ఓడిపోయినా పర్వాలేదు.. ధైర్యంగా ముందుకెళ్లాలి!
| నటి పార్వతి తిరువోతు తనకు ADHD ఉందని తాజాగా వెల్లడించారు. రంజిని హరిదాస్ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ, గతేడాది నుంచి పని విషయంలో వేగం పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వచ్చే మూడేళ్లు మరింత కష్టపడి పనిచేయాలని భావిస్తున్నానని చెప్పారు. ADHD ఉన్నప్పటికీ దాన్ని పెద్ద విషయంగా చూడటం లేదని, నిద్రకు మాత్రం తగిన సమయం కేటాయిస్తానని పార్వతి పేర్కొన్నారు. ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు.
గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా బలమైన కథలు..లోతైన భావోద్వేగాలు ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి పార్వతి తిరువోతు. సహజమైన నటనతో పాటు సామాజిక అంశాలపై నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తిత్వం అమ్మడి సొంతం. అలాంటి పార్వతి తాజాగా తాను ఏడీహెచ్‌డీ తో బాధపడుతున్న విషయాన్ని బయటపెట్టి షాక్ ఇచ్చింది. గతంలో ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే షూటింగ్‌లలో పాల్గొనే అమ్మడు ఇప్పుడు వేగంగా సినిమాలు పూర్తి చేస్తున్నట్లు తెలిపింది. నటి, యాంకర్ రంజిని హరిదాస్ యూట్యూబ్ ఛానెల్‌లో జరిగిన సంభాషణలో పార్వతి ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
గత ఇరవై ఏళ్లలో తన జీవితంలో ఇది అత్యంత వేగంగా సాగుతున్న సమయమని రంజిని పేర్కొనగా పార్వతి కూడా దాన్ని అంగీకరించారు. `ఉల్లోళుక్కు`, `దూత` ప్రాజెక్టులకే పనిచేశానని.. 2023లో `తంగలాన్` కోసం 75 రోజులు షూటింగ్ చేశానని గుర్తు చేసుకుంది. అయితే ఆ తర్వాత ఆలోచనల్లో పెద్ద మార్పు వచ్చిందన్నారు. గతేడాది తీసుకున్న నిర్ణయం గురించి రివీల్ చేసింది. వచ్చే మూడేళ్లు మరింత కష్టపడి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. బయట ఎక్కడో స్ఫూర్తి..ఎదుగుదల కోసం వెతకడం బోర్ కొట్టిందని లోపల నుంచే ప్రయాణం మొదలుపెట్టానంది.
ఓడిపోయినా పర్వాలేదు. ధైర్యంగా ముందుకు వెళ్లాలనే సంకల్పంతో పనిలోకి దిగిన తర్వాత మంచి అవకాశాలు వచ్చాయని తెలిపింది. ఏడీహెచ్‌డీ ఉన్నప్పటికీ దాన్ని పెద్ద విషయంగా చేయాలనుకోవడం లేదని పార్వతి స్పష్టం చేసింది. తన విషయంలో సమయం సాధారణంగా పనిచేయదని అది సాగే గుణం కలిగిన ఎలాస్టిక్ లాంటిదని సరదాగా వ్యాఖ్యానించారు. అవసరమైతే సమయాన్ని సాగదీయగలనని.. అలాగని నిద్రను మాత్రం త్యాగం చేయనని.. నిద్రకు తగిన సమయం తీసుకుంటానని తెలిపింది.
ఈ ఏడాది `తు యా మైన్లో` అతిథి పాత్రలో కనిపించిన పార్వతి, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి `ఐ`, `నోబడీ`లో నటించారు. అలాగే `ప్రథమ దృశ్య కుట్టక్కర్` అనే క్రైమ్ డ్రామాలో పోలీసు అధికారి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలో అజిత్‌పాల్ సింగ్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ సంస్థ నిర్మిస్తున్న ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ `స్టార్మ్` లో పార్వతి కనిపించనుంది. దీంతో పాటు నాగ చైతన్య సరసన విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న `దూత` సీక్వెల్‌తో పాటు కార్తీక్ ఆర్యన్ `కెప్టెన్ ఇండియా` చిత్రంలోనూ నటిస్తోంది.