బుచ్చిబాబుకు ప్ర‌శ్న‌: తెలుగు లో ప‌ర‌భాషా న‌టులు ఎందుకు! తెలుగు న‌టులు చాల‌రా?

టాలీవుడ్‌లో ప్రస్తుతం పాన్-ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. అయితే ఈ సినిమాల్లో ఇతర పరిశ్రమల నటీనటులను తీసుకోవడంపై తరచూ చర్చలు జరుగుతూనే ఉంటాయి.

Update: 2026-06-15 06:33 GMT

టాలీవుడ్‌లో ప్రస్తుతం పాన్-ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. అయితే ఈ సినిమాల్లో ఇతర పరిశ్రమల నటీనటులను తీసుకోవడంపై తరచూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన‌ ప్రతిష్టాత్మక చిత్రం `పెద్ది`కి సంబంధించి జరిగిన ప్రెస్ మీట్‌లో ఇటువంటి ఆసక్తికరమైన చర్చే ఒకటి సాగింది. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు బొమన్ ఇరానీతో పాటు ఇతర భాషల ఆర్టిస్టులను ఎంపిక చేసుకోవడంపై ఒక జర్నలిస్ట్ దర్శకుడు బుచ్చిబాబును నేరుగా ప్రశ్నించారు. తెలుగు నటులను కాదని ఇతర ఇండస్ట్రీల వైపు ఎందుకు మొగ్గు చూపాల్సి వచ్చిందనేది ఆ ప్రశ్న సారాంశం.

ఈ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ ప్రశ్నిస్తూ.. ``మన తెలుగు చిత్ర పరిశ్రమలో నరేష్, రావు రమేష్, శ్రీకాంత్, శివాజీ, నందు వంటి అద్భుతమైన ప్రతిభ గల నటులు చాలా మంది ఉన్నారు. మీ గురువు సుకుమార్ `పుష్ప` సినిమా కోసం మన తెలుగు నటులతోనే అద్భుతంగా తెలుగు మాట్లాడించి, ఆ సినిమాను ఉత్తరాదికి తీసుకెళ్లి అక్కడ బంపర్ హిట్ కొట్టారు కదా! మరి మీ గురువుగారిని చూసి మీరు ఈ విషయం నేర్చుకోలేదా? మన తెలుగు ఆర్టిస్టులతోనే సినిమాలు చేయించడం ద్వారా బడ్జెట్ తగ్గడమే కాకుండా... ఇక్కడి ప్రేక్షకులకు పాత్రలు మరింత బాగా కనెక్ట్ అవుతాయి కదా`` అని నిలదీశారు.

అంతేకాకుండా.. ఉత్తరాదికి చెందిన బొమన్ ఇరానీ వంటి నటుడితో మలయాళం మాట్లాడించడం... అలాగే సినిమాలో `కొరమయ్య` పాత్ర కూడా మలయాళంలోనే మాట్లాడటంపై సదరు జర్నలిస్ట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మన నటుల చేత తెలుగులోనే మాట్లాడించేలా చేస్తే మన భాష మరింత వ్యాప్తి చెందుతుందని.. ఎమోషన్ కూడా అద్భుతంగా పండుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రశ్నలపై దర్శకుడు బుచ్చిబాబు స్పందిస్తూ.. తాము కేవలం బడ్జెట్ కోసమో... పాన్-ఇండియా క్రేజ్ కోసమో ఇతర భాషల నటులను తీసుకోవడం లేదని... కథలోని ఆయా పాత్రలకు వారు మాత్రమే సరిగ్గా సూట్ అవుతారనిపించిందని... పాత్రల ఔచిత్యం కోసమే బొమన్ ఇరానీని ఎంపిక చేసుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

అయితే జర్నలిస్ట్ ప్రశ్నకు బుచ్చిబాబు త‌నదైన శైలిలో సమాధానమిచ్చారు. రావు రమేష్ ఇప్పటికే మా సినిమాల‌లో ముఖ్యమైన పాత్రల‌లో నటిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. పూర్వపు రోజుల్లో ఎస్.వి. రంగారావు, నాగభూషణం, రావు గోపాలరావు వంటి దిగ్గజాలు పాత్రల్లో ఒదిగిపోయిన విషయాన్ని జర్న‌లిస్టు గుర్తు చేయ‌గా... ఇప్పుడు బుచ్చిబాబు కూడా ఒక సరికొత్త సన్నివేశాన్ని, పాత్రను డిజైన్ చేసి దానికి సరిపోయే ఒక భారతీయ నటుడిని (బొమన్ ఇరానీ) ఎంపిక చేసుకున్నామ‌ని తెలిపారు. ఆ పాత్ర‌కు ఆయ‌న సూట‌బుల్ అనుకుని తీసుకున్నామ‌ని స‌ర్ధి చెప్పారు.

ఏది ఏమైనా ఒక సినిమాను పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్లే క్రమంలో స్థానిక నటీనటులకు ప్రాధాన్యత ఇవ్వాలా? లేక పాత్రల డిమాండ్ మేరకు పరభాషా నటులను ఎంచుకోవాలా? అనే చర్చ ఈ ఇంటర్వ్యూతో మరోసారి తెరపైకి వచ్చింది. ఒకవైపు గురువు సుకుమార్ `పుష్ప` ఫార్ములాను గుర్తు చేస్తూ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలు, దానికి దర్శకుడు బుచ్చిబాబు ఇచ్చిన వివరణలు ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. బుచ్చిబాబు పాత్రల ఎంపిక ఎంతవరకు న్యాయం చేసిందో ప్రేక్షకులు ఇప్ప‌టికే డిసైడ్ చేసారు. `పెద్ది` చిత్రం కేవ‌లం 10 రోజులలో దాదాపు రూ.366 కోట్ల వ‌సూళ్ల‌తో 2026 బెస్ట్ తెలుగు సినిమాగా రికార్డుల‌కెక్కింది.

Tags:    

Similar News