టాలెంటెడ్ హీరో ఈసారైనా గట్టెక్కుతాడా?
ఎప్పటికప్పుడు రామ్ సినిమాలు అనౌన్స్ చేయడం, ఆ సినిమాతో హిట్ కొడతాడు అనుకోవడం, తీరా రిలీజయ్యాక ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం జరుగుతూనే వస్తున్నాయి.;
అందానికి అందం, టాలెంట్ కు టాలెంట్ అన్నీ ఉన్నా టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి కొన్ని సినిమాల నుంచి సక్సెస్ మాత్రం అందని ద్రాక్షలా మారింది. రామ్ కు ఉన్న టాలెంట్ కు ఎప్పుడో టైర్1 హీరోల లిస్ట్ లో చేరాల్సింది కానీ అతని స్టోరీ సెలక్షన్ వల్ల ఆయన ఇంకా టైర్2 హీరోల లిస్ట్ లో టాప్ లో ఉండటానికే పోటీ పడుతున్నారు.
ఐదేళ్లుగా దరి చేరని సక్సెస్
ఎప్పటికప్పుడు రామ్ సినిమాలు అనౌన్స్ చేయడం, ఆ సినిమాతో హిట్ కొడతాడు అనుకోవడం, తీరా రిలీజయ్యాక ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం జరుగుతూనే వస్తున్నాయి. ఈ ఎనర్జిటిక్ హీరో ఆఖరిగా హిట్ అందుకుంది ఇస్మార్ట్ శంకర్ తోనే. ఆ సినిమా వచ్చి కూడా ఐదేళ్లు దాటింది. ఆ తర్వాత రామ్ ఖాతాలో మరో హిట్ పడింది లేదు. ఇస్మార్ట్ శంకర్ తో మాస్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న రామ్, తర్వాత కూడా అదే మూసలో సినిమాలు చేస్తుండటంతో సక్సెస్ అందుకోలేకపోయారు.
రెడ్, ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ ఇలా వేటికవే ఫ్లాపుల మీద ఫ్లాపులయ్యాయి. దీంతో విషయం తెలుసుకున్న రామ్ ఇప్పుడు తిరిగి తన పాత స్కూల్ కు వచ్చి ఆంధ్రా కింగ్ తాలూకా అనే సినిమా చేస్తున్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ ఈ సినిమాను చేస్తుండగా ఇందులో రామ్ లవర్ బాయ్ గా, ఓ హీరోకు డై హార్డ్ ఫ్యాన్ గా కనిపించనున్నారు.
హిట్ కోసం కసిగా పని చేస్తున్న రామ్
భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. గత కొన్ని సినిమాలుగా సక్సెస్ మొహం చూడని రామ్, ఆంధ్రా కింగ్ తాలూకాతో ఎలాగైనా హిట్ కొట్టి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ఎంతో కసిగా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఈ సినిమాకు అన్నీ తానై పని చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమా కోసం ఓ పాటను స్వయంగా రాసిన రామ్, మరో పాటకు తన గొంతు విప్పారు.
ఇవన్నీ చూస్తుంటేనే రామ్ ఈ సినిమాను ఎంత పర్సనల్ గా తీసుకున్నారో అర్థమవుతుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ప్రస్తుతం శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో హీరో రామ్ పై ఇంట్రడక్షన్ సాంగ్ ను షూట్ చేస్తున్నారట. నవంబర్ 28న ఆంధ్రా కింగ్ తాలూకా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో అయినా రామ్ హిట్ అందుకుని గట్టెక్కుతారేమో చూడాలి. రామ్ అభిమానులు కూడా ఈ మూవీపై మంచి అంచనాలు పెట్టుకున్నారు.