బాహుబలిలో జక్కన్న చెప్పిన ది బెస్ట్‌ షాట్స్‌..!

మొత్తానికి రాజమౌళి ఒక ట్రెండ్‌ సెట్‌ చేశారు. బాహుబలి వంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు, అసలు ఎప్పటికీ రావు అనేది కొందరు అభిమానులు చెప్పే మాటలు.;

Update: 2026-01-24 23:30 GMT

తెలుగు సినిమా ఉన్నంత కాలం 'బాహుబలి' గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని బాహుబలి రెండుగా విడదీసిందని చెప్పాలి. బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అన్నట్లుగా మొత్తం పరిస్థితి మారింది. బాహుబలి కారణంగా మొత్తం టెక్నికల్‌ వ్యాల్యూస్‌ పెరిగాయి. సాదాసీదాగా సినిమాలను తీసే మేకర్స్ ఆ తర్వాత నుంచి అప్‌డేట్‌ అయ్యారు. ఆయన మేకింగ్‌ను ఆదర్శంగా తీసుకుని చాలా మంది భారీ బడ్జెట్‌ సినిమాలు, గ్రాఫిక్స్ సినిమాలను చేయడం మొదలు పెట్టారు. అంతే కాకుండా ఆయన తరహా కథలను ఎంపిక చేసుకునే దర్శకులు కూడా చాలా మంది ఉన్నారు. మొత్తానికి రాజమౌళి ఒక ట్రెండ్‌ సెట్‌ చేశారు. బాహుబలి వంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు, అసలు ఎప్పటికీ రావు అనేది కొందరు అభిమానులు చెప్పే మాటలు.

రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో...

సినిమా మేకింగ్‌ కోసం ఏళ్లకు ఏళ్లు రాజమౌళి తీసుకున్న విషయం తెల్సిందే. హాలీవుడ్‌ సినిమాలు కేవలం ఆరు నుంచి పది నెలల సమయం మేకింగ్‌కు తీసుకుంటారు. కానీ రాజమౌళి మాత్రం తన బాహుబలి సినిమా కోసం మూడు నాలుగు ఏళ్ల సమయం తీసుకున్నాడు. అంతగా నటీ నటుల నుంచి నటన పిండుకున్నారు. సినిమాలోని ప్రతి నటుడు అద్భుతం అన్నట్టు నటించారు. ముఖ్యంగా కొన్ని షాట్స్‌ లో ఆయా నటీనటుల నటన చూస్తే నిజంగా వీళ్లేనా అలా నటించింది అని ఇప్పటికి అనిపిస్తుంది. జక్కన్న తనకు కావాల్సిన శిల్పం కోసం ఎంతకు అయినా తెగించినట్లు రాజమౌళి సైతం తనకు రావాల్సిన ఎక్స్‌ప్రెషన్‌ కోసం, తనకు రావాల్సిన మూడ్ కోసం గంటలు గంటలు టేక్ లు చేసేవాడట. అలా అద్భుతంగా కొన్ని షాట్స్ వచ్చాయి. వాటి వివరాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పిన వీడియో వైరల్‌ అయింది.

అనుష్క, రమ్యకృష్ణ..

సినిమా మొత్తంలో ముఖ్యమైన నటీనటుల యొక్క కొన్ని క్లోజప్‌ షాట్స్ అద్భుతంగా వచ్చాయి అంటూ జక్కన్న చెప్పుకొచ్చాడు. అందులో మహిష్మతి రాజ్యంలో ఎంటర్‌ అవుతున్న సమయంలో అనుష్క ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ అద్భుతంగా ఉంటుంది. ఒక సరికొత్త లోకంలో అడుగు పెడుతున్నట్లుగా ఆమె ఫీల్‌ అయినట్లుగా నటించిన తీరు బాగుందని రాజమౌళి చెప్పుకొచ్చాడు. బాహుబలిని చంపిన తర్వాత కోపంతో కట్టప్ప తప్పు చేశావు శివగామి అంటూ గట్టిగా అరిచిన సమయంలో రమ్యకృష్ణ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్‌ చాలా బాగుంటుంది. అప్పటి వరకు ఉన్న క్రోదం ఒక్కసారిగా మారిపోయి, తప్పు చేసిన బాధ కలుగుతుంది. అప్పుడు రమ్యకృష్ణను చాలా బాగా చూపించాం అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు. అనుష్క, రమ్యకృష్ణలు ఇతర సీన్స్‌లోనూ అద్భుతంగా నటించారు. అయితే ఆ రెండు క్లోజప్‌ షాట్స్ లో మరింత గొప్ప నటన కనబర్చారు.

బాహుబలి లో ప్రభాస్‌, రానా

ఇక రానా యొక్క కిరీటం ఎపిసోడ్‌ చాలా బాగుంటుందని అన్నాడు. కిరీటంపై చేయి పెట్టి రక్తం వస్తున్న సమయంలో రానా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ ఎవర్‌ గ్రీన్‌ అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. నిజంగా రానా ఆ సీన్‌ లో ఒక విలన్‌ అన్నట్లుగా కాకుండా సరికొత్తగా ప్రేక్షకులు తిట్టుకునేలా కనిపించాడని రాజమౌళి అన్నాడు. ఇక చివరగా ప్రభాస్‌ క్లోజప్‌ గురించి రాజమౌళి మాట్లాడుతూ.. కట్టప్ప కత్తితో పొడిచిన తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయి. తల్లి చంపేందుకు ఆదేశించిందని, కట్టప్ప తనను పొడిచాడని తెలుసుకున్నప్పటికీ బాహుబలి ఏమాత్రం కోపం లేకుండా, అమాయకంగా అమ్మ జాగ్రత్త అంటూ నవ్వుతూ తుది శ్వాస విడుస్తాడు. ఆ క్లోజప్‌ అద్భుతంగా వచ్చింది అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఇంకా ఇతర పాత్రల్లో నటించిన ప్రతి ఒక్కరివి అద్భుతమైన క్లోజప్‌ షాట్స్ ను రాజమౌళి పెట్టాడు. అందుకే సినిమా ఇప్పటికీ అద్భుతం అని ప్రశంసలు దక్కించుకుంటుంది.


Full View


Tags:    

Similar News