'కూలీ' ఓటీటీ రిలీజ్ డైలమా
రజనీకాంత్- లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ సినిమా `కూలీ` మిశ్రమ స్పందనలు అందుకున్న సంగతి తెలిసిందే.;
రజనీకాంత్- లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ సినిమా `కూలీ` మిశ్రమ స్పందనలు అందుకున్న సంగతి తెలిసిందే. టాక్ తో సంబంధం లేకుండా `కూలీ` గొప్ప ఆరంభ వసూళ్లను సాధించింది. ఈ చిత్రం 300 కోట్లు వసూలు చేసిందని చిత్రబృందం చెబుతోంది. ఇదిలా ఉంటే, కూలీపై విమర్శకులు పెదవి విరిచేసారు. లోకేష్ కనగరాజ్ మేకింగ్ శైలిపైనా విమర్శలొచ్చాయి. ఈ నెగెటివ్ టాక్ వల్ల ఈ చిత్రం చాలా ముందే ఓటీటీల్లోకి వచ్చేస్తుంది! అంటూ ప్రచారం సాగుతోంది.
ముఖ్యంగా హిందీ వెర్షన్ మినహా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో `కూలీ` నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుందన్న ప్రచారం సాగిపోతోంది. అయితే హిందీ వెర్షన్ వరకూ ఎనిమిది వారాల ఒప్పంద విండో కారణంగా అక్కడ ఓటీటీలో అనుమతించరు. ఆగస్టు 14న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఆగస్టు 28తో రెండు వారాలు పూర్తవుతుంది. ఆ తర్వాత మరో ఆరు వారాలు ఆగితేనే హిందీ వెర్షన్ ఓటీటీలోకి రాగలదు. కానీ ఇతర వెర్షన్ లతో పాటు ఇది కూడా రిలీజైపోతుందని ప్రచారం సాగుతోంది. కానీ కొందరు ఎనిమిది వారాల విండో నియమాన్ని పాటిస్తారని చెబుతున్నారు.
అయితే అన్ని గందరగోళాలకు తెర దించుతూ ఓటీటీ షెడ్యూల్ గురించి రజనీ కాంత్ బృందాలు ప్రకటిస్తాయేమో చూడాలి. అమెజాన్ ప్రైమ్ నుంచి అయినా ఈ కన్ఫ్యూజన్ ని తొలగించే ప్రకటన వస్తుందేమో చూడాలి. ఊహాగానాలు వదిలిపెట్టి మేకర్స్ నుంచి అధికారికంగా కన్ఫర్మేషన్ తీసుకున్నాకే ఇలాంటి ప్రచారం చేయాలి.
గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో రూపొందించిన కూలీలో రజనీ, నాగార్జున పాత్రలు తేలిపోవడంతో లోకేష్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అతడు ప్రధాన పాత్రలను చూపించిన తీరు విమర్శల పాలైంది. కూలీ తర్వాత రజనీకాంత్ తదుపరి జైలర్ 2 పై దృష్టి సారిస్తున్నారని కథనాలొస్తున్నాయి. టైగర్ ముత్తువేల్ పాండియన్ గా అతడు తిరిగి తన పాత్రను పోషిస్తాడు. ఈ సినిమాలో ఎన్బీకే, శివరాజ్ కుమార్ తదితరులు అతిథి పాత్రల్లో నటిస్తున్నారు.