ఢిల్లీకి తంగంతో వెళ్లనున్న 'పెద్ది'

రామ్‌ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'పెద్ది' సినిమా షూటింగ్‌ జెట్‌ స్పీడ్‌తో సాగుతోంది.;

Update: 2025-07-01 06:02 GMT

రామ్‌ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'పెద్ది' సినిమా షూటింగ్‌ జెట్‌ స్పీడ్‌తో సాగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌కి కదా సినిమాను విడుదల చేసేది అని తాపీగా బుచ్చిబాబు షూటింగ్‌ చేయడం లేదు. చాలా స్పీడ్‌గా సినిమాను పూర్తి చేసేందుకు బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్‌ను ప్లాన్‌ చేస్తున్నాడు. ఇప్పటికే కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయింది. మరో వైపు భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌, పాటల చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే అక్టోబర్‌ లేదా నవంబర్‌ వరకు సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని బుచ్చిబాబు ప్లాన్‌ చేస్తున్నాడట. త్వరలో మరో షెడ్యూల్‌కి బుచ్చిబాబు ప్లాన్‌ చేశాడని చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.

'పెద్ది' సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను జులై 12 నుంచి ఢిల్లీలో ప్లాన్‌ చేస్తున్నారు. అందుకోసం చిత్ర యూనిట్‌ సభ్యులు ఇప్పటికే అక్కడికి వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అక్కడ దాదాపు వారం నుంచి పది రోజుల పాటు షూటింగ్‌ ఉండనుందట. రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌లపై రొమాంటిక్‌ సీన్స్ షూటింగ్‌ జరపనున్నారని తెలుస్తోంది. అతి త్వరలోనే పెద్ది సినిమా నుంచి కీలక అప్‌డేట్‌ రాబోతుంది. అందులో రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌లు ఉంటారనే వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తానికి ఢిల్లీ షెడ్యూల్‌లో రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌ల కాంబో రొమాంటిక్ సీన్‌లు షూట్‌ చేసిన తర్వాత ఒక పాట చిత్రీకరణ కూడా ఉండబోతుందట.

ఎన్టీఆర్‌తో కలిసి దేవర సినిమాలో నటించిన జాన్వీ కపూర్‌ ఆ వెంటనే రామ్‌ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. దేవర సినిమాలో తంగం పాత్రలో నటించడం ద్వారా టాలీవుడ్‌కి పరిచయం అయింది. ఆ సినిమాలో నటనకు పెద్దగా స్కోప్ దక్కలేదు. కేవలం గ్లామర్‌ షో కి మాత్రమే జాన్వీ కపూర్‌ పరిమితం అయింది. కానీ పెద్ది సినిమాలో అలా ఉండదని తెలుస్తోంది. కచ్చితంగా దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ పాత్రకు సరైన వెయిట్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తన గత చిత్రం ఉప్పెనలో హీరోయిన్‌ పాత్రకు ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలిసిందే. అందుకే ఈ సినిమాలోనూ హీరోయిన్‌ పాత్రకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

మెగా కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం పెద్ది సినిమా షూటింగ్ ఢిల్లీ షెడ్యూల్‌ తర్వాత మరో రెండు షెడ్యూల్స్‌లో పూర్తి చేయనున్నట్లు సమాచారం అందుతోంది. సినిమాలో రామ్‌ చరణ్‌ క్రీడాకారుడిగా కనిపించబోతున్నాడు. సాధారణంగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ అంటే ఒకే గేమ్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో చాలా గేమ్స్‌ను ప్రేక్షకులు చూడబోతున్నారు. భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. ఆయన క్యాన్సర్‌ను జయించి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. మరో షెడ్యూల్‌లోనూ ఆయన నటించే అవకాశాలు ఉన్నాయి. ఏఆర్ రెహమాన్‌ అందిస్తున్న సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News