జనాల్ని ముందే సిద్దం చేస్తోన్న జక్కన్న!
రాజమౌళి సినిమాలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వ్యూహం చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటుంది.
రాజమౌళి సినిమాలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వ్యూహం చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటుంది. అదే సినిమా విడుదల కాకముందే కథాంశం ఏంటో ఆయనే స్వయంగా ప్రేక్షకులకు చెప్పేయడం. తాజాగా ఆయన తెరకెక్కిస్తోన్న `వారణాసి` చిత్రం విషయంలోనూ ఇదే చర్చ నడుస్తోంది. కథను ముందే రివీల్ చేయడం వెనుక జక్కన్నకు పక్కా ప్లాన్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి ఈ విధమైన వ్యూహాన్ని అమలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో జక్కన్న సృష్టించిన అద్భుతాలు `మగధీర`, `ఈగ`, `మర్యాద రామన్న` వంటి చిత్రాల సమయంలోనూ ఇదే ఫార్ములాను ఉపయోగించారు.
`మగధీర` సమయంలో ఇది పునర్జన్మల కథ అని.. `ఈగ` సినిమా ప్రచార సమయంలో హీరో ఈగగా మారి విలన్‌పై పగ తీర్చుకుంటాడని ముందే వెల్లడించారు. అలాగే `మర్యాద రామన్న` కథ కూడా ఒక ఇంటికి వచ్చిన శత్రువును ఆ ఇంట్లో ఉన్నంతవరకు ఏమీ చేయకూడదనే సాంప్రదాయం చుట్టూ తిరుగుతుందని ముందే చెప్పారు. ఈ ముందస్తు ప్రకటనలు సినిమా విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. కథను ముందే చెప్పడం వల్ల ప్రేక్షకుల్లో ఒక రకమైన మానసిక సన్నద్ధత ఏర్పడుతుందని రాజమౌళి బలంగా నమ్ముతారు. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడు సినిమాలో ఏం జరగబోతోంది? అనే గందరగోళంతో కాకుండా తాను విన్న కథను దర్శకుడు తెరపై ఎలా ఆవిష్కరించాడు? అనే కుతూహలంతో వస్తాడు. దీంతో ప్రేక్షకులు సినిమా ప్రారంభమైన మొదటి నిమిషం నుంచే కథతో సులభంగా కనెక్ట్ అయిపోతారు.
ఇలా కథను ముందే రివీల్ చేయడం వల్ల మరో పెద్ద ప్రయోజనం కూడా ఉంది. ప్రేక్షకులు కథ పరంగా ముందే అవ గాహనకు వచ్చేస్తారు కాబట్టి సినిమా చూసిన తర్వాత కథలో దమ్ము లేదు ..ట్విస్ట్‌లు లేవు అనే విమర్శలు చేసే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. కథ సాధారణమైనదే అయినప్పటికీ దాన్ని స్క్రీన్‌ప్లేతో, గ్రాఫిక్స్‌తో, భావోద్వేగాలతో రాజమౌళి ఎలా నడిపించారనే దానిపైనే ప్రేక్షకులు దృష్టి పెడతారు. ఫలితంగా నెగెటివ్ టాక్ వచ్చే ప్రమాదం తప్పుతుంది.
సాధారణంగా పెద్ద దర్శకులు, స్టార్ హీరోల సినిమాలపై అంచనాలు ఆకాశాన్నంటుతాయి. ఆ అంచనాలు ఒక్కోసారి సినిమా ఫలితాన్ని దెబ్బతీస్తాయి. అందుకే రాజమౌళి తన కథను ముందే చెప్పి అంచనాలను ఒక పరిధిలో ఉంచుతారు. నేను చెప్పబోయే కథ ఇదే కాబట్టి ఊహాజనితమైన అంచనాలతో థియేటర్‌కు రాకండి అని ఆయన పరోక్షంగా ప్రేక్షకులను గైడ్ చేస్తారు. ఈ హైప్ మేనేజ్‌మెంట్ అనేది నేటి సినిమా మార్కెటింగ్‌లో అత్యంత కీలకమైన వ్యూహంగా మారింది.
తాజాగా తెరపైకి రాబోతున్న `వారణాసి` నేపథ్య చిత్రం విషయంలోనూ రాజమౌళి ఇదే పంథాను అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. పవిత్ర నగరమైన వారణాసి నేపథ్యంలో సాగే ఈ కథను ముందే ప్రేక్షకులకు పరిచయం చేయడం ద్వారా అందులోని ఆధ్యాత్మిక -భావోద్వేగ అంశాలకు జనాలు ముందే కనెక్ట్ అయ్యేలా చూస్తున్నారు. కథ పాతదే అయినా దాన్ని జక్కన్న తనదైన శైలిలో ఎలా మలిచాడో? చూడాలనే ఆరాటాన్ని ఈ వ్యూహం ప్రేక్షకుల్లో మరింత పెంచుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.