'కంటెంట్'పై 'కామెడీ' డామినేషన్
టాలీవుడ్ బాక్సాఫీస్‌లో నడుస్తున్న డ్రై రన్‌కు గత శుక్రవారం రిలీజైన రెండు సినిమాలు ఫుల్ స్టాప్ పెట్టినట్లే కనిపించాయి.;
టాలీవుడ్ బాక్సాఫీస్‌లో నడుస్తున్న డ్రై రన్‌కు గత శుక్రవారం రిలీజైన రెండు సినిమాలు ఫుల్ స్టాప్ పెట్టినట్లే కనిపించాయి. ముందు రోజు ప్రిమియర్ల నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న బైకర్, రాకాస చిత్రాలు తొలి రోజు హౌస్ ఫుల్ వసూళ్లతో నడిచాయి. ఐతే కంటెంట్ పరంగా ఈ రెండు చిత్రాల్లో ‘బైకర్’ కొంచెం ఎత్తులో నిలుస్తుందనడంలో సందేహం లేదు. అత్యున్నత సాంకేతిక విలువలతో, బెస్ట్ పెర్ఫామెన్స్‌లతో పాజిటివ్ రివ్యూలు, టాక్ తెచ్చుకుంది ‘బైకర్’.
బైక్ రేసింగ్ నేపథ్యంలో సన్నివేశాలు అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించింది చిత్ర బృందం. సినిమాలో ఎమోషన్లు బాగా పండాయి. నటీనటుల అభినయం గురించి చెప్పాల్సిన పని లేదు. యువి క్రియేషన్స్ పెద్ద బడ్జెట్లో సినిమాను రాజీ లేకుండా నిర్మించింది. ఐతే టాక్ కూడా బాగున్నా సరే.. అందుకు తగ్గట్లుగా ‘బైకర్’ వసూళ్లు రాబట్టలేకపోయింది. శని, ఆదివారాల్లో వసూళ్లు ఓకే అనిపించాయి తప్ప.. కంటెంట్‌కు తగ్గట్లు అయితే రాలేదు.
‘బైకర్’తో పోలిస్తే కంటెంట్ పరంగా వీక్ అయిన, మోడరేట్ రివ్యూలు తెచ్చుకున్న ‘రాకాస’ సినిమాకు వసూళ్లు మెరుగ్గా ఉండడం విశేషం. ‘బైకర్’ను ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డామినేట్ చేసింది. అసలు ప్రిమియర్స్‌లోనే ఈ చిన్న సినిమా డామినేషన్ చూపించింది. ‘బైకర్’ కంటే ఎక్కువ షోలు పడ్డాయి. ఆక్యుపెన్సీలు వచ్చాయి. వసూళ్లు కూడా నాలుగో వంతు ఎక్కువే రాబట్టింది. ఇక డే-1 నుంచి ‘రాకాస’ వసూళ్లు స్టడీగా సాగుతున్నాయి. ‘బైకర్’తో పోలిస్తే తక్కువ స్క్రీన్లలో సినిమాను రిలీజ్ చేయగా.. ఆక్యుపెన్సీలకు మాత్రం ఢోకా లేదు. ప్రీమియం స్క్రీన్లు, షోలు దక్కకపోయినా.. దీనికి కలెక్షన్ల పరంగా ఢోకా లేదు. సీరియస్ సినిమా అయిన ‘బైకర్’కు యువ ప్రేక్షకులు తగ్గారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఆకర్షితులయ్యారు.
కానీ ‘రాకాస’ యూత్‌ను బాగా ఎట్రాక్ట్ చేసింది. ఈ తరం యువతకు కథ, లాజిక్కులతో పని లేదు. వాళ్లను ఎంటర్టైన్ చేసే కామెడీ ఉండాలి. ‘రాకాస’లో అందుకు ఢోకా లేదు. ‘మ్యాడ్’ ద్వారా యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించిన సంగీత్ శోభన్ మరోసారి తనదైన శైలిలో ఎంటర్టైన్ చేశాడు. అతడికి వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను కూడా తోడయ్యారు. దీంతో నవ్వులకు ఢోకా లేకపోయింది. కాబట్టే ‘రాకాస’ బాక్సాఫీస్ దగ్గర డామినేషన్ చూపిస్తోంది. ఓవరాల్ వసూళ్లలో ‘బైకర్’పై పైచేయి సాధించిన ‘రాకాస’.. వీక్ డే అయిన సోమవారం కూడా బెటర్‌గా పెర్ఫామ్ చేస్తోంది.