స‌మంత భ‌ర్త హాలీవుడ్ సినిమా: టాలీవుడ్-హాలీవుడ్ స్టార్ల క‌ల‌యిక‌లోనా?!

తెలుగు చిత్రసీమ ఖ్యాతి ఇప్పటికే ఆస్కార్ వేదికను తాకి ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. రాజ‌మౌళి ఒక పెద్ద బ్రిడ్జి నిర్మించారు. ఆస్కార్స్- గోల్డెన్ గ్లోబ్- హాలీవుడ్ క్రిటిక్స్ తో క‌నెక్ష‌న్ ని పెంచారు.

Update: 2026-06-19 18:41 GMT

తెలుగు చిత్రసీమ ఖ్యాతి ఇప్పటికే ఆస్కార్ వేదికను తాకి ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. రాజ‌మౌళి ఒక పెద్ద బ్రిడ్జి నిర్మించారు. ఆస్కార్స్- గోల్డెన్ గ్లోబ్- హాలీవుడ్ క్రిటిక్స్ తో క‌నెక్ష‌న్ ని పెంచారు. దీనికి కొన‌సాగింపుగా వార‌స‌త్వాన్ని ముందుకు తీసుకెళ్ల‌డానికి జెన్ జెడ్ ముందుకు రావాల్సిన అవ‌స‌రం ఉంది. ఇలాంటి స‌మ‌యంలో ఇప్పుడు టాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి ఒక సరికొత్త వారధిని నిర్మించేందుకు సంచలన దర్శకులు రాజ్ అండ్ డీకే సిద్ధమవుతున్నారు. సమంత భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తమ తదుపరి యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సమంత ప్రధాన పాత్రలో రాజ్ అండ్ డీకే నిర్మించిన `మా ఇంటి బంగారం` చిత్రం నేడు (శుక్రవారం) విడుదలై, మంచి సమీక్షలతో సక్సెస్ దిశగా దూసుకుపోతున్న తరుణంలో రాజ్ తన తదుపరి హాలీవుడ్ ప్రాజెక్ట్ గురించి పదే పదే అధికారికంగా ప్రకటిస్తుండటం విశేషం. సోమవారం తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంటుందనేది పక్కన పెడితే, రాజ్ ప్రకటించిన హాలీవుడ్ ఎంట్రీ మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

రాజ్ అండ్ డీకేలకు హాలీవుడ్‌తో ఇప్పటికే బలమైన అనుబంధం ఉంది. గ్లోబల్ స్పై యూనివర్స్ సిరీస్ `సిటాడెల్: హనీ బన్నీ` చిత్రీకరణ సమయం నుంచే వీరి హాలీవుడ్ ఎంట్రీపై చర్చలు జరుగుతున్నాయి. హాలీవుడ్ దిగ్గజాలైన రస్సో బ్రదర్స్ ... వారి ఏజీబీఓ ఫిల్మ్స్ రైటర్స్ రూమ్స్‌తో కలిసి నేరుగా పనిచేసిన అనుభవం ఈ తెలుగు కుర్రాళ్లకు ఉంది. అంతేకాదు.. మార్వెల్ స్టూడియోస్ తో క‌లిసి ఒక సూప‌ర్ హీరో క‌థ‌ను కూడా త‌యారు చేసేందుకు చ‌ర్చించారు. వీరి యూనిక్ స్టోరీ టెల్లింగ్ శైలికి మార్వెల్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఫిదా అయ్యారు. తాజాగా రాజ్ నిడిమోరు తమ హాలీవుడ్ ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్ సిద్ధమైందని.. ప్రస్తుతం అది ప్రీ-ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించిందని స్పష్టం చేయడంతో గ్లోబల్ వైడ్‌గా ఉత్కంఠ నెలకొంది.

బాలీవుడ్, టాలీవుడ్‌లలో టాప్ డైరెక్టర్లుగా వెలిగిపోతూ`ది ఫ్యామిలీ మ్యాన్`, `ఫర్జీ`, `హనీ బన్నీ` వంటి సిరీస్‌లతో డిజిటల్ మాధ్యమంలో వరల్డ్ వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న ఈ తెలుగు కుర్రాళ్లు.. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో అందరి చూపులు వీరిపైనే ఉన్నాయి. ఎస్‌ఎస్ రాజమౌళి తర్వాత అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు దిశా నిర్దేశనం చేయగల సత్తా ఉన్న ప్రతిభావంతులు వీరేనని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. అయితే... వీరు తెరకెక్కించబోయే హాలీవుడ్ స్క్రిప్ట్ ఎలా ఉండబోతోంది? ఇది కేవలం వెస్ట్రన్ సినిమాగానే ఉంటుందా.. లేక టాలీవుడ్, హాలీవుడ్ స్టార్ల కలయికతో రూపొందే మల్టీస్టారర్ కాబోతోందా? అనే ఆసక్తికరమైన చర్చలు ఇప్పుడు మొద‌ల‌య్యాయి.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న `వారణాసి` (SSMB29) సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు అంతర్జాతీయ మార్కెట్‌లో తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి తరుణంలో మహేష్ బాబు వంటి గ్లోబల్ స్టార్‌ని హాలీవుడ్‌కి తీసుకెళ్తూ, అక్కడి ఫేమస్ స్టార్లతో కలిపి రాజ్ ఏదైనా భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తారా? అనే సందేహం అందరిలో కలిగింది. అంతేకాదు... మన `ఆర్ఆర్ఆర్` స్టార్లు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లేదా పాన్-ఇండియన్ స్టార్‌గా ఏల్తున్న ప్రభాస్ లాంటి వారిని రాజ్ హాలీవుడ్ ప్రాజెక్ట్‌లోకి లాగితే ఎలా ఉంటుంది? అనే ఊహాజనిత కథనాలు అభిమానుల్లో విపరీతమైన జోష్ నింపుతున్నాయి.

తెలుగు సినిమాకు ఆస్కార్ వచ్చిన తర్వాత మన స్టార్ల గురించి హాలీవుడ్ మ్యాగజైన్లలో కూడా ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. గ్లోబల్ అప్పీల్ ఉన్న ఇటువంటి సరైన సమయంలో మన టాలీవుడ్ స్టార్లను హాలీవుడ్ నటీనటులతో కలుపుతూ సినిమాలు తీసే అద్భుతమైన ప్రయోగం రాజ్ అండ్ డీకే లాంటి అంతర్జాతీయ అనుభవం ఉన్న మేకర్స్‌కు క‌చ్చితంగా సాధ్యమేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ కాంబినేషన్లు ఊహాజనితంగానే కనిపిస్తున్నా.. కాలమే వీటికి సమాధానం చెప్పాలి. రాజ్ అండ్ డీకే తమ హాలీవుడ్ చిత్రంలో మన తెలుగు నటులను భాగస్వామ్యం చేసి.. టాలీవుడ్ గ్లోబల్ మార్కెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాలని ఆశిద్దాం.

Tags:    

Similar News