రాజ్ తరుణ్ పై లావణ్య ఫిర్యాదు.. మరో కేసు నమోదు..
ఇప్పుడు ఆ ఇంటి విషయంలో రాజ్ తరుణ్ పై తాజాగా ఫిర్యాదు చేసింది లావణ్య. అనుచరులను పంపి తనపై దాడి చేయించారని నార్సింగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది.;
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య వివాదం గురించి అందరికీ తెలిసిందే. తనతో పదకొండేళ్లు సహజీవనం చేసి, ఇప్పుడు వదిలేశారంటూ గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. తనను మోసం చేశారని, మాల్వీ మల్హోత్రాతో డేటింగ్ చేశారని ఆరోపించి కేసు పెట్టింది. కొన్నాళ్ల పాటు ఆ వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ అంతా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టించిన ఆ వివాదం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఇటీవల రాజ్ తరుణ్ తల్లిదండ్రులు, లావణ్య మధ్య గొడవ జరిగింది. ప్రస్తుతం లావణ్య ఉంటున్న ఇల్లు తమదేనంటూ రాజ్ పేరెంట్స్ లగేజ్ తో సహా వెళ్లగా.. వారిని లావణ్య అడ్డుకుంది.
రాజ్ తరుణ్ పేరెంట్స్ పదిహేను మందితో వచ్చి ఇంటిని ధ్వంసం చేశారని చెప్పిన లావణ్య.. తన తమ్ముడిపై దాడి చేశారని ఆరోపించింది. ప్రస్తుతం కేసు కోర్టులో ఉందని, ఇప్పుడు రాజ్ తరుణ్ పేరెంట్స్ ఇలా చేయడం ఏంటని ప్రశ్నించింది. ఆ ఇల్లు రాజ్ తరుణ్ పేరెంట్స్ ఇచ్చిన ఆస్తి కాదని, రూపాయి రూపాయి కూడగట్టుకుని కొన్నామని చెప్పింది.
ఇప్పుడు ఆ ఇంటి విషయంలో రాజ్ తరుణ్ పై తాజాగా ఫిర్యాదు చేసింది లావణ్య. అనుచరులను పంపి తనపై దాడి చేయించారని నార్సింగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. ఆ సమయంలో తాను ఇంట్లోనే ఉన్నట్లు తెలిపింది. అయితే మొత్తం మూడు వేర్వేరు సందర్భాల్లో తనను తీవ్రంగా దూషించి దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొంది.
అయితే తాను 2016లో రాజ్ తరుణ్ తో కలిసి కోకాపేటలోని ఇంటిని కొనుగోలు చేశానని తెలిపింది లావణ్య. కానీ వ్యక్తిగత విభేదాల కారణంగా 2024 మార్చిలో అతడు ఇంటిని ఖాళీ చేశాడని చెప్పిన ఆమె.. రాజ్ తరుణ్ కు సంబంధించిన మనుషులు తనపై విచక్షణా రహితంగా దాడి చేశారని ఆరోపిస్తూ కేసు పెట్టింది.
అదే సమయంలో ఇంటికి సంబంధించిన కేసు ఇంకా కోర్టులో పెండింగ్ లో ఉండగా బెల్టులు, గాజు సీసాలతో బద్దలు కొట్టారని ఆరోపించింది. తాను ధరించిన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారని, తన పెంపుడు కుక్కలను కూడా చంపేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రాజ్ తరుణ్ తోపాటు పలువురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో ఇప్పుడు ఆ విషయం నెట్టింట వైరల్ గా మారింది.