్నారు అని తెలుస్తోంది.
అప్పటికే హోటల్ యాజమాన్యం ఈ ఘటనపై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. వీరిలో ఎవరు? ఏ ఉద్దేశంతో వచ్చారు అన్న అంశాలపై విచారణ జరుగుతోంది. మొదటగా వీరు అభిమానం పేరుతో వచ్చారా? లేక ఇతర ఉద్దేశాలతోనా అన్న అనుమానాలు నెలకొన్నాయి. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఇక ఈ ఘటనతో రామ్ టీమ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ కొనసాగుతున్నా, భద్రతపై యూనిట్ ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతున్నట్లు సమాచారం. సినీ సెలబ్రిటీలు బస చేసే ప్రదేశాల్లో భద్రత లోపిస్తే ఇలా చిన్న ఘటనలు పెద్ద ముప్పుగా మారే అవకాశముండడంతో, ఈ కేసు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.