ఫేమస్ నటుడు.. నీటిలో మునిగి
బెంగాలీ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్కడ ప్రముఖ నటుల్లో ఒకరైన రాహుల్ అరుణోదయ బెనర్జీ హఠాత్తుగా కన్నుమూశారు.;
బెంగాలీ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్కడ ప్రముఖ నటుల్లో ఒకరైన రాహుల్ అరుణోదయ బెనర్జీ హఠాత్తుగా కన్నుమూశారు. షూటింగ్ అనంతరం సముద్రంలో విహారానికి వెళ్లిన 42 ఏళ్ల బెనర్జీ.. ప్రమాదవశాత్తూ పడవ తిరగబడడంతో నీట మునిగి చనిపోయాడు. పశ్చిమ బెంగాల్‌లోని ఢిఘా ప్రాంతంలో ఆయన ఒక సీరియల్ చిత్రీకరణలో పాల్గొన్నారు. అనంతరం విహారం కోసం ఆయన ఒంటరిగా సముద్ర ప్రాంతానికి వెళ్లారు. ఆయన ప్రయాణిస్తున్న పడవ అనుకోకుండా తిరగబడింది. కాసేపటికి విషయం గమనించిన భద్రత సిబ్బంది బెనర్జీని బయటికి తీసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. బెనర్జీ అనుమతి లేకుండా ప్రమాదకర ప్రదేశంలో సముద్ర విహారానికి వెళ్లారని.. పోలీసులు వెల్లడించారు. బెనర్జీ మృతికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా ప్రముఖ నేతలంతా సంతాపం ప్రకటించారు.
బెనర్జీ ఇలా విహారానికి వెళ్లిన విషయమే షూటింగ్ బృందానికి తెలియలేదు. ఆయన ఎక్కడికి వెళ్లాడో తెలియక కంగారు పడుతున్న సమయంలో మరణ వార్త తెలియడంతో టీం అంతా షాక్‌కు గురైంది. రాహుల్ అరుణోదయ్ బెనర్జీ బెంగాలీలో మంచి పేరున్న నటుడే. ఆయన ‘చిరోదిని తుమీ జే అమర్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు బెనర్జీ. ఆ తర్వాత లవ్ సర్కస్, షోనో మోన్ బోలీ తోమయ్, నా హణ్యతే, కగోజెర్ బో లాంటి పలు చిత్రల్లో నటించారు. ఆయన సీరియల్స్‌లోనూ నటిస్తున్నారు. ఇప్పుడు ఢిఘా ప్రాంతానికి వెళ్లింది కూడా ఒక సీరియల్ చిత్రీకరణ కోసమే. నీటిలో ఆటలు ఎంత వినోదాన్ని ఇస్తాయో.. కొన్ని సందర్భాల్లో అంతే విషాదాన్ని పంచుతాయి. జాగ్రత్తగా లేకపోతే నిమిషాల్లో ప్రాణాలు పోతాయి. కొన్నేళ్ల ముందు మలయాళ నటుడు, ‘అయ్యప్పనుం కోషీయుం’ ఫేమ్ అనిల్ నెడుమంగడ్ సైతం ఇదే తరహాలో కేరళలో తన సినిమా షూటింగ్ అనంతరం జలపాతం దగ్గర విహారానికి వెళ్లి నీట మునిగి చనిపోవడం తెలిసిందే.