ఆ సూపర్ హిట్ సీక్వెల్ సాధ్యమేనా?

1999లో విడుదలైన పడయప్ప సినిమా కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందింది. రజనీకాంత్ హీరోగా నటించగా సౌందర్య హీరోయిన్ గా నటించింది.;

Update: 2025-12-09 06:27 GMT

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కెరియర్లో ఉత్తమ సినిమాల జాబితా తీస్తే అందులో కచ్చితంగా పడయప్ప సినిమా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు పడయప్ప అంటే తెలియకపోవచ్చు, కానీ రజనీకాంత్ నటించిన నరసింహ అంటే వెంటనే అర్థమవుతుంది. పడయప్ప సినిమా ను తెలుగులో నరసింహ అనే టైటిల్ తో డబ్ చేయడం జరిగింది. ఒక డబ్బింగ్ సినిమా గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకుని.. రజినీకాంత్ ని తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువ చేసింది. నరసింహ సినిమా వచ్చి 25 సంవత్సరాలు అవుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆ సినిమా గురించి చర్చ మొదలైంది. రజనీకాంత్ సినిమాల్లో అడుగుపెట్టి 50 ఏళ్లు కాబోతున్న నేపథ్యంలో నరసింహ సినిమాను రీ రిలీజ్ చేస్తే బాగుంటుందని నిర్ణయానికి వచ్చారు. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు మొదలు పెట్టారు. నరసింహ రీ రిలీజ్ కోసం స్వయంగా రజనీకాంత్ ప్రమోషన్ చేసేందుకు ముందుకు వచ్చారు, ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ నరసింహ సినిమా...

1999లో విడుదలైన పడయప్ప సినిమా కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందింది. రజనీకాంత్ హీరోగా నటించగా సౌందర్య హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ అత్యంత కీలకమైన నీలాంబరి అనే నెగటివ్ స్టేట్స్ ఉన్న పాత్రలో నటించడం ద్వారా సినిమా స్థాయిని పెంచింది. ఆ సమయంలో నీలాంబరి పాత్రను పోషించినందుకు గాను రమ్యకృష్ణను ఎంతో మంది తిట్టుకున్నారు. అదే సమయంలో ఆమె నటనకు ఫిదా అయిన వాళ్లు ఉన్నారు. ఒక నటి ఇంతకు మించి నటించేదేమో అనిపించేంతగా నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ నటించింది. నీలాంబరి పాత్రలో నటించినందుకు గాను రమ్యకృష్ణ ఏకంగా ఫిలింఫేర్ అవార్డుని సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఈ సినిమా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అందించే చలనచిత్ర అవార్డుల్లో ఆ సంవత్సరానికి గాను ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. అంతకు ముందు వరకు ఏ తమిళ సినిమా విడుదల కానీ రేంజ్ లో ఏకంగా 210 ప్రింట్లతో సినిమా విడుదలైందని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా దాదాపు 7 లక్షల ఆడియో క్యాసెట్లు సైతం అమ్ముడుపోయాయని రికార్డులో ఉంది.

నరసింహ సినిమా రి రిలీజ్

ఇంతటి అరుదైన రికార్డ్ లను కలిగి ఉన్న ఈ సినిమాను ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో అందరి అంచనాలు పెరుగుతున్నాయి. సినిమా గురించి స్వయంగా రజనీకాంత్ ఒక వీడియోను విడుదల చేయడంతో రీ రిలీజ్ ఖచ్చితంగా భారీ కలెక్షన్స్ నమోదు చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు రీ రిలీజ్ కి హైప్ తెచ్చే విధంగా రజనీకాంత్ ఈ సినిమాకి సీక్వెల్ చేసే ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ ఒక్క ప్రకటనతో సినిమా గురించి మరింతగా మీడియాలో కథనాలు వస్తున్నాయి, ఈ సినిమాకు సీక్వెల్ చేస్తే పూర్తిగా నీలాంబరి పాత్ర చుట్టూ కథ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. మొదటి పార్ట్ లో నీలాంబరి పాత్ర చనిపోయే విధంగా చూపించారు కనుక రెండో పార్ట్ లో ఫ్రీక్వెల్ కథను చూపించాల్సి ఉంటుంది. అంటే నీలాంబరి ఎలా పెరిగింది, నరసింహ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేసింది అనే కథతో సినిమా చేయాల్సి ఉంటుంది. అందులో రజినీకాంత్ పాత్రకు ఎక్కువ స్కోప్ ఉండకపోవచ్చు అనేది కొందరు అభిప్రాయం.

రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్స్ గా..

నరసింహ వంటి సూపర్ హిట్ క్లాసిక్ కమర్షియల్ సినిమాలకు సీక్వెల్ చేయాలి అనే ఆలోచన సరైనది కాదు అంటూ సీనియర్ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సినిమా సీక్వెల్ ఆలోచన లేకపోవచ్చని కేవలం సినిమా రీ రిలీజ్ నేపథ్యంలో పబ్లిసిటీ కోసం రజనీకాంత్ తో ఆ ప్రకటన చేయించి ఉంటారు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రజినీకాంత్ వంటి సూపర్ స్టార్ తో నీలాంబరి పాత్ర నేపథ్యంలో సినిమాను చేయడం అనేది మార్కెట్ కి ఎదురు వెళ్లడం అవుతుంది. అంటే రజనీకాంత్ అభిమానులను నిరుత్సాహపరచడం అవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రజినీకాంత్ చేసిన ప్రకటన నిజమైతే అభిమానులు కొందరు సంతోషించవచ్చు కానీ నరసింహ సినిమాను ఇష్టపడే రజనీకాంత్ అభిమానులు మాత్రం అవసరమా అనే అభిప్రాయం వ్యక్తం చేయవచ్చు. సినీ విశ్లేషకులు కొందరు మాత్రం అసలు నరసింహ సీక్వెల్ రజనీకాంత్ వయసుకు సాధ్యమా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి.

Tags:    

Similar News