'పెద్ది'.. ఇక మిగిలింది ఇదే!

ఇక రిలీజ్ కు ఇంకా చాలా టైమ్ ఉన్నప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ కు, విజువల్ ఎఫెక్ట్స్ కు తగినంత సమయం కేటాయించాలనే ఉద్దేశంతో షూటింగ్ ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డారు.;

Update: 2025-12-10 05:30 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తేడా కొట్టినా RRR ఫ్లో తగ్గకుండా పెద్దిని హైలెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కమర్షియల్ హిట్ కొట్టాలి కాబట్టి 'పెద్ది' మీద బాధ్యత ఎక్కువగా ఉంది. దానికి తగ్గట్టే మేకర్స్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను చెక్కుతున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పనులు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి. 2026 మార్చి 27న సినిమా రిలీజ్ డేట్ అని ప్రకటించేశారో, అప్పటి నుంచి షూటింగ్ విషయంలో స్పీడ్ పెంచేశారు. గ్యాప్ లేకుండా పక్కా ప్లానింగ్ తో షెడ్యూల్స్ వేసుకుంటూ వెళ్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ 'చికిరి చికిరి' యూట్యూబ్ లో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తోందో చూస్తున్నాం. ఇక రిలీజ్ కు ఇంకా చాలా టైమ్ ఉన్నప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ కు, విజువల్ ఎఫెక్ట్స్ కు తగినంత సమయం కేటాయించాలనే ఉద్దేశంతో షూటింగ్ ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇప్పుడు ఆ ప్లానింగ్ లో భాగంగానే వరుస షెడ్యూల్స్ ను ఖరారు చేశారు. లేటెస్ట్ బజ్ ప్రకారం రేపటి నుంచే సినిమాకు సంబంధించి ఒక కీలకమైన కొత్త షెడ్యూల్ మొదలుకాబోతోంది.

హైదరాబాద్ లోని ప్రముఖ వన్ స్టూడియోలో, అలాగే కోఠి ఆసుపత్రి పరిసరాల్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ లో చరణ్ తో పాటు ఇతర ప్రధాన తారాగణం కూడా పాల్గొనే అవకాశం ఉంది. దర్శకుడు ఈ ఎపిసోడ్స్ కోసం భారీగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ పని పూర్తి కాగానే ఏ మాత్రం ఆలస్యం లేకుండా టీమ్ మొత్తం లొకేషన్ మార్చనుంది.

హైదరాబాద్ షూట్ ముగించుకున్న వెంటనే యూనిట్ మొత్తం ఢిల్లీకి పయనం కానుంది. అక్కడ ఈ నెల 18వ తేదీ నుంచి దాదాపు నాలుగు రోజుల పాటు ఒక చిన్న షెడ్యూల్ ప్లాన్ చేశారు. కథలో వచ్చే కొన్ని రియలిస్టిక్ సన్నివేశాలను, మాంటేజ్ షాట్స్ ను అక్కడ షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అక్కడ పని పూర్తి చేసుకుని టీమ్ మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తుంది.

ఈ ఢిల్లీ ట్రిప్ కూడా పూర్తయితే సినిమా మేజర్ టాకీ పార్ట్ దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్లే అని ఇన్ సైడ్ టాక్. ఇక సినిమా మొత్తంలో బ్యాలెన్స్ ఉండేది కేవలం మూడు ప్రధాన ఘట్టాలే అని అంటున్నారు. సినిమాకు ప్రాణంగా నిలిచే ఎమోషనల్ క్లైమాక్స్ ఎపిసోడ్, ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే భారీ కుస్తీ సీక్వెన్స్, అలాగే మాస్ ఆడియెన్స్ కోరుకునే ఒక స్పెషల్ ఐటెం సాంగ్ మాత్రమే పెండింగ్ ఉంటాయట. దీన్ని బట్టి చూస్తుంటే షూటింగ్ చివరి దశకు వచ్చేసిందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇక రాబోయే అప్డేట్స్ ఎలాంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాయో చూడాలి.

Tags:    

Similar News