సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్!

ఈ విషయం అటు నెట్టింట వైరల్ అవుతుండగానే.. మరోసారి వార్తల్లో నిలిచారు రాహుల్ సిప్లిగంజ్.;

Update: 2025-08-19 07:49 GMT

ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఎప్పుడైతే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని "నాటు నాటు" పాట ఒరిజినల్ బెస్ట్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు అందుకుందో.. అప్పటినుండి ఈయన పేరు మారుమ్రోగుతోంది. దీనికి కారణం ప్రముఖ సింగర్ కాలభైరవతో కలిసి ఈపాట ఆలపించడమే. అంతేకాదు అవార్డు తీసుకునే సమయంలో కూడా ఆస్కార్ వేదికపై.. కాలభైరవతో కలిసి రాహుల్ తన గొంతును వినిపించి శ్రోతలను ఆకట్టుకున్నారు. ఈ ఒక్క పాటతో ప్రపంచ స్థాయి అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు.

సీఎం చేతుల మీదుగా కోటి రూపాయల చెక్..

హైదరాబాద్ లోని పాతబస్తీలో పుట్టి ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్ కి ఏదైనా చేయాలి అని నాడు రేవంత్ రెడ్డి (ప్రస్తుత తెలంగాణ సీఎం) హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అనుకున్నట్టుగానే అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. ఇటీవల జరిగిన 'గద్దర్ అవార్డ్స్' వేడుకల్లో ప్రత్యేకంగా సన్మానించి.. కోటి రూపాయలు బహుకరిస్తానని స్పష్టం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటూ ఇటీవల జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో రాహుల్ సిప్లిగంజ్ కు కోటి రూపాయల చెక్ ను స్వయంగా అందజేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రేయసితో ఘనంగా రాహుల్ నిశ్చితార్థం..

ఈ విషయం అటు నెట్టింట వైరల్ అవుతుండగానే.. మరోసారి వార్తల్లో నిలిచారు రాహుల్ సిప్లిగంజ్. తాజాగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడానికి మొదటి అడుగు వేశారు.తన ప్రేయసి హరిణ్యరెడ్డితో రహస్యంగా అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఆదివారం నాడు నిశ్చితార్థం జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో హరిణ్యా రెడ్డి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఇలా పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

రాహుల్ కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

ఆగస్టు 17 ఆదివారం ఘనంగా రాహుల్ సిప్లిగంజ్, హరిణ్య రెడ్డిల నిశ్చితార్థం జరిగింది. ముఖ్యంగా తాను ప్రేమించిన అమ్మాయితోనే ఇప్పుడు ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యారు రాహుల్ సిప్లిగంజ్. వీరిద్దరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడంతో ఈమె ఎవరు అంటూ వార్తలు రాగా.. ఈమె ఎవరో కాదు టీడీపీ నేత నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నయ్య కుమార్తె హరిణ్య రెడ్డి. తన అన్న కుమార్తె హరిణ్యాకు, రాహుల్ సిప్లిగంజ్ కు హైదరాబాదులోని ఐటిసి కోహినూర్ లో ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని శ్రీనివాసులురెడ్డి స్వయంగా తెలిపారు.

హరిణ్యా రెడ్డి వ్యక్తిగత జీవితం..

హరిణ్యరెడ్డి వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. హైదరాబాదులోని సెయింట్ మేరీస్ లో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసింది. బిగ్ బాస్ కార్యక్రమానికి తెర వెనుక కీలకంగా వ్యవహరించిన ఈమె.. రాహుల్ తో గత కొన్ని సంవత్సరాల క్రితమే పరిచయం ఏర్పడినట్లు సమాచారం. ఒకరకంగా చెప్పాలి అంటే రాహుల్ కంపోజ్ చేసిన ఎన్నో ఆల్బమ్స్ కి ఈమె సహా నిర్మాతగా కూడా వ్యవహరించింది. అలా కొన్ని సంవత్సరాలపాటు స్నేహితులుగా ఉన్న వీరు ఆ తర్వాత ప్రేమలో పడి, ఇప్పుడు పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.

రాహుల్ ఎఫైర్ రూమర్స్..

ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 3లో రాహుల్ పాల్గొన్నప్పుడు అతనితో పాటు పునర్నవి భూపాలం కూడా కంటెస్టెంట్ గా పాల్గొనింది. ఆ సమయంలో వీరిద్దరి చనువు చూసి చాలామంది వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని కామెంట్లు చేశారు. అయితే ఆ వార్తలను రాహుల్ ఖండించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే హరిణ్యా- రాహుల్ స్నేహితులు కావడం గమనార్హం.

Tags:    

Similar News