పెద్ది పై అనుమానాలు పెరుగుతున్నాయ్

ఇంకో 12 రోజులు ఆలస్యంగా ఏప్రిల్ 8న ‘పెద్ది’ బుకింగ్స్ మొదలుపెడుతున్నట్లు తాజాగా ఇంకో ప్రకటన విడుదల చేశారు.;

Update: 2026-03-26 13:55 GMT

ఈ వేసవికి ఏవేవో పెద్ద సినిమాలు వస్తాయని ఊరించారు. కానీ చివరికి చూస్తే ‘పెద్ది’ మినహాయిస్తే పెద్ద సినిమాలేవీ లేవు. ముందు మార్చి 26కు అనుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ డేటుకైనా సినిమా వస్తుందా అన్న అనుమానాలు గత కొన్ని రోజులుగా వ్యక్తమవుతున్నాయి. రిలీజ్‌కు అటు ఇటుగా ఇంకో నెల రోజులే సమయం ఉండగా.. ఇంకా చిత్రీకరణ పూర్తి కాలేదు.

ఈలోపు రామ్ చరణ్ షూటింగ్‌లో గాయపడ్డాడనే వార్త దావానలం వ్యాపించింది. అభిమానుల్లో ఆందోళన రేకెత్తించింది. ఐతే గాయం చిన్నదే అని.. ఒక రోజు గ్యాప్‌లో చరణ్ షూట్‌కు కూడా వచ్చేస్తున్నాడని అంటున్నారు. అభిమానులు హ్యాపీనే. కానీ ‘పెద్ది’ ఏప్రిల్‌ 30కి రావడం అనుమానే అనిపించే పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ‘పెద్ది’ని యుఎస్‌లో రిలీజ్ చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ సంస్థ చేసిన ముందు మార్చి 27న బుకింగ్స్ మొదలవుతున్నట్లు ఘనంగా ప్రకటన చేసింది. కానీ ఒక్క రోజు గ్యాప్‌లోనే మాట మార్చేసింది.

ఇంకో 12 రోజులు ఆలస్యంగా ఏప్రిల్ 8న ‘పెద్ది’ బుకింగ్స్ మొదలుపెడుతున్నట్లు తాజాగా ఇంకో ప్రకటన విడుదల చేశారు. మామూలుగా యుఎస్‌లో పెద్ద సినిమాలకు నెల రోజుల ముందే ప్రి సేల్స్ మొదలువుతాయి. కానీ ‘పెద్ది’కి మాత్రం మూడు వారాల ముందు బుకింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. మామూలుగా అయితే అనుమానాలు వచ్చేవి కాదు కానీ.. ఒకసారి మార్చి 27 అని డేట్ ఇచ్చి.. ఒక్క రోజు గ్యాప్‌లో 12 రోజులు లేటుగా బుకింగ్స్ మొదలుపెట్టనున్నట్లు ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది.

సినిమా మరోసారి వాయిదా పడుతుందా అన్న చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు చిత్రీకరణ పూర్తి కావాలి. ఏఆర్ రెహమాన్ బీజీఎం పూర్తి చేయాలి. అన్ని భాషల్లో డబ్బింగ్, మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కావాలి. ప్రమోషన్ చేయాలి. అన్నీ నెల రోజుల్లో పూర్తయి అనుకున్న ప్రకారం సినిమా విడుదలవుతుందేమో చూడాలి మరి.


Tags:    

Similar News