150 కోట్ల స్కామ్ కాదు 6600కోట్ల స్కామ్.. కుంద్రాపై తాజా ఆరోపణ
శిల్పాశెట్టి భర్త, బిజనెస్ మేన్ కం సినీనిర్మాత రాజ్ కుంద్రాపై ఎన్‌ఫోర్స్ మెంట్ తవ్వకాల్లో తీవ్ర విషయాలు బయటపడుతున్నాయి.;
శిల్పాశెట్టి భర్త, బిజనెస్ మేన్ కం సినీనిర్మాత రాజ్ కుంద్రాపై ఎన్‌ఫోర్స్ మెంట్ తవ్వకాల్లో తీవ్ర విషయాలు బయటపడుతున్నాయి. కుంద్రా ఇప్పటికే 60 కోట్ల మోసానికి (ఆర్థిక నేరం) సంబంధించిన కేసులో విచారణ ఎదుర్కొంటున్నాడు. అతడు భాగస్వాముల నుంచి పెట్టుబడులుగా సమీకరించిన డబ్బును దారి మళ్లించి దుర్వినియోగం చేసాడనేది ఇందులో ప్రధాన ఆరోపణ. ఈ కేసుతో శిల్పాశెట్టి పేరును ముడిపెట్టి భార్యాభర్తలు ఇద్దరినీ విచారిస్తున్నట్టు మీడియాలో కథనాలొచ్చాయి.
ఇదిలా ఉండగానే, ఇప్పుడు ఈడీ ఒక కొత్త మోసానికి సంబంధించిన ప్రకటనతో ఆశ్చర్యపరిచింది. రాజ్ కుంద్రాకు చెందిన 160 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ , ఇప్పుడు కుంద్రా బిట్ కాయిన్ స్కామ్ లో ఉన్నాడని ప్రకటించడం ఆశ్చర్యపరిచింది. కుంద్రా రూ.150 కోట్ల విలువైన 285 బిట్‌కాయిన్‌లను అందుకున్నారని, అతడి ఆస్తులను అటాచ్ చేశామని, ముగ్గురు నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని ఈడీ వెల్లడించింది.
అంతేకాదు.. బిట్ కాయిన్ స్కామ్ సాధారణ ప్రజలు ఊహించినంత చిన్నది కాదు. ఇది దాదాపు 6,600 కోట్ల విలువ చేసే స్కామ్‌లో ఈడీ చార్జిషీట్ దాఖలు చేసిందని `టైమ్స్ నవ్` తన కథనంలో పేర్కొంది. దీంతో రాజ్‌కుంద్రాకు ఇబ్బందులు పరాకాష్టకు చేరుకున్నాయని భావిస్తున్నారు. నీలి చిత్రాల యాప్‌ల వ్యాపారం, మీడియా వినోద రంగ వ్యాపారాల పేరుతో మోసాలకు అదనంగా, ఇప్పుడు బిట్ కాయిన్ వ్యాపారంలోను అతడి మోసాల గురించి ఈడీ షాకింగ్ ఆరోపణలు చేసింది. తాజా విచారణ నేపథ్యంలో కుంద్రా వ్యవహారాలపై మరోసారి ప్రజల్లో చర్చ మొదలైంది.