డెడ్ లిఫ్ట్ గాయం అంత‌గా ఏడిపించిందా ర‌కుల్?

ఈ గాయం రకుల్‌ను కేవలం శారీరకంగానే కాకుండా.. మానసికంగా కూడా తీవ్రంగా కుంగదీసింది.

Update: 2026-06-06 03:45 GMT

సినిమా తారలు వెండితెరపై ఎంత గ్లామరస్‌గా కనిపించినా ఆ ఫిట్‌నెస్ వెనుక తీవ్ర‌మైన‌ కష్టం.. కొన్నిసార్లు ప్రాణాల మీదికి తెచ్చే ప్రమాదాలు కూడా ఉంటాయి. టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన జిమ్ గాయం గురించి తాజాగా నోరు విప్పారు. జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా జరిగిన ఒక చిన్న పొరపాటు తనను శారీరకంగా, మానసికంగా ఎంతటి నరకానికి గురిచేసిందో వివరించారు. ప్రముఖ నటీనటులు నేహా ధూపియా, అంగద్ బేడీ హోస్ట్ చేస్తున్న `డబుల్ డేట్` టాక్ షోలో తన భర్త జాకీ భగ్నానీతో కలిసి పాల్గొన్న రకుల్ ఈ చేదు అనుభవాన్ని ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు.

జిమ్‌లో తగిన రక్షణ జాగ్రత్తలు తీసుకోకుండా 80 కేజీల బరువైన డెడ్‌లిఫ్ట్ చేస్తుండగా తనకు తీవ్రమైన నడుము గాయమైందని రకుల్ గుర్తుచేసుకున్నారు. ఈ వ్యాయామంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. మీ ట్రైనర్ ఎంత చెప్పినా సరే.. వర్కవుట్స్‌లో డెడ్‌లిఫ్ట్ అనేది అత్యంత చెత్త వ్యాయామం. అదొక ఈగో లిఫ్ట్..అహం కోసం చేసే బరువులు ఎత్తడం! అని సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా తాను ఈ వర్కవుట్ చేసేటప్పుడు ఎప్పుడూ సేఫ్టీ బెల్ట్ ధరిస్తానని.. కానీ ఆ దురదృష్టకరమైన రోజున బెల్ట్ పెట్టుకోకపోవడమే శాపంగా మారిందని.. ఆ ఒక్క చిన్న పొరపాటు వల్ల తనకు `స్లిప్ డిస్క్` అయి ఏకంగా 40 రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందని రకుల్ వెల్లడించారు.

ఈ గాయం రకుల్‌ను కేవలం శారీరకంగానే కాకుండా.. మానసికంగా కూడా తీవ్రంగా కుంగదీసింది. హఠాత్తుగా కదల్లేని స్థితికి చేరుకోవడం.. కనీసం తన పనులు కూడా తాను చేసుకోలేకపోవడం తీవ్రమైన మానసిక ఆందోళనకు దారితీసిందని నిజాయితీగా చెప్పారు. ఇది కేవలం శారీరక గాయం మాత్రమే కాదు.. నన్ను మానసికంగా అతలాకుతలం చేసింది. ఎందుకంటే శరీరం సహకరించని ఆ పతనావస్థలో ఉన్నప్పుడు అప్పటివరకు యాక్టివ్‌గా ఉన్న మనిషి ఒక్కసారిగా ఏమీ చేయలేని స్థితికి వచ్చేసరికి మైండ్ పూర్తిగా ఖ‌రాబైంది. అది మనల్ని విపరీతంగా బాధించింది అని రకుల్ తన వేదనను షేర్ చేసారు.

ఇలాంటి క్లిష్ట సమయాల్లో మనకు అండగా నిలిచే లైఫ్ పార్ట్‌నర్ ఉండటం ఎంత ముఖ్యమో రకుల్ ఈ సందర్భంగా హైలైట్ చేశారు. తాను కోలుకునే ప్రక్రియలో భర్త జాకీ భగ్నానీ అందించిన అపారమైన మద్దతును ర‌కుల్ కొనియాడారు. అలాంటి పెయిన్ ఫుల్ బ్యాడ్ టైమ్ లో పార్ట‌న‌ర్ స‌హాయం చాలా అవసరం. నా రికవరీలో జాకీ పాత్ర మరువలేనిది.. తను ప్రతి క్షణం నాకు అండగా నిలబడ్డాడు! అని చెప్పారు. గతంలోనే రకుల్ గాయపడినట్లు వార్తలు వచ్చినా.. పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూనే తన ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్ పూర్తి చేశారని ఆ తర్వాత నరాలు మరింత దెబ్బతినడంతో వైద్యులు పూర్తి బెడ్ రెస్ట్ సూచించారని ఈ షో ద్వారా స్పష్టమైంది.

Tags:    

Similar News