మారుతి అడ్రస్ ఎఫెక్ట్.. ప్రభాస్ రెస్పాండ్ అవ్వాల్సిందేనా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఇటీవల థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.;

Update: 2026-01-24 13:25 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఇటీవల థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. కొందరు  ప్రశంసిస్తే.. మరికొందరు మాత్రం సినిమా ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు మారుతిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అదే సమయంలో రిలీజ్‌ కు ముందు జరిగిన ఈవెంట్‌ లో మారుతి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సినిమా నచ్చకపోతే నిలదీయండి అంటూ ఆయన ధైర్యంగా చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. ఆ సమయంలో ఇంటి అడ్రస్ చెప్పడం అందరినీ షాక్ కు గురి చేసింది. అయితే సినిమా ఫలితం చూసిన తర్వాత కొంతమంది ప్రభాస్ అభిమానులు ఆ మాటలను గుర్తు చేస్తూ విమర్శలు చేస్తున్నారు.

ఇంకాస్త కథపై వర్క్ చేయాల్సిందని, ప్రభాస్ లాంటి స్టార్‌ కు సరైన స్క్రిప్ట్ ఇవ్వలేకపోయారు అంటూ పలువురు మండిపడుతున్నారు. ఆ విమర్శలు కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాలేదు. తాజాగా కొందరు అభిమానులు మరింత విచిత్రంగా స్పందించారు. దర్శకుడు మారుతి ఇంటి అడ్రస్‌ కు ఆన్‌ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా వరుసగా ఫుడ్ పార్సిల్స్ ఆర్డర్ చేస్తున్నారు.

వందల సంఖ్యలో ఆర్డర్లు రావడంతో మారుతి ఇంటి వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. సెక్యూరిటీ సిబ్బంది తలలు పట్టుకోగా.. తన పేరుపై వచ్చిన ఆర్డర్లను రిసీవ్ చేసుకోవద్దని మారుతి చెప్పారని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమా నచ్చకపోవడం వేరు, వ్యక్తిగతంగా వేధించడం వేరని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇది సరైన పద్ధతి కాదని, సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకుపోవడం హద్దులు దాటడమేనని అంటున్నారు. అభిమానులే ఇలాంటి పనులు చేస్తే టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెడ్డ పేరు వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై ప్రభాస్ స్పందించాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు. మారుతి పట్ల జరుగుతున్న ట్రోలింగ్, ఆర్డర్ల పెట్టడంపై ప్రభాస్ రెస్పాండ్ అయితే పరిస్థితి మారుతుందనే అభిప్రాయం అందరిలో ఉంది!

కానీ ఇప్పటివరకు ప్రభాస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. షూటింగ్ బిజీలో ఉన్న కారణంగా ఆయన ఈ విషయంపై మాట్లాడలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి డార్లింగ్ ఎప్పుడు స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఏదేమైనా సినిమా ఫలితాలు ఎలా ఉన్నా… వ్యక్తిగతంగా వేధించడం, ట్రోలింగ్ చేయడం సరికాదని పలువురు నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. అభిమానులు తమ అసంతృప్తిని గౌరవంగా వ్యక్తం చేయాలని, వ్యక్తిగత జీవితాలను ఎప్పుడూ గౌరవించాలని అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News