ఆ హీరో ఆల‌యంలో విశేష నివాళి!

సూపర్ స్టార్ రజనీకాంత్ కోట్లాది మంది అభిమానించే స్టార్. ర‌జ‌నీపై అభిమానులు చూపే ప్రేమ మాట‌ల్లో చెప్ప‌లే న‌ది.;

Update: 2026-05-02 18:00 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ కోట్లాది మంది అభిమానించే స్టార్. ర‌జ‌నీపై అభిమానులు చూపే ప్రేమ మాట‌ల్లో చెప్ప‌లే న‌ది. అయితే ఇండియాలో ఉన్న అభిమానులంతా ఒక ఎత్తైతే? కోలీవుడ్ అభిమానులు మాత్రం మ‌రో ఎత్తు. అక్క‌డ అభిమానం మాట‌ల‌తో పాటు చేత‌ల్లోనూ క‌నిపిస్తుంది. మ‌న‌సులో అభిమానాన్ని గుడులు గోపురాల రూపంలోనూ చాటుతుంటారు. తాజాగా ర‌జ‌నీపై అభిమానం ఏ స్థాయికి చేరుతుందో చెప్పడానికి మదురైలోని ర‌జ‌నీ ఆలయమే ఓ నిదర్శనం. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మదురైలోని రజనీకాంత్ ఆలయ ప్రాంగ‌ణంలో ఘ‌నంంగా వేడుక‌లు జ‌రిగాయి. రజనీకాంత్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన `బాషా` చిత్రంలోని ఐకానిక్ ఆటో డ్రైవర్ పాత్ర థీమ్‌తో కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం.

ఈ ప్రత్యేక సందర్భం కోసం మదురైలోని సూపర్ స్టార్ రజనీకాంత్ ఆలయం నిర్వాహకులు ఆలయ ప్రాంగణాన్ని ఒక ఆటో స్టాండ్ తరహాలో తీర్చిదిద్దారు. `బాషా` సినిమాలో రజనీకాంత్ ధరించిన ఖాకీ దుస్తులు - ఆటో మొబైల్ చిహ్నాలను ప్ర‌ద‌ర్శించి కార్మికుల శ్రమను గౌరవించారు. సమాజంలో నిరంతరం శ్రమిస్తూ, సామాన్యులకు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్న ఆటో డ్రైవర్ల పాత్రను గుర్తుచేస్తూ వేడుకలు నిర్వహించారు. రజనీకాంత్ అంటే నటుడు మాత్రమే కాదు. కోట్లాది మందికి స్ఫూర్తి ప్రదాత. ముఖ్యంగా తన సినిమాల్లో పేదలు, కార్మికులు , సామాన్యుల పక్షాన నిలబడే పాత్రలు పోషించడం ద్వారా శ్రమజీవుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు.

బాషాలోని మాణిక్యం పాత్ర ద్వారా ఆటో డ్రైవర్ల గౌరవాన్ని పెంచారని అందుకే మే డే నాడు ఈ థీమ్‌ను ఎంచుకున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా పలువురు కార్మికులకు, ఆటో డ్రైవర్లకు అన్నదానం చేయడంతో పాటు అవసరమైన సహాయక సామగ్రిని పంపిణీ చేశారు. రజనీకాంత్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నటుడి ఆలయంలో కార్మికుల సంక్షేమం గురించి ప్రతిజ్ఞ చేశారు. `కాయకమే కైలాసం` అనే సిద్ధాంతాన్ని నమ్మే రజనీకాంత్ వ్యక్తిత్వానికి ఇది సరైన నివాళి అని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

మదురైలోని ఈ ఆలయం రజనీకాంత్ గౌరవార్థం నిర్మించబడింది. అక్కడ రజనీకాంత్ విగ్రహానికి నిత్య పూజలు జరుగుతుంటాయి. కేవలం ఆధ్యాత్మిక కార్యకలాపాలకే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఆలయ కమిటీ ముందుంటోంది. రజనీకాంత్ పుట్టినరోజున లేదా ఆయన సినిమాలు విడుదలైనప్పుడు ఇక్కడ పండగ వాతావరణం నెలకొంటుంది. ప్రస్తుతం రజనీకాంత్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా? అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయనకు ఎంతో సంతృప్తిని ఇస్తాయని సన్నిహితులు చెబుతుంటారు. నటుడి పట్ల అభిమానం సినిమా థియేటర్లకే పరిమితం కాకుండా సమాజంలోని కార్మిక వర్గాన్ని గౌరవించే స్థాయికి చేరడం అభినందనీయం. తెలుగులో అలాంటి స్టార్ ఎవ‌రు? అంటే మెగాస్టార్ చిరంజీవి పేరే చెబుతారంతా.

Tags:    

Similar News