100 రోజుల ముందు ట్రైలర్.. ఇదీ ప్లానింగ్ అంటే
పవన్ కళ్యాణ్ సినిమా ‘ఓజీ’ సైతం పాన్ ఇండియా మూవీనే. కానీ ఇతర భాషల్లో నామమాత్రంగా రిలీజైంది.;
పోస్టర్ మీద నాలుగైదు భాషల్లో రిలీజ్ అంటూ ఘనంగా ప్రకటించుకునేవాళ్లే కానీ.. పాన్ ఇండియా స్థాయిలో సరిగ్గా సినిమాను ప్రమోట్ చేసి రిలీజ్ చేసేవాళ్లు తక్కువ. పాన్ ఇండియా స్థాయిలో సినిమా ప్రభావం చూపాలంటే ముందుగా షూటింగ్ పూర్తి చేయడం, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పర్ఫెక్ట్‌గా జరగడం.. ఇతర భాషల్లో డబ్బింగ్ సరిగ్గా ఉండడం.. దేశవ్యాప్తంగా ప్రమోషన్లు బాగా చేయడం చాలా అవసరం. కానీ ఈ ప్లానింగ్ అన్ని సినిమాలకూ పర్ఫెక్ట్‌గా జరగదు.
పవన్ కళ్యాణ్ సినిమా ‘ఓజీ’ సైతం పాన్ ఇండియా మూవీనే. కానీ ఇతర భాషల్లో నామమాత్రంగా రిలీజైంది. ఐతే ప్రభాస్ సినిమా ‘రాజా సాబ్’ విషయంలో మాత్రం టీం పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో రంగంలోకి దిగుతోంది. ప్రభాస్‌కు మిగతా ఏ ఇండియన్ స్టార్‌కూ లేని స్థాయిలో దేశవ్యాప్తంగా ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న మాట వాస్తవం. దాన్ని పూర్తిగా ఉపయోగించుకునేలా ‘రాజా సాబ్’ టీం అడుగులు వేస్తోంది.
'రాజా సాబ్' చిత్రీకరణ పూర్తి కావచ్చింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశలో ఉన్నాయి. ప్రమోషన్లు కూడా గట్టిగా చేసేలా ఉన్నారు. సినిమా రిలీజ్‌కు ఏకంగా 100 రోజుల ముందే దీని ట్రైలర్‌ను లాంచ్ చేస్తుండడం విశేషం. ఈ సోమవారం సాయంత్రమే ట్రైలర్ వస్తోంది. ‘రాజా సాబ్’ సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. సరిగ్గా వంద రోజుల గ్యాప్ పెట్టుకుని ఇప్పుడే ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు.
బహుశా పాన్ ఇండియా సినిమాల్లో ఇంత ముందుగా ట్రైలర్ లాంచ్ అవుతున్న సినిమ ఇదే కావచ్చు. రిలీజ్ డేట్ ఖరారైపోవడంతో ఇప్పట్నుంచే విడుదలకు కౌంట్‌డౌన్ మొదలవుతుంది. ట్రైలర్ బాగుంటే పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు సినిమా కోసం ఎదురు చూస్తారు. తర్వాత రెగ్యులర్‌గా ప్రమోషనల్ కంటెంట్ వదులుతూ.. దేశవ్యాప్తంగా ఈవెంట్లు చేస్తూ హైప్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేయనుంది టీం. ముందు ట్రైలర్ లాంచ్ చేసి తర్వాత పాటలు, ఇతర కంటెంట్ వదలడం అరుదైన విషయమే. ఎలాగూ విడుదల దగ్గర్లో రిలీజ్ ట్రైలర్ అంటూ ఇంకో ప్రోమో వదులుతారు. చూస్తుంటే ‘రాజా సాబ్’ రిలీజ్ టైంకి హైప్ వేరే లెవెల్‌కు వెళ్లేలాగే కనిపిస్తోంది.