పెద్ది విన్నింగ్ షాట్ కొట్టాడు కానీ..

ఈ రోజుల్లో హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు తొలి వీకెండ్ తర్వాత వసూళ్లు బాగా పడిపోతున్నాయి

Update: 2026-06-15 08:38 GMT

ఈ రోజుల్లో హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు తొలి వీకెండ్ తర్వాత వసూళ్లు బాగా పడిపోతున్నాయి. ఒకసారి పడ్డాక, వసూళ్లు పుంజుకోవడం కష్టమవుతోంది. అలాంటిది డివైడ్ టాక్‌తో మొదలైన ‘పెద్ది’ సినిమా రెండో వీకెండ్లో పుంజుకున్న తీరు అనూహ్యమే. చాన్నాళ్ల తర్వాత వచ్చిన పెద్ద హీరో సినిమా కావడం.. కమర్షియల్ హంగులకు తోడు కథాబలం కూడా ఉన్న సినిమా కావడం.. టికెట్ల ధరలు కూడా తగ్గించడం.. జనాలు థియేటర్లకు రావడానికి తోడ్పడింది. నిన్న ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ‘పెద్ది’కి చాలా థియేటర్లలో హౌస్ ఫుల్స్ పడ్డాయి.

సింగిల్ స్క్రీన్ల ముందు రెండో వీకెండ్లో హౌస్ ఫుల్ బోర్డులు పెట్టడం అంటే ఈ రోజుల్లో అరుదైన విషయమే. వీక్ డేస్‌లో సినిమా వీక్ అవడం చూసి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ అవుతుందా.. బయ్యర్లు సేఫ్ అవుతారా లేదా అన్న సందేహాలు కలిగాయి. కానీ మ్యాచ్ చివర్లో విన్నింగ్ షాట్ కొట్టినట్లే.. పెద్ది థియేట్రికల్ రన్ చివర్లో భలేగా పెర్ఫామ్ చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అన్ని ఏరియాల్లో ‘పెద్ది’ సినిమా సేఫ్ జోన్లోకి వచ్చేసింది.

ఐతే పెద్ది విన్నింగ్ షాట్ ఏపీ, తెలంగాణకే పరిమితం. ఇంకెక్కడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. కర్ణాటకలో బాగా ఆడినప్పటికీ.. పెట్టుబడి భారీ మొత్తంలో పెట్టడంతో అక్కడ సినిమా నష్టాలే మిగిల్చింది. తమిళనాడు, కేరళలో ‘పెద్ది’ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. హిందీలో ఓమాదిరిగా ఆడుతోంది కానీ.. అది సరిపోదు. ఈ చిత్రాన్ని హిందీలో జియో స్టూడియోస్ గట్టిగా ప్రమోట్ చేసి రిలీజ్ చేసింది కానీ.. ఆశించిన ఫలితం అయితే రాలేదు. పెట్టుబడిలో చాలా వరకు నష్టపోయినట్లే. ఇక ‘పెద్ది’ సినిమాకు అతి పెద్ద షాక్ అంటే యుఎస్‌లోనే. రూ.40 కోట్లకు పైగా పెట్టి హక్కులు తీసుకున్న ప్రత్యంగర సినిమాస్‌ సగానికి సగం నష్టపోయినట్లు తెలుస్తోంది. 6.5 మిలియన్ డాలర్లు రాబట్టాల్సిన సినిమా కాస్తా 4 మిలియన్ల మార్కును కూడా దాటడం కష్టంగా ఉంది. మొత్తంగా చూస్తే ‘పెద్ది’ని పక్కా లోకల్ హిట్‌గా చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల అవతల మాత్రం సినిమా డిజాస్టరే.

Tags:    

Similar News