'బతికే ఉన్నానని చెప్పడానికే పెద్ది రోల్'.. జగ్గూభాయ్ అలా అన్నారేంటి?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పెద్ది విడుదలకు సిద్ధమవుతోంది.

Update: 2026-05-29 07:06 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పెద్ది విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సనా రూపొందిస్తున్న ఆ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సీనియర్ యాక్టర్ జగపతి బాబు తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. జూన్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ మూవీ ప్రమోషన్స్‌ లో పాల్గొన్న ఆయన.. తన కెరీర్‌, పర్సనల్ లైఫ్ తోపాటు సినిమాలపై ఉన్న ప్యాషన్ గురించి ఓపెన్‌ గా మాట్లాడారు.

పెద్ది సినిమాలో తాను పోషిస్తున్న అప్పలసూరి పాత్ర తనకు చాలా స్పెషల్ అని జగపతిబాబు తెలిపారు. 'ఆ రోల్ నన్నే డామినేట్ చేసింది. జగపతిబాబు ఇంకా బతికే ఉన్నాడని చెప్పడానికి ఇలాంటి పాత్రలు చాలా అవసరం' అంటూ చేసిన కామెంట్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. నటుడిగా కొత్త తరహా పాత్రలు చేయాలని కోరిక ఇప్పటికీ తగ్గలేదని ఆయన ఇన్ డైరెక్ట్ గా చెప్పారు.

సినిమాలు తనకు ప్రొఫెషన్ మాత్రమే కాకుండా లైఫ్ అని చెప్పిన జగపతిబాబు.. ఇంట్లో ఖాళీగా కూర్చోవడం తనకు అస్సలు నచ్చదన్నారు. 'డబ్బులు కావాలంటే సినిమాలు చేయాల్సిందే. డబ్బు అవసరం ఎప్పుడూ ఉంటుంది. కానీ దానికంటే ఎక్కువగా నాకు పని చేయడం అంటే ఇష్టం. ఇప్పుడు నాకు ప్రత్యేకమైన హాబీలు కూడా లేవు. ఒకప్పుడు మందు తాగేవాడిని.. అది కూడా మానేశా. సినిమాలే నా ప్యాషన్' అని తెలిపారు.

తన కెరీర్‌ లో ఎదురైన కొన్ని ఇబ్బందుల గురించి కూడా జగపతిబాబు మాట్లాడారు. లైఫ్ లో, సినీ జర్నీలో సక్సెస్ లు లేట్ గానే వచ్చాయని అన్నారు. మొదట వరుస ఫ్లాపులు చూసిన తర్వాత హిట్లు వచ్చాయని గుర్తు చేసుకున్నారు. అందుకే ఫ్లాపులు పెద్దగా పట్టించుకోనని చెప్పారు. ఏదో ఒక రోజు విజయం వస్తుందనే నమ్మకం ఉంటుందని, జీవితం మనం అనుకున్నట్లు సాగదని చెప్పారు. కానీ ప్రతి కష్టం ఏదో ఒక పాఠం నేర్పుతుందని అన్నారు.

2011 నుంచి 2013 వరకు తన లైఫ్ లో ఇబ్బందులు ఎదురయ్యాయని జగపతిబాబు తెలిపారు. అయితే ఆ బాధ తర్వాత ఇప్పుడు మంచి రోజులు వచ్చాయని చెప్పారు. కష్టానికి తగిన ఫలితం తప్పకుండా వస్తుందని, బాధ వెనుక సంతోషం ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తన టైమ్ స్టార్ట్ అయిందనిపిస్తోందని అన్నారు. సినిమాల విషయంలో తాను ఎప్పుడూ ఒత్తిడికి గురి కాలేదని కూడా ఆయన పేర్కొన్నారు

కుటుంబానికి సంబంధించిన విషయాలు తప్ప మిగతా వాటిని పెద్ద సమస్యగా తీసుకోనని చెప్పారు. పెద్దిలో తనకు, చరణ్‌ కు మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు. అలాగే చరణ్ డెడికేషన్ పై జగపతిబాబు ప్రశంసలు కురిపించారు. ప్రతి సినిమాకు ఆయన ఎంతో కష్టపడతారని, ముఖ్యంగా పెద్ది కోసం మేకోవర్ విషయంలో బాగా కష్టపడ్డారని తెలిపారు. దీంతో సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

Tags:    

Similar News