సల్మాన్ సినిమాకు రాజమౌళి ఎలివేషన్
ఒక భాషకు చెందిన చిత్రం దేశమంతా బాగా ఆడడం ‘బాహుబలి’తో మొదలైన ట్రెండ్ కాదని రాజమౌళి స్పష్టం చేశారు.
పాన్ ఇండియా.. గత దశాబ్ద కాలంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని ఊపేస్తున్న ట్రెండ్. అంతకుముందెన్నడూ వినని ఈ పదాన్ని పాపులర్ చేసిన ఘనత ‘బాహుబలి’ సినిమా సొంతం. పేరుకు అది తెలుగు సినిమానే అయినా.. ఇండియా మొత్తం బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది. దాని బాటలో ఆ తర్వాత కేజీఎఫ్, పుష్ప, ఆర్ఆర్ఆర్, కాంతార.. ఇలా మరెన్నో దక్షిణాది చిత్రాలు దేశవ్యాప్తంగా భారీ విజయాలనందుకున్నాయి.
మణిరత్నం లాంటి గ్రేట్ డైరెక్టర్ తన డ్రీమ్ ప్రాజెక్టు ‘పొన్నియన్ సెల్వన్’ను భారీ స్థాయిలో తీర్చిదిద్దడంలో తనకు రాజమౌళే స్ఫూర్తి అన్నారు. ఆయన మాత్రమే కాదు.. పాన్ ఇండియా ట్రెండ్ సృష్టికర్తగా రాజమౌళిని అందరూ కొనియాడుతూనే ఉంటారు. అలాంటి దర్శకుడు.. తనకు ఈ క్రెడిట్ ఇవ్వడం కరెక్ట్ కాదని ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం విశేషం.
ఒక భాషకు చెందిన చిత్రం దేశమంతా బాగా ఆడడం ‘బాహుబలి’తో మొదలైన ట్రెండ్ కాదని రాజమౌళి స్పష్టం చేశారు. 90వ దశకంలోనే సల్మాన్ ఖాన్ సినిమా ‘మైనే ప్యార్ కియా’ దక్షిణాదిన గొప్పగా ఆడిందని ఆయన గుర్తు చేశారు. తెలుగు, తమిళ భాషల్లో దాని డబ్బింగ్ వెర్షన్లు సూపర్ హిట్లు అయ్యాయని.. దేశంలో ప్రతి సినీ ప్రేక్షకుడూ అప్పట్లో ఆ సినిమ ా చూశాడని రాజమౌళి కితాబిచ్చారు.
ఐతే ఆ ట్రెండును తర్వాతి రోజుల్లో కొనసాగించలేకపోయారని.. అంతే తప్ప ‘బాహుబలి’తోనే పాన్ ఇండియా ట్రెండ్ మొదలైందని అనడం కరెక్ట్ కాదని రాజమౌళి వినమ్రంగా చెప్పారు. ఇలా ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ వాళ్లకు ఇవ్వడంలోనే రాజమౌళి ప్రత్యేకత దాగి ఉంది. రాజమౌళి పేరు చెప్పి మన వాళ్లు బాలీవుడ్‌ను తగ్గించే ప్రయత్నం చేస్తుంటారు కానీ.. ఆయన మాత్రం బాలీవుడ్ మీద తన గౌరవాన్ని చాటుకుని అక్కడి వాళ్లలో తనపట్ల గౌరవడం పెరిగేలా చేసుకున్నారు.