దుల్కర్ సల్మాన్ DQ 41 టైటిల్ ఫిక్స్.. ఆయనపై స్ఫూర్తితోనే!

మాలీవుడ్ స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు మాలీవుడ్ లో కంటే కూడా టాలీవుడ్ లోనే వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు

Update: 2026-07-10 05:53 GMT

మాలీవుడ్ స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు మాలీవుడ్ లో కంటే కూడా టాలీవుడ్ లోనే వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్ర పోషించి, తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న దుల్కర్ సల్మాన్.. తొలిసారి తెలుగులో నేరుగా హను రాఘవపూడి దర్శకత్వంలో సీతారామం సినిమా చేసి మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు.




ఇక ఈ సినిమా తర్వాత లక్కీ భాస్కర్ సినిమా చేసి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు దుల్కర్ సల్మాన్. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు మంచి కథా ఓరియంటెడ్ చిత్రాలను నిర్మిస్తూ దూసుకుపోతున్న ఈయన తాజాగా DQ 41 అనే వర్కింగ్ టైటిల్ తో తన 41వ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా టైటిల్ ని రివీల్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

రవి నెలకుడిటి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తాజాగా నిర్మాతలు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి శ్రీశ్రీ అని టైటిల్ ని పెట్టారు. తెలుగు సాహిత్య దిగ్గజం, దిగ్గజ కవి అయిన శ్రీశ్రీకి సరైన నివాళిగా నిలుస్తుంది అని, ఆయన స్ఫూర్తితోనే ఈ టైటిల్ పెట్టినట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఇకపోతే తాజాగా విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే కాలేజీ యూనిఫాంలో టీనేజర్స్ లా కనిపించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సిగ్గుపడుతూ.. నవ్వుతూ కనిపించిన ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్కరినీ హత్తుకునే సహజమైన తొలిప్రేమ భావోద్వేగాన్ని చాలా అద్భుతంగా వీరు ఆవిష్కరించారు. ఇకపోతే దుల్కర్ సల్మాన్ - పూజాల మధ్య కెమిస్ట్రీ చక్కగా ఆకట్టుకోబోతోంది అనే కామెంట్లు పోస్టర్ చూశాక వ్యక్తం అవుతున్నాయి.

ప్రేమ మళ్ళీ చిగురిస్తుంది అనే పవర్ఫుల్ డైలాగ్ తో.. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా షూటింగు విదేశీ లొకేషన్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ఒక సంపూర్ణ సినిమా అనుభూతిని కలిగిస్తుంది అంటూ మేకర్స్ ప్రకటించారు. మరి భారీ అంచనాల మధ్య ప్యూర్ ప్రేమ కథతో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకోనుందో చూడాలి.

Tags:    

Similar News