కూలీ ఆ రికార్డును బ్రేక్ చేస్తుందా?
కనీసం టీజర్ కూడా రిలీజ్ చేయకుండా సినిమాపై ఇంత భారీ హైప్ పెంచడం ఒక్క లోకేష్‌కే చెల్లింది.;
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న సినిమా కూలీ. నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శృతి హాసన్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం కేవలం తమిళ ఆడియన్సే కాకుండా అన్ని భాషల ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
కూలీకి A సర్టిఫికెట్
కనీసం టీజర్ కూడా రిలీజ్ చేయకుండా సినిమాపై ఇంత భారీ హైప్ పెంచడం ఒక్క లోకేష్‌కే చెల్లింది. మరికొన్ని గంటల్లో కూలీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇప్పటికే కూలీ ప్రమోషన్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో కూలీ సినిమా తాజాగా సెన్సారును పూర్తి చేసుకుని సెన్సార్ బోర్డు నుంచి A సర్టిఫికెట్ ను దక్కించుకుంది.
రజినీ కెరీర్లోనే ఫస్ట్ టైమ్
రజినీకాంత్ ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చేయగా, వాటిలో A సర్టిఫికెట్ అందుకున్న మొట్టమొదటి సినిమా ఇదే అవడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. A సర్టిఫికెట్ అంటే సినిమాలో ఎంతో వయొలెన్స్, థ్రిల్లర్ సీన్స్ ఉండే అవకాశముంది. పైగా పిల్లలకు ఈ సినిమా చూసే అవకాశముండదు. ఫలితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కౌంట్ విపరీతంగా తగ్గుతుంది.
నిర్మాణ సంస్థకు ఫ్యాన్స్ విన్నపాలు
రజినీకాంత్ కు లేడీస్, ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లల్లో భారీ ఫాలోయింగ్, క్రేజ్ ఉంది. వారందరినీ దృష్టిలో పెట్టుకుని అవసరమైన చోట సీన్స్ ను బ్లర్ చేసి అయినా ఈ సినిమాను U/A సర్టిఫికెట్ తో రిలీజ్ చేయాలని ఆడియన్స్ నిర్మాణ సంస్థను కోరుతున్నారు. కొందరు సెన్సారు గురించి తెలియకుండా పిల్లలతో సినిమాలకు రావడం, అక్కడ థియేటర్ల వద్ద గొడవలు జరగడం దీంతో క్రమంగా అందరూ కలిసి సినిమా చూడకుండానే వెనక్కి తిరిగివెళ్లే అవకాశలు కూడా ఉన్నాయి.
రికార్డు బ్రేక్ చేస్తుందా?
ఇలాంటి పరిస్థితుల్లో కూలీ సెన్సార్ రిపోర్ట్ ఓ వర్గం ఆడియన్స్ ను పరిమితం చేయడం ఖాయం. దాని ఫలితం బాక్సాఫీస్ కలెక్షన్లపై పడుతుందని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే కోలీవుడ్ లో కూలీ సినిమా మొదటి రూ.1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమాగా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ పరిస్థితులు, సెన్సార్ రిపోర్ట్ చూస్తుంటే అది జరిగే పనిలా అనిపించడం లేదు. ఇప్పటివరకు ఎ సర్టిఫికెట్ తో వచ్చిన ఏ సినిమా కూడా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిన దాఖలాలు లేవు. మరి కూలీ కూడా వాటిలానే నిలుస్తుందా లేదా ఆ రికార్డును కూడా బ్రేక్ చేసి కూలీ కోలీవుడ్ లో మొదటి రూ.1000 కోట్ల సినిమాగా నిలుస్తుందా అనేది చూడాలి.