G2తో శేష్ ప్లానేంటి? ఈసారి గురితప్పదా?

టాలీవుడ్ లో కథకు ఇంపార్టెన్స్ ఇచ్చే హీరోల్లో అడివి శేష్ పేరు కచ్చితంగా టాప్ లో ఉంటుంది.

Update: 2026-07-10 05:27 GMT

టాలీవుడ్ లో కథకు ఇంపార్టెన్స్ ఇచ్చే హీరోల్లో అడివి శేష్ పేరు కచ్చితంగా టాప్ లో ఉంటుంది. క్షణం, గూఢచారి, మేజర్ వంటి సినిమాలతో విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శేష్.. ఇప్పుడు తన కెరీర్‌ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గూఢచారి 2 (G2)పై పూర్తి దృష్టి పెట్టారు. ఫస్ట్ పార్ట్ సాధించిన విజయంతో ఆ సీక్వెల్‌ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వాటికి తగ్గట్టే ఈసారి మరింత పెద్ద స్థాయిలో సినిమాను తీసుకురావాలన్నది మూవీ టీమ్ ప్లాన్ గా కనిపిస్తోంది.

గూఢచారి విడుదలై చాలా సంవత్సరాలు కావొస్తున్నా.. ఆ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అదే సీక్వెల్‌ కు అతిపెద్ద స్ట్రెంత్. అందుకే కథ, యాక్షన్, విజువల్ క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా మూవీ టీమ్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణ సీక్వెల్‌ గా కాకుండా, పాన్ ఇండియా రేంజ్ లో ఆకట్టుకునే స్పై యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో కనిపించనుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. హీరోకు సరైన విలన్ ఉంటేనే స్పై థ్రిల్లర్ మరింత ఆసక్తికరంగా మారుతుందనే ఆలోచనతో సెలెక్ట్ చేసినట్లు వినికిడి. దీంతో సౌత్ తో పాటు నార్త్ ఆడియన్స్ లో సినిమాపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. అడివి శేష్ ప్రస్తుతం అన్ని భాషల ప్రేక్షకులను చేరుకునే బలమైన కథలపై దృష్టి పెట్టినట్లు సమాచారం.

అందుకే గూఢచారి 2ని పాన్ ఇండియా మార్కెట్‌ ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నారు. యాక్షన్ సీన్స్, ఫారిన్ లొకేషన్లు, భారీ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు మరో ప్రధాన బలంగా నిలవనున్నాయి. అయితే సినిమా విడుదల ఆలస్యం కావడంపై కూడా చర్చ జరుగుతోంది. భారీ క్యాస్టింగ్, వివిధ భాషలకు చెందిన క్యాస్టింగ్ డేట్లు అడ్జెస్ట్ చేయడం, ఇంటర్నేషనల్ రేంజ్ యాక్షన్ సీన్స్ వంటి కారణాలతో నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుందట.

అయితే క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ముందుకు వెళ్లాలన్న నిర్ణయంతోనే మూవీ టీమ్ పని చేస్తోందని తెలుస్తోంది. షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు స్పెషల్ ఇంపార్టెన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. అందుకే విడుదల తేదీ కంటే క్వాలిటీ అవుట్‌ పుట్‌ కే ప్రాధాన్యం ఇస్తున్నారని వినికిడి.

గూఢచారితో స్పై థ్రిల్లర్ జానర్‌ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్.. ఇప్పుడు గూఢచారి 2తో ఆ విజయాన్ని మరింత హై రేంజ్ కు తీసుకెళ్లాలనే టార్గెట్ తో ఉన్నారు. ఆ సినిమా ద్వారా తెలుగు మార్కెట్‌ తో పాటు నార్త్ ఆడియన్స్ ను ఆకట్టుకోవాలని భావిస్తున్నారు. ఆ స్థాయిలో విజయం సాధించాలంటే స్ట్రాంగ్ కంటెంట్, సస్పెన్స్ స్క్రీన్ ప్లే, యాక్షన్ సీన్స్ ఉండాలి. మొదటి భాగం సాధించిన విజయాన్ని కొనసాగిస్తూ, ఈసారి కూడా ప్రేక్షకులను థ్రిల్ చేయగలిగితే అడివి శేష్ గురి తప్పదేమో. మరేం జరుగుతుందో అంతా వేచి చూడాలి.

Tags:    

Similar News