నైజాంలో తొలి రెండు రోజులు.. 'పెద్ది' సంగతేంటి?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఆ చిత్రం విడుదలైన తొలి రెండు రోజుల్లోనే నైజాం ప్రాంతంలో అదిరిపోయే కలెక్షన్లు సాధించింది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ తో సినిమా కలెక్షన్లు సాలిడ్ గా కొనసాగుతున్నాయి.
జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దిపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టు గానే తొలి రోజు స్ట్రాంగ్ ఓపెనింగ్స్ సాధించిన ఆ మూవీ.. రెండో రోజు కూడా మంచి వసూళ్లను సొంతం చేసుకుంది. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం.. నైజాం ప్రాంతంలో తొలి రోజు రూ.18.32 కోట్ల షేర్ సాధించిన ఆ సినిమా, రెండో రోజు కూడా సాలిడ్ వసూళ్లు రాబట్టింది.
దీంతో రెండు రోజుల ముగిసేసరికి పెద్ది నైజాం షేర్ సుమారు రూ.26 కోట్ల మార్క్ ను అందుకుంది. ఆ వసూళ్లతో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా రెండు రోజుల షేర్ రికార్డును అధిగమించినట్లు తెలుస్తోంది. గుంటూరు కారం నైజాంలో తొలి రెండు రోజుల్లో సాధించిన రూ.25 కోట్లు షేర్ కంటే పెద్ది మెరుగైన వసూళ్లు నమోదు చేయడం విశేషం.
అయితే నైజాం ప్రాంతంలో తొలి రెండు రోజుల అత్యధిక షేర్ సాధించిన సినిమాల జాబితాలో పెద్ది ఇంకా టాప్ ప్లేసెస్ లో లేకపోయినా, మంచి స్థానం సంపాదించింది. ప్రస్తుతం ఆ లిస్ట్ లో ఆర్ఆర్ఆర్, పుష్ప 2, సలార్, కల్కి 2898 ఏడీ, దేవర, ఓజీ వంటి భారీ చిత్రాలు ముందంజలో ఉన్నాయి. వాటి తర్వాత స్థానాల్లో నిలిచిన చిత్రాల్లో పెద్ది కూడా ఒకటిగా నిలవడం చిత్ర యూనిట్ కు ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు.
మరోవైపు పెద్ది సినిమాకు కోస్తాంధ్ర బ్యాక్ డ్రాప్ లో సాగిన స్టోరీ, విలేజ్ ఎన్విరాన్మెంట్, స్పోర్ట్స్ ఎలిమెంట్స్ ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ముఖ్యంగా రామ్ చరణ్ పాత్ర ప్రేక్షకులు బాగా యాక్సెప్ట్ చేశారని చెప్పాలి. మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి. పెద్దిలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషించారు.
జగపతి బాబు, దివ్యేందు శర్మ, ఉపేంద్ర లిమాయే, కృతి శెట్టి, జాన్ విజయ్, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం, ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీకెండ్ హాలీడేస్ కూడా కలిసి వస్తుండటంతో పెద్ది వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇప్పటికే నైజాంలో మంచి ఓపెనింగ్స్ అందుకున్న ఆ చిత్రం.. ఫుల్ రన్ లో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి మాత్రం పెద్ది తన బాక్సాఫీస్ జర్నీ స్ట్రాంగ్ గా కొనసాగిస్తున్నట్లు అర్థమవుతోంది.