మహేష్ కి సవాల్.. కుంభగా సరికొత్త గ్లోబల్ విలనిజం!
ఈ భారీ ప్రాజెక్టులో మలయాళ స్టార్ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ కీలకమైన.. అత్యంత శక్తిమంతమైన కుంభ అనే పాత్రలో కనిపించనున్నారు.
దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే హీరో పాత్ర మాత్రమే కాదు. కథలోని ప్రతి ముఖ్య పాత్రకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత.. బలమైన వ్యక్తిత్వం ఉంటాయి. `బాహుబలి`లో భల్లాళదేవ, `ఆర్ఆర్ఆర్ ` లో రామ్-భీమ్ పాత్రలను జక్కన్న తీర్చిదిద్దిన తీరే అందుకు నిదర్శనం. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి తెరకెక్కిస్తోన్న అంత ర్జాతీయ స్థాయి అడ్వెంచర్ యాక్షన్ డ్రామా వారణాసిపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు.. ఈ భారీ ప్రాజెక్టులో మలయాళ స్టార్ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ కీలకమైన.. అత్యంత శక్తిమంతమైన కుంభ అనే పాత్రలో కనిపించనున్నారు.
`కుంభ` అనే పేరు వినడానికి ఎంతో పవర్‌ఫుల్‌గా ఉన్నా? ఆ పాత్ర స్వభావాన్ని, కథలో దానికి ఉన్న గాంభీర్యాన్ని ప్రతిబింబించేలా రాజమౌళి ఓ ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్‌తో ఈ క్యారెక్టర్‌ను డిజైన్ చేసినట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. సినిమాలో కుంభ పాత్ర కేవలం సాధారణ విలన్‌గా కాకుండా.. హీరో పాత్రతో సమానమైన మైండ్ గేమ్స్ ఆడే విలక్షణమైన యాంటీ-హీరో లేదా శక్తిమంతమైన శత్రువుగా ఉండ బోతోందని సమాచారం. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ గ్లోబల్ అడ్వెంచర్ డ్రామాలో మహేష్ బాబు పాత్రకు ఎదురయ్యే అతిపెద్ద సవాలుగా కుంభ క్యారెక్టర్ నిలుస్తుందంటున్నారు.
శారీరక దారుఢ్యంతో పాటు అపారమైన మేధస్సు ఉన్న పాత్రగా దీనిని తీర్చిదిద్దడం వల్ల వెండితెరపై మహేష్ -పృథ్విరాజ్ ల మధ్య వచ్చే మైండ్ గేమ్స్, ఘర్షణ సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త హై ఇస్తాయని భావిస్తున్నారు. పృథ్విరాజ్ సుకుమారన్ కేవలం మలయాళంలోనే కాకుండా పాన్-ఇండియా స్థాయిలో అద్భుతమైన నటన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెప్పించారు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను సైతం తనదైన రాజసంతో.. గాంభీర్యంతో పండించగల సత్తా ఆయనకు ఉంది. రాజమౌళికి నటులలోని అసలైన ప్రతిభను సరికొత్త కోణంలో ఆవిష్కరించడం బాగా తెలుసు.
అందుకే పృథ్విరాజ్ లాంటి వెర్సటైల్ నటుడిని ఎంచుకుని ఆయన ఇమేజ్‌కు సరిగ్గా సరిపోయేలా.. అదే సమయంలో ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని భిన్నమైన గెటప్ - క్యారెక్టరైజేషన్‌తో కుంభ పాత్రను ప్రజెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ కోసం రాజమౌళి అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేస్తున్నారు. `కుంభ` పాత్ర తాలూకా విజువల్స్, కాస్ట్యూమ్స్ , యాక్షన్ స్టంట్స్ కోసం హాలీవుడ్ స్థాయి విఎఫ్ఎక్స్ -స్టంట్ కొరియోగ్రఫీని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పాత్ర కేవలం భారతీయ ప్రేక్షకులనే కాకుండా విదేశీ ఆడియన్స్‌ను సైతం కట్టిపడేసేలా గ్లోబల్ అప్పీల్‌తో ఉండబోతోందిట.ఇందుకోసం ప్రీ-ప్రొడక్షన్ దశలోనే కుంభ క్యారెక్టర్‌కు సంబంధించి ప్రత్యేకమైన వర్క్‌షాప్స్ కూడా నిర్వహించారాని ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది.