రాజ‌మౌళి లో త‌న‌కు ఏం న‌చ్చ‌దో చెప్పిన స్టార్ రైట‌ర్

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమా మేకింగ్ శైలి, అంకితభావం గురించి చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చ జరుగుతూనే ఉంటుంది.

Update: 2026-06-26 05:12 GMT

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమా మేకింగ్ శైలి, అంకితభావం గురించి చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా అత‌డి తండ్రి, ప్రముఖ స్టార్ రైటర్ వి. విజయేంద్ర ప్రసాద్ ఒక ఆడియోలో రాజమౌళి పనితీరుపై పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసారు. రాజమౌళి ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆయనకు ఆ సినిమా తప్ప ఇంకో ఆలోచన ఉండదని.. ఆయనలో ఉండే ఆ `ఏకపత్నీ వ్రతం` లాంటి నిమగ్నత తనకు చాలా నచ్చుతుందని విజయేంద్ర ప్రసాద్ కితాబిచ్చారు.

అయితే ఇదే సమయంలో రాజమౌళికి సంబంధించిన ఒక మైనస్ పాయింట్‌ను కూడా విజయేంద్ర ప్రసాద్ ప్రస్తావించారు. రాజమౌళి తన కెరీర్‌లో ఏ సినిమా ముగిసే సమయంలోనూ.. తన తదుపరి చిత్రం ఏంటనేది ఎప్పుడూ ముందుగా ప్రకటించరని గుర్తుచేశారు. ఒక సినిమా విడుదలయ్యాక నెల లేదా రెండు నెలల తర్వాతే కొత్త ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తారని అన్నారు. ఒక సినిమా పూర్తయ్యాక వెంటనే మరో సినిమా స్క్రిప్ట్ సిద్ధంగా ఉంచుకుంటే సమయం వృథా కాకుండా త్వరగా సినిమా మొదలుపెట్టవచ్చు కదా! అనే కోణంలో రాజమౌళి అలా ముందే ప్లాన్ చేసుకోకపోవడం తనకు నచ్చదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే చేస్తున్న ప్రాజెక్ట్ విష‌యంలో రాజమౌళికి ఉండే అంకితభావాన్ని తాను తప్పకుండా అభినందిస్తానని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.

గ‌తంలో ప్ర‌భాస్,చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఏమ‌న్నారు?

రాజమౌళి విజువల్ వండర్ `బాహుబలి` చిత్రకథా సమయంలో ద‌ర్శ‌క‌ధీరుడి కమిట్‌మెంట్‌ను హీరోలు ప్రభాస్, రానా దగ్గరుండి చూశారు. సెట్‌లో రాజమౌళి విజన్, ఆయన పడే తపన చూస్తే ఎంతటి కష్టమైనా మర్చిపోతామని గతంలో పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. పర్ఫెక్షన్ కోసం రాజమౌళి ఎన్ని టేకులైనా తీసుకుంటారని...సీన్ అనుకున్నట్లు వచ్చే వరకు అస్సలు రాజీ పడరని ప్రభాస్- రానా కొనియాడారు. సినిమా కోసం ఆయన చూపించే నిమగ్నత వల్లే తాము కూడా ఐదేళ్లపాటు మరే ఇతర సినిమా గురించి ఆలోచించకుండా `బాహుబలి` కోస‌మే అంకితమయ్యామని వ్యాఖ్యానించారు.

అలాగే గ్లోబల్ హిట్ RRR చిత్రీకరణ సమయంలోనూ రాజమౌళి వర్కింగ్ స్టైల్ గురించి హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆశ్చర్యకరమైన విషయాలు తెలిపారు. సెట్‌లో రాజమౌళి ఒక `టాస్క్ మాస్టర్` లాంటివారని..షాట్ పర్‌ఫెక్ట్‌గా వచ్చే వరకు నటీనటుల నుండి రక్తం పిండేస్తారని వారు సరదాగా వ్యాఖ్యానించారు. క్లిష్టమైన యాక్షన్ సీక్వెన్స్ లేదా ఎమోషనల్ సీన్స్ చేస్తున్నప్పుడు నటీనటుల్లోని బెస్ట్ ఔట్‌పుట్‌ను బయటకు తీయడానికి రాజమౌళి పడే తపన.. అత‌డు చూపే అంకితభావం తమను ఎంతగానో ప్రేరేపిస్తాయని చరణ్, తారక్ స్పష్టం చేశారు.

కేవలం పాన్ ఇండియా సినిమాలే కాదు.. అంతకుముందు రాజమౌళితో కలిసి పనిచేసిన మాస్ మహారాజా రవితేజ, స్వీటీ అనుష్క శెట్టి సైతం జక్కన్న కమిట్‌మెంట్‌పై ప్రశంసలు కురిపించారు. `విక్రమార్కుడు` సినిమాలో రవితేజను సరికొత్త మాస్ యాంగిల్‌లో చూపించిన రాజమౌళి సెట్‌లో ప్రతి చిన్న విషయాన్ని ఎంతో శ్రద్ధగా గమనిస్తారని రవితేజ పేర్కొన్నారు. ఇక విక్రమార్కుడు, బాహుబలి చిత్రాల్లో నటించిన అనుష్క మాట్లాడుతూ.. రాజమౌళి సెట్‌లో ఉంటే ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని.. నటీనటులకు కథపై, క్యారెక్టర్‌పై పూర్తి స్పష్టత ఇచ్చి వారి నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకోవడంలో రాజమౌళిని మించిన వారు లేరని ప్రశంసించారు.

Tags:    

Similar News