'నెగటివ్ టాక్ వస్తే కట్ డ్రాయర్ మీద తిరుగుతా'
సినీ పరిశ్రమలో సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి దర్శకనిర్మాతలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఒకప్పుడు మైకు పట్టుకుని సినిమా బాగుంది అని బతిమిలాడేవారు.;
సినీ పరిశ్రమలో సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి దర్శకనిర్మాతలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఒకప్పుడు మైకు పట్టుకుని సినిమా బాగుంది అని బతిమిలాడేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. "సినిమా బాగోలేకపోతే ఇండస్ట్రీ వదిలేస్తా", "మరో సినిమా తీయను" అంటూ ఛాలెంజ్ లు విసిరే స్టేజ్ కి వచ్చారు. అయితే తాజాగా ఒక యువ దర్శకుడు చేసిన సవాల్ మాత్రం ఇండస్ట్రీలో ఇంతకుముందెన్నడూ చూడని విధంగా, పీక్స్ లో ఉంది. ఇది కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెన్సా అనేది పక్కన పెడితే, ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నవంబర్ 21 విడుదల కానున్న చిన్న సినిమా 'రాజు వెడ్స్ రాంబాయి'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు సాయిలు కంపాటి ఆవేశంతో ఊగిపోయారు. మైక్ పట్టుకుని మాట్లాడుతూ, తన సినిమా కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉందంటే.. ఒకవేళ సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే తాను బట్టలు విప్పుకుని తిరుగుతానని మాటిచ్చారు. అది కూడా ఎక్కడో మారుమూల కాదు, జనాలు కిక్కిరిసి ఉండే హైదరాబాద్ అమీర్ పేట్ సెంటర్ లో "కట్ డ్రాయర్" మీద ఉరుకుతానని శపథం చేశారు.
ఈ మాట వినగానే స్టేజ్ మీద ఉన్న గెస్టులు, కింద ఉన్న ఆడియన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సినిమా మీద నమ్మకం ఉండటం మంచిదే, కానీ మరీ ఇలా అర్ధనగ్నంగా తిరుగుతాను అని పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇప్పటికే రాజేంద్రప్రసాద్ లాంటి సీనియర్ నటుడు 'మాస్ జాతర' కోసం ఇండస్ట్రీ వదిలేస్తానని ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ ఏకంగా తన పరువునే పందెంగా కాశాడు.
చిన్న సినిమాలకు థియేటర్ల దగ్గర ఓపెనింగ్స్ రావడం కష్టంగా మారిన నేపథ్యంలో, ఇలాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తేనైనా జనం పట్టించుకుంటారని మేకర్స్ భావిస్తున్నట్లు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నెగెటివ్ టాక్ వస్తే ఏం జరుగుతుందో చూడాలన్న ఆత్రుతతోనైనా జనం సినిమా గురించి మాట్లాడుకుంటారు అనేది వారి స్ట్రాటజీ కావచ్చని మరికొందరు అంటున్నారు.
కానీ ఎంత గొప్ప సినిమా తీసినా, ఒక్కోసారి ఆడియన్స్ మూడ్ ని బట్టి ఫలితం మారొచ్చు. ఒకవేళ దురదృష్టవశాత్తు సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా సరే, నెటిజన్లు మాత్రం ఈ వీడియోను బయటకు తీసి దర్శకుడిని ట్రోల్ చేయడం ఖాయం. అప్పుడు దర్శకుడు నిజంగానే అమీర్ పేట్ లో పరిగెత్తలేడు, అలాగని మాట తప్పలేడు. ఇదొక రకమైన సెల్ఫ్ ట్రాప్ అనే చెప్పాలి. ఏదేమైనా 'రాజు వెడ్స్ రాంబాయి' కంటెంట్ ఎలా ఉన్నా, దర్శకుడి సవాల్ వల్ల సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ అయితే వచ్చింది. ఇక నవంబర్ 21న థియేటర్లలో సినిమా కంటెంట్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.