సంబరాల బాబు సౌండ్ గట్టిగానే చేయాలి!
| సాయి దుర్గ తేజ్ నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ జనవరి 12న విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి బరిలో చిరంజీవి సహా పలువురు అగ్ర హీరోల సినిమాలు ఉండటంతో పోటీ తీవ్రంగా ఉండనుంది. అయితే విడుదల తేదీ దగ్గరపడుతున్నా చిత్ర ప్రచారం ఆశించిన స్థాయిలో మొదలుకాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమోషన్ల వేగం పెంచాల్సిన అవసరం ఉందనే చర్చ జరుగుతోంది.
సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం `సంబరాల ఏటిగట్టు`పై అభిమానుల్లో ఎన్నో అంచనాలున్నాయి. నిజానికి ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి. కానీ వివిధ కారణాల వల్ల విడుదల వాయిదా పడుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నా హాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత సాయి తేజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సంక్రాంతి రేసులో బాక్సాఫీస్ వద్ద గట్టిగానే సౌండ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
అయితే సంక్రాంతి బరిలో నిలవడం అంటే సులువైన విషయం కాదు. జనవరి 12న విడుదల అంటున్నా? అదే సమయంలో మరికొన్ని క్రేజీ సినిమాలు కూడా పోటీలో ఉన్నాయి. మేనమామ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న `కాకా` చిత్రం కూడా సంక్రాంతి సీజన్‌లోనే రిలీజ్ అవుతుంది. ఒకవైపు మెగాస్టార్ లాంటి దిగ్గజ హీరో సినిమా- మరోవైపు ఇతర అగ్ర హీరోల చిత్రాల నడుమ `సంబరాల ఏటిగట్టు` ఉనికిని చాటుకోవాలంటే ప్రమోషన్ల విషయంలో పెద్ద కసరత్తు చేయాల్సిందే.
ఇంత తీవ్రమైన పోటీని తట్టుకుని ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే ప్రచార హోరు ఠారెత్తిపోయేలా ఉండాలి. కానీ విడుదల తేదీ దగ్గరపడుతున్నా? ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి ఆ స్థాయి హడావుడి ఇంకా మొదలు కాలేదు. టీజర్లు.. పాటలు.. వరుస అప్‌డేట్లతో సోషల్ మీడియాలో వాతావరణాన్ని వేడెక్కించాల్సిన సమయం ఆసన్నమైంది.
సాయి తేజ్ కెరీర్ పరంగా చూస్తే `బ్రో` తర్వాత ఆయన నుంచి మరో సినిమా వచ్చి చాలా కాలమైంది. సుదీర్ఘ విరామం తర్వాత వస్తున్న `సంబరాల ఏటిగట్టు`లో సరికొత్త మేకోవర్‌తో.. రస్టిక్ యాక్షన్ అవతార్‌లో కనిపించ బోతున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ చిత్రం కథాబలం.. విజువల్స్‌పై మేకర్స్ ఎంతో నమ్మకంగా ఉన్నా? ఆ విషయాన్ని ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకెళ్లడం ఇప్పుడు అత్యంత కీలకమైంది.
సంక్రాంతి సీజన్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకుల ఆదరణ దక్కాలంటే కంటెంట్ బాగుంటే సరిపోదు. పక్కా ప్లానింగ్‌తో కూడిన పబ్లిసిటీ కూడా అంతే అవసరం. ఇంటర్వ్యూలు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లు, వినూత్న ప్రచార కార్యక్రమాలతో సాయి తేజ్ స్వయంగా రంగంలోకి దిగి సినిమాపై హైప్ పెంచాల్సి ఉంది. సంక్రాంతి పోటీలో నిలబడి విజయం సాధించాలంటే సంబరాల బాబు ప్రచార వేగాన్ని తక్షణమే పెంచాలి. మరి ఈ విషయంలో టీమ్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుందో చూడాలి.