పెద్ది: ఈ ఆవేశాన్ని అర్థం చేసుకుంటారా?
కానీ టీమ్ నుంచి సరైన స్పందన లేకపోవడంతో, ఆ ప్రభావం సినిమా ఓపెనింగ్స్ మీద పడుతుందేమోనని వారు భయపడుతున్నారు.;
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం పెరగాల్సింది పోయి, ఒక రకమైన ఆందోళన మొదలైంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ జూన్ 4న థియేటర్లలోకి రావాల్సి ఉంది. సరిగ్గా మూడు వారాల సమయం కూడా లేని ఈ తరుణంలో, సినిమా ప్రమోషన్ల విషయంలో చిత్ర యూనిట్ అనుసరిస్తున్న తీరుపై ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే 'గేమ్ చేంజర్' టైమ్ లో జరిగిన పొరపాట్లకు అప్సెట్ అయిన ఫ్యాన్స్, ఇప్పుడు ‘పెద్ది’ విషయంలో కూడా అదే ఆలస్యం ఎదురవుతుండటంతో ఏమాత్రం సహించడం లేదు. ప్రమోషన్ల జాప్యంపై సోషల్ మీడియాలో ఒక అభిమాని రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆ లేఖలో సదరు అభిమాని తన ఆవేదనను చాలా తీవ్రంగా వ్యక్తం చేశారు. ప్రమోషన్ షెడ్యూల్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోతే ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోతానంటూ ఎమోషనల్ గా చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్నాయి.
సినిమాపై ఉన్న ప్రేమ, అప్‌డేట్స్ కోసం పడుతున్న తపన ఏ స్థాయికి చేరుకుందో ఈ లేఖను చూస్తే అర్థమవుతోంది. మేకర్స్ చూపిస్తున్న నిర్లక్ష్యం తమకు మానసిక వేదనగా మారుతోందని, వెంటనే ప్రమోషన్ ప్లాన్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఒక భారీ సినిమాకు ఉండాల్సిన హైప్ క్రియేట్ చేయడంలో మొదటి రోజు నుంచీ పక్కా ప్లానింగ్ ఉండాలి. ముఖ్యంగా రామ్ చరణ్ వంటి స్టార్ హీరో సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయాలని ఫ్యాన్స్ ఆశిస్తారు.
కానీ టీమ్ నుంచి సరైన స్పందన లేకపోవడంతో, ఆ ప్రభావం సినిమా ఓపెనింగ్స్ మీద పడుతుందేమోనని వారు భయపడుతున్నారు. ఒకవైపు ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్‌లో ఈవెంట్ వంటి వార్తలు చక్కర్లు కొడుతున్నా, వాటికి సంబంధించి అధికారికంగా ఏ ఒక్క ప్రకటన రాకపోవడం అభిమానుల ఆవేశాన్ని రెట్టింపు చేస్తోంది. మేకర్స్ అనుసరిస్తున్న ఈ నిశ్శబ్దం ఫ్యాన్స్‌కు పెద్ద టార్చర్‌లా అనిపిస్తోంది.
ప్రతి సినిమాకు అభిమానులే అసలైన ప్రమోషన్ పిల్లర్స్. చిన్న పోస్టర్స్ వచ్చినా సోషల్ మీడియాలో బజ్ పెంచుతుంటారు. కానీ ఈ సారి ఆలస్యం వలన ఆ ఆవేశం ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకునే స్థాయికి వెళ్లడం మాత్రం మంచి విషయం కాదు. ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే టీమ్ వర్క్ ఎంత ముఖ్యమో, అభిమానులను ఉత్సాహపరిచే ప్రమోషన్లు కూడా అంతే ముఖ్యం. ‘పెద్ది’ టీమ్ ఇకనైనా స్పందించి, అభిమానుల మనోభావాలను గౌరవిస్తూ ఒక పక్కా ప్రమోషన్ షెడ్యూల్ ఇస్తే ఈ గందరగోళానికి చెక్ పడుతుంది.
ఇక ‘పెద్ది’ మేకర్స్ ఈ అభిమానుల ఆవేశాన్ని అర్థం చేసుకుంటారా లేదా అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. మే 18న ట్రైలర్ లాంచ్ ఉంటుందని ప్రచారం జరుగుతున్నా, దానికి తగ్గ సౌండ్ లేదు. ఇప్పటికైనా రామ్ చరణ్ స్వయంగా జోక్యం చేసుకుని, తన కోసం ప్రాణాలైనా ఇస్తామంటున్న అభిమానుల్లో ఉత్సాహం నింపేలా ప్రమోషన్లను పట్టాలెక్కించాల్సిన అవసరం ఉంది. మరి 20 రోజుల ఈ కౌంట్‌డౌన్‌లో ‘పెద్ది’ టీమ్ ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.