అనుకున్నట్లే షాక్ ఇచ్చిన రామ్.. ఇదేదో వేటలా ఉందే..
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక ఊహించని షాక్ ఇచ్చారు.
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక ఊహించని షాక్ ఇచ్చారు. తన 23వ సినిమాతో అతను నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా కొత్త అవతారం ఎత్తబోతున్నారు. ‘రాపో 23’ పేరుతో ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ కి రామ్ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు మెగాఫోన్ పట్టనుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒక స్టార్ హీరో తన సినిమాను తానే డైరెక్ట్ చేసుకోవడం అనేది అరుదుగా జరిగేది. అందుకే ఈ చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ఇక సినిమాను ఒక ‘సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్’గా రామ్ సిద్ధం చేస్తున్నారు. లేటెస్ట్ గా విడుదల చేసిన పోస్టర్ లో రామ్ లుక్ చాలా ఇంటెన్సివ్ గా ఉంది. ‘వీర’ అనే పాత్రను పరిచయం చేస్తూ విడుదలైన ఈ పోస్టర్ లో రామ్ వెనక నుంచి కనిపిస్తున్నారు. లెదర్ జాకెట్, వి కట్ హెయిర్ స్టైల్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ లో డార్క్ థీమ్ చూస్తుంటే ఇదొక సిటీ బ్యాక్ డ్రాప్ లో సాగే గ్రిప్పింగ్ క్రైమ్ స్టోరీ అని హింట్ ఇస్తున్నాయి.
‘ద స్టోరీ ఆఫ్ ఎ లోన్ వోల్ఫ్’ అనే ట్యాగ్ లైన్ చూస్తుంటే, ఒక ఒంటరిగా వేటాడే పవర్ ఫుల్ క్యారెక్టర్ ను రామ్ డిజైన్ చేసినట్లు అర్థమవుతోంది. గత కొన్నేళ్లుగా రామ్ తన సినిమాల విషయంలో రొటీన్ మాస్ ఫార్ములాను వదిలి కొత్తగా ప్రయత్నించాలని చూస్తున్నారు. 'ఆంధ్రా కింగ్' సమయంలోనే ఆయన మేకింగ్ ప్రాసెస్ లో ఎంతగా ఇన్వాల్వ్ అయ్యారో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకోవడం వెనుక తన విజన్ ను వెండితెరపై పక్కాగా హైలెట్ అవుతుందనే తపన కనిపిస్తోంది. ఒక దర్శకుడు చెప్పే కథలో హీరో ఒదిగిపోవడం ఒక ఎత్తు అయితే, తన మనసులోని కథను తానే తెరకెక్కించడం మరో ఎత్తు. ఈ కంటెంట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సౌండ్ చేస్తుందో చూడాలి. ఈ ప్రాజెక్ట్ కోసం రామ్ తన సొంత ప్రొడక్షన్ హౌస్ ‘రాపో సినిమాటిక్స్’ను రంగంలోకి దించారు.
కృష్ణ పోతినేని నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమా మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా భారీగా ప్లాన్ చేస్తున్నారట. నెలల తరబడి స్క్రిప్ట్ వర్క్ మీద కూర్చున్న రామ్, ఈ పాత్ర కోసం కంప్లీట్ గా ఫిజికల్ మేకోవర్ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. టాప్ టెక్నీషియన్స్ తో కలిసి ఆయన చేస్తున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్, రామ్ కెరీర్ లోనే ఒక విభిన్నమైన ప్రయత్నం అని చెప్పొచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ లో నటులు దర్శకులుగా మారడం ఒక ట్రెండ్ గా మారుతోంది.
అయితే రామ్ లాంటి బిజీ హీరో తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం విశేషం. జూన్ నుంచి షూటింగ్ మొదలుపెట్టి డిసెంబర్ 2026 నాటికి థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. రామ్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన కెరీర్ గ్రాఫ్ ను మళ్ళీ పైకి తీసుకెళ్తుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. తన ఇమేజ్ కి సరిపోయేలా మాస్ తో పాటు మెదడుకు మేత ఇచ్చే అంశాలను కూడా రామ్ ఈ కథలో మిక్స్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి రామ్ బర్త్ డే అప్ డేట్ తో టాలీవుడ్ లో కొత్త డిస్కషన్ మొదలైంది. ఒక హీరోగా మనకు తెలిసిన రామ్, దర్శకుడిగా తన వాయిస్ ను ఎలా వినిపిస్తారనేది ఇప్పుడు అసలైన కిక్. ఈ డిసెంబర్ రేసులో ‘వీర’ తన సత్తా చాటుతాడో లేదో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాలి.