రజినీ- కమల్ మూవీ.. కొత్త డైరెక్టర్ డీల్ చేయగలరా?

ఇటీవల అశ్వత్ మారిముత్తు బర్త్ డే సందర్భంగా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ రిలీజ్ చేసిన ప్రత్యేక వీడియో ఆ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది.

Update: 2026-06-09 17:30 GMT

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ తలైవర్ 173 గురించి గత కొన్ని రోజులుగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆ సినిమాను లోకనాయకుడు కమల్ హాసన్‌ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఆ సినిమా దర్శకుడి సెలెక్షన్ మాత్రం హాట్ టాపిక్‌ గా మారింది.

మొదట ఆ మూవీని సీనియర్ దర్శకుడు సుందర్ సి తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. రజినీకాంత్ ఇమేజ్‌ కు తగ్గట్టుగా కమర్షియల్ ఎంటర్టైనర్‌ ను సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత డాన్ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సిబి చక్రవర్తి చేతుల్లోకి ఆ ప్రాజెక్ట్ వెళ్లినట్లు అధికారికంగా ప్రకటించారు.

ప్రీప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయని వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన కూడా తప్పుకున్నారు. దీంతో రజినీకాంత్ 173వ చిత్రానికి చివరికి ఎవరు దర్శకత్వం వహిస్తారనేది క్వశ్చన్ మార్క్ గా మారింది. అయితే ఇప్పుడు యంగ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు పేరు తెరపైకి వచ్చింది. ఓ మై కడవులే, ఓరి దేవుడా, డ్రాగన్ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, విభిన్నమైన కథలతో మంచి పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకునే ఎమోషన్స్, ఫాంటసీ ఎలిమెంట్స్ తో ఎంటర్టైనింగ్ కథలు చెప్పడంలో క్రేజ్ సంపాదించుకున్నారు.

ఇటీవల అశ్వత్ మారిముత్తు బర్త్ డే సందర్భంగా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ రిలీజ్ చేసిన ప్రత్యేక వీడియో ఆ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. హ్యాపీ బర్త్‌డే అశ్వత్ మారిముత్తు అంటూ విడుదలైన ఆ హైఎనర్జీ వీడియోను అభిమానులు నార్మల్ విషెస్ గా కాకుండా, తలైవర్ 173కు సంబంధించిన సిగ్నల్ గా భావించారు. అశ్వత్ కూడా ఫైర్ ఎమోజీలతో థ్యాంక్స్ చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ ఇక్కడే అసలు డౌట్ వచ్చింది. ఇప్పటివరకు మీడియం రేంజ్ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అశ్వత్ మారిముత్తు.. రజినీకాంత్ వంటి భారీ మాస్ ఇమేజ్ ఉన్న హీరోను ఆశించిన స్థాయిలో ప్రజెంట్ చేయగలరా? అభిమానుల అంచనాలను అందుకునే విధంగా సినిమా తెరకెక్కించగలరా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అశ్వత్ తెరకెక్కించిన మూడు చిత్రాల్లో రెండు మంచి విజయాలు సాధించగా, మరో చిత్రం యావరేజ్ రిజల్ట్ అందుకుంది. అందుకే ఆయన టాలెంట్‌ పై చాలామంది నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఆలోచనలతో రజినీకాంత్‌ ను సరికొత్త యాంగిల్ లో చూపిస్తారని ఆశిస్తున్నారు. మరోవైపు, సూపర్ స్టార్ సినిమాను డీల్ చేయడానికి అనుభవం కూడా చాలా అవసరమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. రజినీకాంత్ ఇమేజ్, అభిమానుల అంచనాలు, భారీ బడ్జెట్, కమల్ హాసన్ నిర్మాణ బాధ్యతలు వంటి అంశాలను బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు.

కానీ ఇదే తరహాలో గతంలో పలువురు యంగ్ డైరెక్టర్స్ పెద్ద స్టార్లతో విజయాలు అందుకున్న ఉదాహరణలు ఉన్నాయి. అందుకే అశ్వత్ మారిముత్తు విషయంలో అప్పుడే అంచనాలకు రావడం కూడా కరెక్ట్ కాదు. ఏదేమైనా అశ్వత్ దర్శకుడిగా ఫిక్స్ అయితే.. అది ఆయన కెరీర్‌ లోనే అతిపెద్ద టెస్ట్. మరి అనుకున్న స్థాయిలో మూవీని డీల్ చేసి విజయాన్ని అందుకుంటారా? లేక భారీ అంచనాల ఒత్తిడి ఎఫెక్ట్ చూపిస్తుందా? అన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News