తప్పు దొర్లింది ..బుమ్రాకు సారీ.. హుందాతనంలో చరణ్ శిఖరం ఎత్తు!
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నార్త్ ఇండియాలో తనకున్న భారీ క్రేజ్‌ను మరోసారి నిరూపించుకున్నారు.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నార్త్ ఇండియాలో తనకున్న భారీ క్రేజ్‌ను మరోసారి నిరూపించుకున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న `పెద్ది` మూవీ మ్యూజిక్ వేడుక మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు ఊక వేస్తే రాలనంత మంది అభిమానులు తరలిరావడంతో వెన్యూ ప్లేస్ జనసందోహంగా మారింది. అంతమంది భారీ ఫ్యాన్స్ ని వారి కోలాహాలాన్ని.. అపరిమితమైన అభిమానాన్ని చూసి రామ్ చరణ్ తీవ్రమైన ఎగ్జైట్‌మెంట్‌కు లోనయ్యారు.
ఈ ఉత్సాహంలో స్టేజ్ ల్యాంగ్వేజ్‌లో చరణ్ నుండి కొన్ని చిన్న పొరపాట్లు దొర్లాయి. దేశంలోని ప్రముఖ క్రికెటర్లను ఒక్క ముక్కలో వర్ణించమని కోరినప్పుడు.. సచిన్‌ను లెజెండ్ అని.. ధోనీని కూల్ అని... కోహ్లీని ఫైర్ అని వర్ణించిన చరణ్, చివర్లో జస్‌ప్రీత్ బుమ్రా పేరు వచ్చేసరికి తడబడ్డారు. బుమ్రాను ఒక ఫుట్‌బాలర్‌గా సంబోధిస్తూ... ``నేను మీకు పెద్ద ఫ్యాన్‌ని.. మీరు ఫుట్‌బాల్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్తున్నారు`` అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆయన నోటి వెంట బుమ్రా పేరు `బుల్ బుల్స్రా` అన్నట్లుగా కూడా పొరపాటుగా వచ్చింది.
మరోవైపు ఈ వేడుక మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరుగుతుండగా... చరణ్ పొరపాటున ఆ ప్రాంతాన్ని మాటల ఫ్లోలో `బిహార్`గా పేర్కొన్నారు. ఒకే వేదికపై రాష్ట్రం పేరును.. అలాగే దేశం గర్వించదగ్గ క్రికెటర్ క్రీడను మార్చి చెప్పడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అయితే రామ్ చరణ్ ఏమాత్రం మొహమాటపడకుండా వేదికపైనే కాకుండా... వెంటనే తన `ఎక్స్`(ట్విట్టర్) ఖాతా ద్వారా కూడా జస్‌ప్రీత్ బుమ్రాకు బహిరంగ క్షమాపణలు చెప్పారు.
తన క్షమాపణల్లో చరణ్ చాలా హుందాగా వ్యవహరించారు. ``అంతమంది జనాన్ని చూసిన ఎగ్జైట్‌మెంట్‌లో ఆ హడావుడిలో పేర్లు మరిచిపోవడం వల్ల జరిగిన మానవ తప్పిదం ఇది. బుమ్రా గారూ.. క్షమించండి.. నేను మీ ఆటకి చాలా పెద్ద అభిమానిని. మీరు బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెడుతూ దేశం గర్వపడేలా చేస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది`` అంటూ రామ్ చరణ్ వివరణ ఇచ్చారు. పొరపాట్లను వెంటనే సరిదిద్దుకుని క్షమాపణలు చెప్పిన చరణ్ నిజాయితీని నెటిజన్లు అభినందిస్తున్నారు.
ప్రస్తుతం బుమ్రా ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ కాస్త గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ తనపై చూపిన గౌరవం అభిమానుల మనసు గెలుచుకుంది. భోపాల్ వేడుకలో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, కథానాయిక జాన్వీ కపూర్ సహా చిత్ర బృందం మొత్తం పాల్గొంది. చిన్న తడబాటు మినహాయిస్తే... నార్త్ ఇండియాలో రామ్ చరణ్‌కు ఉన్న అసాధారణమైన ఫాలోయింగ్‌కు ఈ `పెద్ది` ఈవెంట్ ఒక సజీవ సాక్ష్యంగా నిలిచింది.