'పెద్ది'.. ఇప్పటికైనా రివీల్ చేస్తారా?
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్దిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్దిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఆ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తుండగా, జగపతిబాబు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గ్రామీణ వాతావరణంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో సినిమా రూపొందుతోంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పొడవాటి జుట్టు, గడ్డంతో రామ్ చరణ్ కనిపించిన రస్టిక్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే క్రికెట్ షాట్ తో ఉన్న విజువల్స్ అభిమానులను ఆకర్షించాయి. చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పహిల్వాన్ గ్లింప్స్ కూడా సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది. దీంతో పెద్దిపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నా.. ప్రమోషన్ల విషయంలో క్లారిటీ లేకపోవడం ఇప్పుడు అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. జూన్ 4న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఇప్పటివరకు ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రమోషన్ షెడ్యూల్ వంటి అంశాలపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో సోషల్ మీడియాలో మెగా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఓ అభిమాని చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది. "గేమ్ ఛేంజర్ సమయంలో ఇదే టెన్షన్ అనుభవించాం. ఇప్పుడు పెద్ది విషయంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇది మాకు మెంటల్ టార్చర్. ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకోండి. వెంటనే ప్రమోషన్ల షెడ్యూల్ రివీల్ చేయకుంటే నేను ఉరేసుకుంటా" అంటూ అతడు సోషల్ మీడియా ఎక్స్ లో లెటర్ ను షేర్ చేశాడు. ఆ లెటర్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
అయితే ఆ పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఫ్యానిజంగా తీసుకుంటే, మరికొందరు సినిమాల కోసం ఇలాంటి కామెంట్స్ చేయడం అస్సలు సరైంది కాదని సూచిస్తున్నారు. సినిమా అంటే అభిమానం ఉండొచ్చు కానీ ప్రాణాలకు మించినది ఏదీ కాదంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. సినిమా కోసం వెయిట్ చేయడం తప్పు లేదని, కానీ ప్రాణం తీసుకుంటాననడం కరెక్ట్ కాదని చెబుతున్నారు.
కాగా, పెద్ది టీమ్ నార్మల్ ప్రమోషన్లకు భిన్నంగా భారీ ఈవెంట్లను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ట్రైలర్ విడుదలతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రత్యేక ఇంటర్వ్యూలు, పాన్ ఇండియా ప్రమోషన్లపై దృష్టి పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల వల్ల మూవీ టీమ్ త్వరలోనే ప్రమోషన్లపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని మెగా అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి పెద్ది సినిమాపై ఉన్న భారీ అంచనాలే ఇప్పుడు అభిమానుల్లో ఆ రేంజ్ ఎగ్జైట్మెంట్ కు కారణమవుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు మరోసారి ఫ్యాన్స్ ఎమోషన్స్ పై చర్చకు దారితీశాయి.