రజినీ సినిమా.. మళ్లీ ట్విస్ట్

సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమాకు సంబంధించి గత కొన్ని నెలలుగా ఎంత చర్చ జరుగుతోందో తెలిసిందే.;

Update: 2026-04-14 16:30 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమాకు సంబంధించి గత కొన్ని నెలలుగా ఎంత చర్చ జరుగుతోందో తెలిసిందే. తన మిత్రుడే అయిన మరో లెజెండరీ హీరో కమల్ హాసన్ నిర్మాణంలో రజినీ ఓ సినిమా చేయడానికి ఏడాది ముందు ఓకే చెప్పాడు. వీరి కలయికలో వచ్చే సినిమాకు దర్శకుడిగా ముందు సుందర్‌ను ప్రకటించారు. కానీ ఈ ప్రకటన వచ్చిన కొన్ని రోజులకే ఆయనీ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. తర్వాత కొన్ని నెలలకు ‘డాన్’ దర్శకుడు శిబి చక్రవర్తి తెరపైకి వచ్చాడు. ఇలాంటి యంగ్ డైరెక్టర్‌తో రజినీ సినిమా చేస్తున్నందుకు అభిమానులు కూడా చాలా సంతోషించారు.

ఈ చిత్రంలో రజినీ లుక్‌కు సంబంధించి శిబి 80కి పైగా డిజైన్లు రెడీ చేయించాడని.. అందులోంచి ఒకటి రజినీ ఫైనలైజ్ చేయబోతున్నాడని కొన్ని రోజుల ముందు వార్తలు వచ్చాయి. ఇది అభిమానుల్లో ఉత్సాహం నింపింది. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ఒక షాకింగ్ వార్త బయటికి వచ్చింది. శిబి ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని.. ‘డ్రాగన్’ దర్శకుడు అశ్వత్ మారిముత్తును దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారని ఒక ప్రచారం మొదలైంది.

రజినీ సినిమాకు వరుసగా ఈ మార్పులు ఏంటి అని ఫ్యాన్స్ తలలు పట్టుకున్నారు. కానీ రెండు రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారం ఇప్పుడు ఇంకో మలుపు తీసుకుంది. ఈ చిత్రానికి దర్శకుడి మార్పు నిజం కాదని అంటున్నాయి కోలీవుడ్ మీడియా వర్గాలు. అశ్వత్ మారిముత్తు.. ముందు అనుకున్న ప్రకారమే శింబు హీరోగా ఒక సినిమా తీయబోతున్నాడట. ఆ సినిమాకు సంబంధించి నిర్మాణ సంస్థ ఒక అప్‌డేట్ కూడా ఇచ్చింది. శింబు, అశ్వత్ కలయికలో వచ్చే సినిమాకు సాయి అభ్యంకర్‌ను సంగీత దర్శకుడిగా ప్రకటించింది. రజినీ సినిమా కోసం శిబి తయారు చేసిన కథ విషయంలో సంతృప్తిగా లేరన్నది నిజం కాదని అంటున్నారు.

ఉన్న ఇబ్బందల్లా తెలుగు నిర్మాత శ్రీనివాస చిట్టూరితో ఒక కమిట్మెంట్‌కు సంబంధించిన వివాదమేనట. తన కమిట్మెంట్ నెరవేర్చనందుకు రూ.5 కోట్లు చెల్లించాలని నిర్మాత కోరుతుంటే.. శిబి రూ.1.5 కోట్లు ఇవ్వడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. రెంటికీ మధ్య ఒక నంబర్ దగ్గర వ్యవహారం తేలిపోతుందని.. ఈ గొడవను సెటిల్ చేయించి శిబితోనే రజినీ కొత్త చిత్రాన్ని డైరెక్ట్ చేయిస్తారని.. అందులో మార్పేమీ ఉండదని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Tags:    

Similar News