రామ్ చ‌ర‌ణ్ ద‌స‌రా కానుక ఇదే

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా ఉప్పెన బుచ్చిబాబు `పెద్ది` సినిమాను తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-09-14 07:30 GMT

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా ఉప్పెన బుచ్చిబాబు `పెద్ది` సినిమాను తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. గేమ్ ఛేంజ‌ర్ డిజాస్ట‌ర్ ఫ‌లితం త‌ర్వాత చ‌ర‌ణ్ ఎంతో శ్ర‌ద్ధాస‌క్తుల‌తో ప‌ని చేస్తున్న చిత్ర‌మిది. `పెద్ది`ని విజ‌య‌వంత‌మైన ప్రాజెక్ట్ గా మ‌లిచేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డి ప‌ని చేస్తున్నాడు. ప్ర‌చారంలోను త‌గ్గేదేలే అంటూ టీమ్ సిద్ధ‌మ‌వుతోంది. పెద్ది సినిమా మొదటి పాటను దసరా కానుక‌గా విడుదల చేయడానికి టీమ్ సిద్ధ‌మ‌వుతోంది.

27 సెప్టెంబ‌ర్ మొద‌టి పాట విడుద‌ల‌వుతుంది. అయితే ఈ పాట లాంచింగ్ డే చ‌ర‌ణ్ జీవితంలో ప్ర‌త్యేక‌త‌తో కూడుకున్న అంశం. యాథృచ్ఛికంగా 18 సంవత్సరాల క్రితం పూరి జగన్నాథ్ దర్శకత్వం లో `చిరుత` సినిమాతో చరణ్ తన నట జీవితాన్ని ప్రారంభించిన రోజు ఇది. చరణ్ కెరీర్‌లో ఈ ప్రత్యేక మైలురాయిని మెగా ఫ్యాన్స్ సెల‌బ్రేట్ చేసే రోజుగా `పెద్ది` మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆస‌క్తిక‌రంగా ఇటీవ‌ల రెహ‌మాన్ గురించి ప్ర‌స్థావిస్తూ చ‌ర‌ణ్‌, బుచ్చిబాబు టీమ్ ఈ పాట ట్యూన్ అద్భుతంగా కుదిరిందంటూ ప్ర‌శంసించారు.క్రీడా నేప‌థ్య సినిమా ఆత్మ‌ను ఈ పాట‌లోకి తేవ‌డంలో రెహ‌మాన్ ప‌నితనాన్ని టీమ్ ఆకాశానికెత్తేసింది. దీంతో మొద‌టి పాట రాక కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

పెద్ది క్రీడా నేప‌థ్య క‌థ‌తో రూపొందుతున్న ఆస‌క్తిక‌ర మ‌ల్టీస్టార‌ర్ చిత్రం. చ‌ర‌ణ్ తో పాటు, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీల‌క పాత్ర‌ను పోషిస్తుండ‌గా, శ్రీ‌దేవి కుమార్తె జాన్వీ కపూర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. మిర్జాపూర్ నటుడు దివ్యేందు శర్మ ఇత‌ర ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రానికి నిర్మాత‌. క్రీడా నేప‌థ్య సినిమా కోసం భారీ బ‌డ్జెట్ ని నిర్మాత ఖ‌ర్చు చేస్తున్నారు. 27 మార్చి 2026న సినిమా విడుదల కానుంది.

ఈ సినిమాలో ప్ర‌తి పాటా దేనిక‌దే ప్ర‌త్యేకంగా నిలిచేలా రెహ‌మాన్ బాణీలు సిద్ధం చేస్తున్నారు. ఇక పాట‌లను విజువ‌ల్ గాను అద్భుతంగా తెర‌కెక్కించేందుకు బుచ్చిబాబు టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇటీవ‌ల ఒక ఛాలెంజింగ్ పాట షూటింగ్‌ను రామ్ చరణ్ ముగించాడు. సహజ లైటింగ్‌లో తన స్కిల్ తో మురిపించే ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ పాట‌ను అద్భుత‌మైన విజువ‌ల్ ట్రీట్ గా మలిచార‌ని స‌మాచారం. స్పెషల్ నైట్ యాక్షన్ సీక్వెన్స్ ని కూడా ఇటీవ‌ల‌ పూర్తి చేసార‌ని టీమ్ తెలిపింది. సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు రామ్ చరణ్ అద్భుతమైన నటనను కూడా ప్రశంసించారు. ఈ చిత్రంలో యాక్ష‌న్ పార్ట్ కోసం `పుష్ప 2` ఫేం నబకాంత్ మాస్టర్ ప‌ని చేసార‌ని కూడా టీమ్ వెల్లడించింది.

Tags:    

Similar News