సెలబ్రిటీలే ఏఐని ప్రోత్సహిస్తున్నారా?

టెక్నాలజీ అనేది ఉపయోగపడాలి కానీ దుర్వినియోగం కాకూడదు అనేది అందరి మాట.

Update: 2026-10-04 06:30 GMT

ఆధునిక టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో సంబరపడాలో లేక ఈ టెక్నాలజీ ని ఉపయోగించుకొని కొంతమంది చేస్తున్న ఆకతాయి పనులను చూసి భయపడాలో అర్థం కావడం లేదు అంటూ కొంతమంది తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. టెక్నాలజీ అనేది ఉపయోగపడాలి కానీ దుర్వినియోగం కాకూడదు అనేది అందరి మాట. అయితే ఈ మధ్యకాలంలో ప్రత్యేకించి సెలబ్రిటీలను టార్గెట్ గా చేసుకొని ఈ అధునాతన టెక్నాలజీ ఏఐని ఉపయోగించి సెలబ్రిటీల ఫోటోలను, వారి వ్యక్తిగత విషయాలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వదులుతూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ దేవర చిత్రంలోని చుట్టమల్లె వీడియోని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్న నేపథ్యంలో అటు ఎన్టీఆర్ , జాన్వీ కపూర్, చిరంజీవి , విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని లాంటి హీరోలు ఒకరి తర్వాత ఒకరు స్పందిస్తూ వీడియోలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు ఈ ఏఐ మార్ఫింగ్ వీడియోని షేర్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఖండిస్తుంటే.. రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ తప్పంతా సెలబ్రిటీలదే అంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక పోస్ట్ రిలీజ్ చేస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.

రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.. సెలబ్రిటీస్ అందరూ సాధించిన ఏకైక విషయం ఏమిటంటే.. ఈ అభ్యంతరకరమైన లింకును ప్రచారం చేసి దాని ద్వారా కోట్లాదిమంది ప్రజలు చూసేలా తమ ట్వీట్స్ తో పబ్లిసిటీ చేశారు. అలా కాకుండా నిందితుడిని పట్టుకోవడం పై దృష్టి సారించి ఉంటే.. ఈ విషయాన్ని ప్రచారం చేసి ఉంటే.. తెలివైన పని అయ్యేది. కానీ ట్వీట్ చేసి బాధితురాలు గుర్తింపు పై నేరం పరిగణించబడే ఆ అభ్యంతరకరమైన కంటెంట్ పై విపరీతమైన దృష్టి ఆకర్షించేలా చేశారు. ఇది కూడా ఒక నేరమే కదా అంటూ తనదైన శైలిలో రాసుకొచ్చారు.

వర్మ చేసిన ట్వీట్ ని బట్టి చూస్తే నిజంగా నిజం అని అనిపిస్తుంది . ముఖ్యంగా సెలబ్రిటీలకు లక్షలాదిమంది ఫాలోవర్స్ ఉంటారు. అయితే ఇలా మార్ఫింగ్ ఫోటోలు చూసేది దాదాపు లక్ష మంది ఉంటే.. ఈ సెలబ్రిటీలు దీనిని పదే పదే పోస్ట్ చేస్తూ ఖండించడం వల్ల కోట్ల మంది దీనిని చూసే అవకాశం ఉంది. కాబట్టి సోషల్ మీడియా అనేది వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సెలబ్రిటీలు ఇలాంటి వీడియోలను మళ్ళీ మళ్ళీ షేర్ చేసి తాము ఏదో ఖండిస్తున్నట్లు చెప్పడం కంటే.. రాంగోపాల్ వర్మ చెప్పినట్టు చేసి ఉండుంటే ఈ విషయం ఇంతవరకు వచ్చి ఉండేది కాదేమో అనే అభిప్రాయాలకు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా సెలబ్రిటీలే ఏఐ ను ప్రోత్సహిస్తున్నారా అనే అనుమానాలు కూడా సోషల్ మీడియాలో వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం. మొత్తానికి అయితే ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags:    

Similar News