కర్ణాటక ఫ్యాన్స్ కు 'పెద్ది' రేంజ్ ప్రామిస్

ఇక స్టేజ్ పైన ఉన్న శివరాజ్ కుమార్ ను ఉద్దేశిస్తూ చరణ్ చేసిన కామెంట్స్ ఈవెంట్ కు హైలైట్ గా నిలిచాయి.

Update: 2026-05-26 01:17 GMT

రామ్ చరణ్ మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'పెద్ది' జూన్ 4న రిలీజ్ కి రెడీ అవుతుండటంతో ప్రమోషన్స్ గ్యాప్ లేకుండా సాగుతున్నాయి. లేటెస్ట్ గా కన్నడ గడ్డపై జరిగిన ఈవెంట్ తో సినిమాకు ఒక భారీ హైప్ క్రియేట్ అయింది. చాలా కాలం తర్వాత చరణ్ ఒక పబ్లిక్ ఈవెంట్ లో కన్నడ ఆడియన్స్ తో మాట్లాడటం, పైగా పక్కనే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఉండటంతో ఈ వేడుక సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడిన స్పీచ్ కేవలం రెగ్యులర్ థాంక్స్ నోట్ లా కాకుండా, చాలా జెన్యూన్ గా అనిపించింది. "నచ్చిన పని, తెలిసిన పని చేస్తూ.. మీ నుంచి ఇంత ప్రేమ పొందడం నా అదృష్టం. దీనికోసం దేవుడికి, మీకు రెండు చేతులెత్తి దండం పెడుతున్నా" అంటూ చరణ్ చెప్పిన మాటలు అక్కడ ఉన్న ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. రంగస్థలం తరువాత చరణ్ మళ్ళీ ఆ రేంజ్ పాత్రతో స్క్రీన్ పైకి వస్తుండటంతో ఈ సినిమా రిజల్ట్ ఆయన మార్కెట్ కు చాలా ముఖ్యం.

చరణ్ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. "మేమంతా నిజంగా ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాం. నా కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ మోస్ట్ ఇన్స్పైరింగ్ ఫిలిం ఇది. ఈ మాట రాసి పెట్టుకోండి, థియేటర్ లో మీకే అర్థమవుతుంది" అంటూ చరణ్ ఒక సాలిడ్ ప్రామిస్ చేశారు. ఒక స్టార్ హీరో తన కంటెంట్ మీద ఇంత నమ్మకంగా స్టేట్మెంట్ ఇచ్చాడంటే, బుచ్చిబాబు సన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడని అర్థమవుతోంది.

ఇక స్టేజ్ పైన ఉన్న శివరాజ్ కుమార్ ను ఉద్దేశిస్తూ చరణ్ చేసిన కామెంట్స్ ఈవెంట్ కు హైలైట్ గా నిలిచాయి. "శివన్న మాకు ఒక ఫాదర్, ఒక అంకుల్, ఒక బ్రదర్ లాంటి వ్యక్తి. ఆయన కన్నడ ఇండస్ట్రీ చక్రవర్తి. అలాంటి లెజెండ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నా జన్మధన్యమైంది" అని చరణ్ గౌరవాన్ని చాటుకున్నారు. కన్నడ స్టార్స్ తో మెగా ఫ్యామిలీకి ఉన్న పాత అనుబంధాన్ని ఈ స్పీచ్ మరోసారి గుర్తుచేసింది.

మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న జూనియర్ శ్రీదేవి, జాన్వీ కపూర్ గురించి కూడా చరణ్ మాట్లాడారు. పెద్ది సినిమాకు ఆమె తన నటనతో ఒక మంచి సిన్సియారిటీని తీసుకొచ్చిందని, ఆమెతో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందంటూ ప్రశంసించారు. ఈ ప్రాజెక్ట్ వెనుక అసలైన సూత్రధారి సుకుమార్ అని, ఆయన వల్లే ఈ సినిమా సాధ్యమైందని డైరెక్టర్ సుకుమార్ కు కూడా చరణ్ క్రెడిట్ ఇచ్చారు.

ఈవెంట్ ముగిసే సమయంలో ఒక చిన్న కుర్రాడు స్టేజ్ పైకి వచ్చి చరణ్ ను గట్టిగా హగ్ చేసుకోవడం, ఆ బాబు తెచ్చిన క్రికెట్ బ్యాట్ పైన చరణ్ స్మైల్ తో ఆటోగ్రాఫ్ ఇవ్వడం అక్కడ ఉన్న వాళ్లందరినీ ఆకట్టుకుంది. మొత్తానికి కన్నడ గడ్డపై జరిగిన ఈ లౌడ్ ప్రమోషన్ చూస్తుంటే, కర్ణాటక బాక్సాఫీస్ దగ్గర పెద్ది సినిమాకు మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News