నెవ్వర్ బిఫోర్ అనేలా పెద్ది గ్రాండ్ యాక్షన్ సీన్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పెద్ది.;

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పెద్ది. ఇది కేవలం స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాకుండా ఓ భావోద్వేగాల ప్రయాణమని చెబుతున్నారు మేకర్స్. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీగా వంశీ సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో చిత్రబృందం కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది. ఇందులో రామ్ చరణ్ పాల్గొననున్న యాక్షన్ సీన్ ఇప్పటివరకు ఇండియన్ సినిమాల్లో లేనట్టుగా ఉంటుందట. ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను నబాకాంత్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. ఇటీవల వైరల్ అయిన పెద్ది క్రికెట్ షాట్‌ను రూపొందించిన వారు కూడా ఇతనే. దాంతో ఈ సీన్ మీద అంచనాలు మరింత పెరిగిపోయాయి.
ఇంతకుముందు హైదరాబాద్‌లో వేసిన గ్రామం సెట్లో భారీ షెడ్యూల్ పూర్తయింది. అందులో రామ్ చరణ్‌తో పాటు బాలీవుడ్ విలన్‌గా గుర్తింపు పొందిన దివ్యేందు శర్మ కూడా పాల్గొన్నారు. ఆ షూట్ చాలా బాగా వచ్చిందని, సినిమాకు సంబంధించిన ప్రతీ ఫ్రేమ్ పై మేకర్స్ చాలా సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది. బుచ్చిబాబు కథన శైలి, ఎమోషనల్ డెప్త్ సినిమాకు పాజిటివ్ వైబ్స్‌ను పెంచుతున్నాయి.
పెద్ది కథ కేవలం స్పోర్ట్స్ నేపథ్యంలో సాగేదేగాక, ఓ వ్యక్తి జీవిత ప్రయాణాన్ని సాలీడ్ గా చూపిస్తుందట. అందులో అన్ని రకాల భావోద్వేగాలూ ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. ఒక స్పోర్ట్స్ మనిషి జీవితంలో ఎదురయ్యే చీకటి వెలుగు తరహా మలుపులను హైలెట్ చేస్తుందని తెలుస్తోంది. దీనికి గాను అగ్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో కీలక ఆకర్షణ కానుంది.
జాన్వీ కపూర్ హీరోయిన్గా, శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నటీనటుల ఎంపికను చూసినా ఇది పక్కా బ్లాక్ బస్టర్ అవ్వబోతుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. ప్రతి ఫ్రేమ్ వండర్‌గా ఉండేలా చిత్రీకరణ సాగుతోందని సమాచారం. ఈ భారీ విజువల్ స్పెక్టకిల్ మూవీని 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అప్పటి వరకూ సినిమాకు సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందిస్తామని మేకర్స్ చెబుతున్నారు. పెద్ది సినిమా పైన ఈ హైప్ చూస్తే.. రామ్ చరణ్ అభిమానులకు ఇది మరో స్పెషల్ జర్నీ కానుందని చెప్పవచ్చు.