ఫిట్‌నెస్ మార్కెట్ మాయాజాలం.. ఐపీఓ ద్వారా 950 కోట్లు కొల్లగొట్టే ప్లాన్‌లో స్టార్ హీరో
ఈ పరిణామాల నేపథ్యంలో అసలు బాలీవుడ్ స్టార్లలో ఐపీఓలకు వెళ్లిన హీరోలు ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ వెండితెరపైనే కాదు.. వ్యాపార సామ్రాజ్యంలోనూ తానే ఒక `మాస్టర్ మైండ్` అని నిరూపించుకుంటున్నారు. వ్యాపారం ప్రారంభించడం.. దానిలోకి ప్రజల సొమ్ముల్ని భారీ పెట్టుబడిగా రాబట్టడం వంటి వ్యూహాలతో దూసుకుపోతున్నాడు. తన సంపదల విలువను పెంచుకోవడంలో హృతిక్ బిగ్ గేమ్ ఆడుతున్నాడు. అతడి ఇన్వెస్ట్‌మెంట్లలో ఒకటైన ప్రముఖ ఫిట్‌నెస్ అండ్ వెల్‌నెస్ ప్లాట్‌ఫామ్`కల్ట్ డాట్ ఫిట్` త్వరలో తీసుకురాబోతున్న ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపివో) ద్వారా భారీ లాభాలను ఆర్జించే ప్లాన్ చేశారు. ఈ ఐపీఓ ద్వారా మార్కెట్ నుండి రూ. 950 కోట్ల వరకు తాజా మూలధనాన్ని సేకరించడమే కంపెనీ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే హృతిక్ తన వాటాలలోని కొంత భాగాన్ని విక్రయించడానికి సిద్ధమవ్వడం ఇప్పుడు కార్పొరేట్ - సినీ వర్గాల్లో సంచలనంగా మారింది.
కల్ట్.ఫిట్ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి సమర్పించిన డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డి.ఆర్.హెచ్.పి) ప్రకారం.. ఐపీఓ కంటే ముందు హృతిక్ రోషన్ వద్ద కంపెనీకి చెందిన దాదాపు 19.01 లక్షల ఈక్విటీ షేర్లు (దాదాపు 0.20 శాతం వాటా) ఉన్నాయి. ఈ మార్కెట్ వేవ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో ఆయన ఆఫర్-ఫర్-సేల్ (ఓఎఫ్ఎస్) కింద తన వద్దనున్న వాటిలో మెజారిటీ షేర్లు అయిన 6,33,824 ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నారు. అయితే ఆయన కంపెనీ నుంచి పూర్తిగా తప్పుకోవడం లేదు. వాటాల విక్రయం తర్వాత కూడా సంస్థలో ఈక్విటీ భాగస్వామిగా కొనసాగుతూ.. బ్రాండ్ అంబాసిడర్‌గా తన సేవలను అందించనున్నారు.
ఇటీవలి కాలంలో బాలీవుడ్ ప్రముఖులు తమ వ్యాపార వాటాలను విక్రయించడం ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తన `ధర్మా ప్రొడక్షన్స్`లోని వాటాను కార్పొరేట్ దిగ్గజాలకు అమ్మడం ద్వారా ఇండస్ట్రీలో పెద్ద చర్చకు తెరలేపారు. ఆ తర్వాత ఇప్పుడు హృతిక్ రోషన్ తన ఫిట్‌నెస్ వ్యాపారంలో అత్యంత తెలివైన నిర్ణయం తీసుకుంటున్నారంటూ నెటిజన్లు, బిజినెస్ అనలిస్టులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీర్ఘకాలిక లాభాలపై కన్నేసిన కల్ట్ ఫిట్ సంస్థను సరైన సమయంలో పబ్లిక్ ఇష్యూకి తీసుకురావడం హృతిక్ బిజినెస్ స్ట్రాటజీకి నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు.
ఈ కల్ట్.ఫిట్ ఐపీఓలో రెండు విభాగాలు ఉన్నాయి. కంపెనీ కొత్త ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ. 950 కోట్ల వరకు తాజా నిధులను సేకరించాలని భావిస్తుండగా.. దీనితో పాటు ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్-ఫర్-సేల్ రూట్ ద్వారా గరిష్టంగా 17.86 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఈ విభాగంలోనే హృతిక్ రోషన్‌తో పాటు పలువురు ప్రారంభ ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయిస్తున్నారు. తన వాటాను పూర్తిగా వదులుకోకుండా కేవలం కొంత భాగమే విక్రయించాలనే హృతిక్ నిర్ణయం.. కల్ట్.ఫిట్ బ్రాండ్ దీర్ఘకాలిక వృద్ధి.. భవిష్యత్తు లాభాలపై ఆయనకున్న అచంచలమైన నమ్మకాన్ని సూచిస్తోంది.
అమితాబ్, సల్మాన్ ఇదే బాటలో...
ఈ పరిణామాల నేపథ్యంలో అసలు బాలీవుడ్ స్టార్లలో ఐపీఓలకు వెళ్లిన హీరోలు ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది. గతంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ (జస్ట్ డయల్), సల్మాన్ ఖాన్ (యాత్రా.కామ్) వంటి తారలు పలు స్టార్టప్ కంపెనీలలో ప్రారంభ పెట్టుబడులు పెట్టి... ఆయా కంపెనీలు ఐపీఓకి వెళ్లినప్పుడు భారీగా లాభపడ్డారు. అలాగే హీరోయిన్లలో ఆలియా భట్, కత్రినా కైఫ్ వంటి వారు `నైకా` ఐపీఓ ద్వారా కోట్లాది రూపాయల లాభాలను కొల్లగొట్టారు. ఇప్పుడు అదే బాటలో హృతిక్ రోషన్ తన కల్ట్.ఫిట్ ఐపీఓ ద్వారా సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు.